వేకువ వచ్చేనా ఎన్నటికైనా?

వేకువ వచ్చేనా ఎన్నటికైనా? - Sakshi


విశ్లేషణ

ఆర్థిక సంస్కరణల అమలు కోసం ప్రభుత్వాలు కావాలనే వ్యవసాయరంగాన్ని హతమారుస్తున్నాయి. ఆర్థిక వృద్ధి పేరిట వ్యవసాయ జనాభాలో చాలా భాగాన్ని నగరాలలో అల్ప వేతనాల శ్రామికులుగా దిగజార్చాలని యత్నిస్తున్నారు. ఆహారాన్ని కార్పొరేట్‌ వ్యవసాయం ద్వారా లేదా దిగుమతుల ద్వారా సమకూర్చుకోవచ్చు. సరిగ్గా ఇదే ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలు మన దేశం కోసం సిద్ధం చేసిన మార్గం. ఈ లక్ష్యం సాధిస్తే రేటింగ్‌ సంస్థలు మనకు ఆధిక ర్యాంకింగ్‌ ఇస్తాయి అతి చాకచక్యంగా రూపొందించిన ఆర్థిక నమూనా ఇది.



ఎప్పుడు నేను ఏ రైతు మొహంలోకి చూసినా ‘‘ఓ సుభా కభీ తో ఆయేగీ’’ (ఆ వేకువ వచ్చేనా ఎన్నటికైనా) అనే రాజ్‌కపూర్‌ పాట గుర్తుకు వస్తుంటుంది. దైన్యం నిండిన ఆ వదనంలో కొట్టవచ్చినట్టుగా నిరాశ కనిపిస్తుంటుంది. ఆ పాట పాడిన రాజ్‌కపూర్‌ కథ ఎలాగో సుఖాంతమైందిగానీ, భారత రైతు మాత్రం ఒక చక్రవ్యూహపు బంధనాల లోలోతుల్లోకి కూరుకుపోతూనే ఉన్నాడు. ఇదొక అంతేలేని నిరీక్షణ. పుష్కలంగా పంటలను పండించడానికి రైతులు గత 70 ఏళ్లుగా కష్టించి చమటోడుస్తూనే ఉన్నారు. అయినా ఏటికేడాది గడిచేకొద్దీ రైతు కుటుంబం పరిస్థితి అధ్వానమౌతూనే ఉంది. మరీ సుదూరమైనది కాని గతంలో ‘ఓడ నుంచి నోటికి’ (ఆహార దిగుమతులపై ఆధారపడిన స్థితి) అని పిలిచే దశలో మనుగడ సాగించిన దేశం మనది. ఆనాడు ఆహార సహాయం పెద్ద ఎత్తున జనాభాను ఆకలి కోరలనుంచి కాపాడింది.

ఒకప్పడు దేశానికి గర్వకారణమైన రైతు నేడు ఆర్థిక భారంగా మారాడు. కృతజ్ఞతలేని దేశం ఆ భారాన్ని వదుల్చుకోడానికి ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా? అని ఎదురు చూస్తోంది.



రైతు భిక్ష ఆహార స్వయంసమృద్ధి

1965లో నాటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి, వియత్నాం యుద్ధాన్ని ‘‘దురాక్రమణ చర్య’’గా పేర్కొనడం అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌కు ఆగ్రహాన్ని కలిగించింది. ఒక ఆకలిగొట్టు దేశం అమెరికాను దురాక్రమణదారు అనడానికి ఎలా సాహసిస్తుంది? అని ఆహార సరఫరాలను నిలిపి వేయడంతో మన ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది. ఒక సమయంలో ఆహార ధాన్యాల నిల్వలు వారానికి మాత్రమే సరిపోయే స్థితి ఏర్పడింది. దీంతో సర్వత్రా భయాందోళనలు వ్యాపించిపోయాయి. లోతుగా విస్తరిస్తున్న ఆహార సంక్షోభానికి జవాబుగా శాస్త్రి, ప్రతి సోమవారం ఉపవాసం పాటించాలని  విజ్ఞప్తి చేశారు. ఆహార స్వయంసమృద్ధిని సాధించడంలో రైతు నిర్వహించగల గొప్ప పాత్రను గుర్తించిన ఆయన జై జవాన్, జై కిసాన్‌ నినాదాన్ని రూపొం దించారు. ఆ తర్వాత విజయవంతంగా పాల సహకార సంఘాలను ప్రారంభించారు. అవే ఆ తర్వాత క్షీర విప్లవాన్ని తెచ్చాయి. ప్రధాని ఇందిరాగాంధీ వాస్తవంగానే హరిత విప్లవానికి బీజాలు వేశారు. ప్రభుత్వం మెక్సికో నుంచి అధిక దిగుబడినిచ్చే గోధుమ పొట్టి వంగడాలను దిగుమతి చేసుకుని, నీటి పారుదల సదుపాయాలను, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలను అందుబాటులో ఉంచగా, ఆ మిగతా పనిని రైతులు చేశారు. 1967లో హరిత విప్లవ సాంకేతికతను ప్రవేశపెట్టిన తర్వాతి తొలి పంట నూర్పిడి కాలానికి ఆహారధాన్యాల ఉత్పత్తి 50 లక్షల టన్నుల రికార్డు స్థాయికి చేరింది. ఇక దేశం వెనక్కు చూసిందే లేదు. భారతదేశం ఆహార స్వయంసమృద్ధిని సాధించింది.



అయితే, ప్రభుత్వం ఆనాడు రైతులకు అందించిన ఆర్థిక ప్రోత్సాహకాలు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. 1970లో పాఠశాల ఉపాధ్యాయుల వేతనం నెలకు రూ.90 ఉన్నప్పుడు, గోధుమ కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ) క్వింటాలుకు రూ. 76. అధిక ధరకు, మార్కెట్‌కు హామీని (ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుతో) రైతుకు కల్పించారు. రైతులకు ‘ఘననీయమైనది’ అయిన ఆ కాలం ఓ దశాబ్దిన్నర పాటూ కొనసాగింది. హరిత విప్లవం చిన్న రైతుల జీవితాల్లోకి తొంగి చూడకుండానే సాగినా, అది సౌభాగ్యం గురించి ఆశాజనకమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. అభ్యుదయ రైతు ట్రాక్టర్‌ నడుపుతున్న బొమ్మ సౌభాగ్యానికి సంకేతమైంది. వాస్తవానికి, ఉత్పత్తిలోని పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయ ఆదాయాలు పెరగలేదు. వరుసగా వచ్చిన ప్రభుత్వాలు భారీ దిగుబడులతో సంతృప్తిచెంది, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. ప్రభుత్వరంగ పెట్టుబడుల రేటు క్షీణించడం దీనికి తోడు కాగా, 1980ల మధ్య నుంచి వ్యవసాయరంగ పతనం ప్రారంభమైంది.



కొనితెచ్చుకుంటున్న ఆహార పరాధీనత

1991 నాటికి, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అస్తిత్వంలోకి వచ్చాక, దేశం వ్యవసాయం మీద నుంచి దృష్టిని మరల్చడం మొదలెట్టింది. అదే సమయంలో యూరప్, అమెరికాలు కూడా భారీ ఎత్తున ఆహారం, పాలు, వెన్న భారీ నిల్వలను కూడబెట్టసాగాయి. దీంతో, ప్రధాన స్రవంతి ఆర్థిక చింతన ప్రపంచ పోటీపైకి మరలింది. చౌక దిగుమతులకు అనువుగా దిగుమతి సుంకాలను తగ్గించడం మొదలైంది. అదేసమయంలో, ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణ భారాన్నంతటినీ రైతులపై మోపారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 1990–2010 మధ్య ప్రపంచస్థాయిలోనే స్థిరంగా ఉండిపోయాయి. నిరాశాజనకమైన ఈ ధోరణి కొనసాగుతూనే ఉంది. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని నిరాకరిçస్తున్నా, సమాజంలోని ఇతర సెక్షన్ల జీతాలు భారీగా పెరిగాయి. 1970–2015 మధ్య పాఠశాల ఉపాధ్యాయుల వేతనాలు 280 నుంచి 320 రెట్లు, ప్రభుత్వోద్యోగుల జీతాలు 120 నుంచి 150 రెట్లు పెరిగాయి. అదే కాలంలో రైతులకు ఇచ్చే గోధుమ ధర మాత్రం 19 రెట్లే పెరిగింది. వ్యవసాయం లాభసాటిగా కాకుండా పోయింది, ఇతరులతో సమానమైన పరిస్థితులను వ్యవసాయానికి కల్పించాలని ఏళ్ల తరబడి చేస్తున్న డిమాండు ప్రభుత్వాల చెవికి ఎక్కడం లేదు.



1996–2015 మధ్య 20 ఏళ్లలో భారత్‌ 40 కోట్ల మందిని వ్యవసాయం నుంచి బయటకు పంపాలని ప్రపంచ బ్యాంకు నిర్దేశించింది. అదిచ్చే ప్రతి రుణానికి దాదాపు 140 నుంచి 150 షరతులు ఉంటాయి. కాబట్టి దాని ప్రతి రుణమూ రైతులను వ్యవసాయం నుంచి తొలగించడాన్ని నొక్కి చెబుతూనే ఉంది. 70 శాతం రైతాంగాన్ని వ్యవసాయం నుంచి తరలించాల్సిన అవసరం ఉన్నదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పదే పదే చెప్పేవారు. అదే మన దేశంలో అతి పెద్ద ఆర్థిక సంస్కరణ అవుతుందని రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. అది జరిగినప్పుడే మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చౌక శ్రమ అందుబాటులోకి వస్తుందని వారి భావన. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతూ వ్యవసాయరంగం పట్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని చూపింది. ప్రభుత్వాలన్నీ వ్యవసాయాన్ని లాభదాయకం కానిదిగా చేసి, పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయాన్ని వీడి పట్టణాలకు పోక తప్పని పరిస్థితులను కావాలనే కల్పించాయి. ఈలోగా ఆహార దిగుమతులు విపరీ తంగా పెరిగాయి. 2015–16లో అవి రూ.1,40,268 కోట్లకు చేరాయి. ఇది, వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ కంటే ఎక్కువ.



రైతును భూమి నుంచే గెటేస్తేనే వృద్ధి!

రైతులను వ్యవసాయం నుంచి గెంటేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటి నుంచి దిగుమతులకు మళ్లడం కూడా జరిగింది. ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణ భారాన్ని రైతులపై మోపడంతో, వారికి ఉత్పత్తి ఖర్చులకు సైతం సరిపోని ధరలను చెల్లించడం అలవాటుగా జరిగిపోతోంది. పప్పులు, నూనె గింజల దిగుమతుల కోసం ఆఫ్రికా, బ్రిక్స్‌ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో గోధుమ దిగుమతులూ మొదలౌతాయి. ఆహార స్వయంసమృద్ధి నుంచి ఆహారం కోసం దిగుమతులపై ఆధారపడటం వైపునకు మళ్లే కృషి జరుగుతోంది. ఆహారాన్ని దిగుమతి చేసుకోవడం అంటే నిరుద్యోగాన్ని దిగుమతి చేసుకోవడమేనని గుర్తించడం లేదు. ఆహార దిగుమతులు మొదట చిన్న రైతులను దెబ్బతీసి, సాగు మానేసి వారు పట్టణాలకు వలసపోయేలా చేస్తాయి. ఇలాంటి వివరాలు ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలకు అర్థరహితమైవిగా తోస్తాయి. వారి దృష్టంతా రైతులను వ్యవసాయం నుంచి తరిమేయడం మీదనే ఉంది. దాన్నే మన విధానకర్తలు ఆర్థికవృద్ధి వ్యూహంగా అనుసరిస్తున్నారు. ప్రపంచంలోని దేశాలన్నీ ఉద్యోగాలు లేని వృద్ధిని చవి చూస్తున్నాయి. మనం అందుకు మినహాయింపు కాదు. ఈ పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగలిగేది వ్యవసాయమేనని గుర్తించడం లేదు.



ఏదిఏమైనా, ప్రతి కోతల కాలం తర్వాత వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఘోరంగా పడిపోతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధరల హామీనైనా కల్పించకుండా ప్రభుత్వం ఆదుకోవడానికి నిరాకరిస్తున్నది. రైతులు అంతేలేని రుణ విషవలయం అనే చక్రవ్యూహం లోలోతులకు కూరుకుపోతున్నారు. ఎమ్‌ఎస్‌పీ ఇచ్చిన సందర్భాల్లో కూడా అది ఉత్పతి వ్యయం కంటే తరచూ తక్కువగా ఉంటోంది. ఉదాహరణకు మహారాష్ట్రలో కందిపప్పు ఉత్పతి వ్యయం క్వింటాలుకు రూ.6,240, ఎమ్‌ఎస్‌పీ రూ.5,050, రైతులు వాస్తవంగా మార్కెట్లో అమ్ముకోగలుగుతున్న ధర రూ. 3,500 నుంచి రూ. 4,200 మాత్రమే. హరియాణా రైతు మూడు నెలలు కష్టించి బంగాళాదుంపలు పుష్కలంగా పండిస్తే, వాటిని కిలో 9 పైసలకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇవేవో చెదురు మదురు ఘటనలు కావు, ఇలా ఏటా పంట రైతు చేతికొచ్చాక ధరలు కుప్పకూలడం ఆనవాయితీగా మారింది. అందువల్లనే ఇటీవల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రైతులు ఆగ్రహంతో ఆందోళనలు సాగించారు. ఈ నిరసనలు, ముందు రానున్న సినిమాకు ట్రైలర్‌ మాత్రమేనని నా అభిప్రాయం.



 ఏటికేడాది రెట్టింపయ్యే అప్పుల ఊబిలో బతకమని ప్రభుత్వాలు రైతులను వదిలేశాయి. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగానే పేదరికంలో మగ్గేలా చేస్తున్నాయి. రైతాంగంలో 58 శాతం ప్రతి రాత్రీ ఆకలి కడుపుతో పడుకోవాల్సి వస్తోందని ఒక అంచనా. దేశంలోని 17 రాష్ట్రాల అంటే దాదాపు సగభాగంలో రైతుకుటుంబాల సగటు వార్షిక ఆదాయం రూ. 20,000, అంటే నెలకు రూ. 1,700 అని 2016 ఆర్థిక సర్వే చెబుతోంది. ఇది ఒక ఆవును పెంచడానికే సరిపోదు, మరి రైతు కుటుంబాలు ఎలా నెట్టుకొస్తున్నాయా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రైతాంగానికి వ్యవసాయాన్ని గర్వకారణంగామార్చే ఆ ఉదయం ఎన్నటికైనా వస్తుందా?



ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని హతమారుస్తున్నాయి. ఆర్థిక వృద్ధిని సాధించాలంటూ ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రవేత్తలు వ్యవసాయంలోని జనాభాలో చాలా భాగాన్ని నగరాలలో చౌకగా దొరికే శ్రామికులుగా మార్చాలని చూస్తున్నారు. ఆహారాన్ని కార్పొరేట్‌ వ్యవసాయం ద్వారా లేదా దిగుమతుల ద్వారా సమకూర్చుకోవచ్చు. సరిగ్గా ఇదే ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు మన దేశం కోసం రూపొందించిన మార్గం. ఈ లక్ష్యం సాధించినందుకు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజన్సీలు మనకు అధిక ర్యాంకింగ్‌ ఇస్తాయి. అతి చాకచక్యంగా రూపొందించిన ఆర్థిక నమూనా ఇది.



వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు

దేవిందర్‌శర్మ

hunger55@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top