దీపికా పదుకోన్ రాయని డైరీ

దీపికా పదుకోన్ రాయని డైరీ - Sakshi


న్యూస్‌లో లేరేమిటి? ప్రశ్న.  కెనడా లో ఉన్నాను. సమాధానం. ఐదు రోజులుగా ఒకే ప్రశ్న. ఒకే సమాధానం. కెనడాలో ఉన్నట్లయినా న్యూస్ లేదేమిటి?.. ఈ ఉదయం కొత్త అనుబంధ ప్రశ్న. గుర్తు పట్టాను. రణవీర్!! గొంతు మార్చాడు. నంబరు మార్చాడు! ఏమిటిది వీర్ అన్నాను. నవ్వాడు. ఎప్పుడొస్తున్నావ్ అన్నాడు. నా హీరోని అడిగి చెప్తానన్నాను. సమాధానం లేదు. ప్రశ్నా లేదు. బాయ్‌ఫ్రెండ్ బాజీరావ్‌కి కోపం వచ్చినట్లుంది. నవ్వాను. ‘అక్కర్లేదు’ అన్నాడు. ‘ఏమిటి అక్కర్లేదు? నేను ఇండియా రానక్కర్లేదా?’ - మళ్లీ నవ్వాను. ‘కాదు.. కాదు.. నువ్వేం పనిగట్టుకోనక్కర్లేదు నవ్వడానికి. నీ చీక్స్ అండ్ లిప్స్.. మేడ్ ఆఫ్ స్మైల్స్ కదా అనీ’ అన్నాడు. పొయెట్రీ! ఫైవ్ డేస్ కనిపించకపోయేసరికి!!

 

 ‘పనిలో పడితే నీకు లోకమే తెలీదు’.. మధ్యాహ్నం మళ్లీ ఫోన్. కవిత్వం పూర్తయింది. ఇప్పుడు కంప్లైంట్! అమ్మాయిలంతా అందుకే అంతందంగా ఉంటారు వీర్.. అన్నాను. ‘సరే. క్షణం తీరిక లేకుండా నువ్వు కూడా అందంగా ఉండు’ అని ఫోన్ పెట్టేశాడు. కోపం! షూటింగ్‌లో బ్రేకొస్తే మాట్లాడ్డం కాదు.. షూటింగ్‌ని బ్రేక్ చేసి మాట్లాడాలి అంటాడు. చిన్నపిల్లాడిలా! అంతమంది కోసం మనిద్దరం అప్పుడప్పుడు బ్రేక్ అవడం బాగుంటుంది కదా అంటే ఈ పిల్లాడికి అర్థమౌతుందా?

 

 కెనడా  క్లైమేట్ కొత్తగా ఏం లేదు. పగలు ఎండ. రాత్రి చలి. ఇంకో ఇండియాలా ఉంది! రెండు పూటలా షూటింగ్. నేను, నాతో పాటు ఇద్దరు అమ్మాయిలు. రూబీ, నీనా. రూబీ మెల్‌బోర్న్ అమ్మాయి. బాయిష్ హెయిర్ స్టెయిల్. బాగుంటుంది. నీనా బల్గేరియా గర్ల్. పసిపిల్ల ముఖం. సీరియస్‌గా ముఖం పెట్టినా నవ్వినట్టే ఉంటుంది. ముగ్గురం కలిసి హాలీవుడ్ మూవీకి చేస్తున్నాం. ఇక్కడ నా హీరో విన్ డీజిల్. మూవీలో అతడి మాజీ ప్రియురాలిని.

 

 వచ్చిన మొదటి రోజే నీనా అడిగింది.. ఇండియాలో మీరు స్టార్ అట కదా అని. నవ్వాను. ఇంకా చాలామంది ఉన్నారని చెప్పాను. ఇండియాలో.. పని చేసే ప్రతి అమ్మాయీ స్టారే అని చెప్పాను. సినిమాల్లోనే కాదు.. ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఆర్గనైజేషన్స్.. ఎక్కడ, ఏ చిన్న పని చేస్తున్న అమ్మాయైనా స్టారే అన్నాను. ‘వావ్’ అన్నారు నీనా, రూబీ. ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. రూబీ అడిగింది.. ‘అరగంటకోసారి ఏదో ఒకటి లాగించేస్తున్నావ్!’ అని. ‘నా చర్మం మెరుపు రహస్యం అదే’  అన్నాను నవ్వేస్తూ. కళ్లింత చేసుకుంది.

 

 ఇండియా నుంచి వచ్చేటప్పుడు అనిపించింది.. కంఫర్ట్ జోన్‌లోంచి కొత్త జోన్‌లోకి వెళుతున్నాను.. యాక్ట్ చేయగలనా అని. బట్టలతో పాటు టెన్షన్‌నీ బ్యాగేజీ నిండా సర్దుకుని వచ్చాను. పనిలో పడ్డాక టెన్షన్‌ని ఎవరో కొట్టేశారు. ఒకటైతే వాస్తవం. పని మన ఫేస్ ప్యాక్. ఫుడ్డు మన స్కిన్ గ్లో. రెండూ ఉంటే.. అందంగా, సంతోషంగా ఉంటాం. ఇండియా వెళ్లాక ఈ విషయం మన అమ్మాయిలకు  చెప్పాలి.

- మాధవ్ శింగరాజు

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top