భజన రాదంటే బలిపీఠానికే!

భజన రాదంటే బలిపీఠానికే!


రూల్‌ ప్రకారం పనిచేస్తాను, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాను అంటే కృష్ణారావును ఎందుకు ఉండనిస్తారు, ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ల కారణం చూపి హడావుడిగా ఇంటికి పంపెయ్యక. ఈ కారణాల ఆధారంగానే కృష్ణారావును తొలగించాలనుకుంటే, ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి మర్యాదగా చెప్తే ఆయనే రాజీనామా చేసి వెళ్లేవారు కదా! అట్లా చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకవుతారు? చంద్రబాబు ఇప్పుడు ఎందరి చేతుల్లోనో బందీ. వాళ్లను ఏమీ చెయ్యలేకనే కృష్ణారావు లాంటి వాళ్ల మీద తన ప్రతాపం చూపుతుంటారు.



‘మనం ఫాసిజంలో బతుకుతున్నామా?’ఇదేదో మామూలుగా వినిపించే ప్రశ్న కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక ఉన్నత ఐఏఎస్‌ అధికారి మంగళవారం(20–6–17) మధ్యాహ్నం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల గోష్టి నిర్వహించి వెలిబుచ్చిన ఆవేదన ఇది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉన్నదో ఇదే స్పష్టం చేస్తున్నది. రాష్ట్రం విడిపోయి, ఆంధ్రప్రదేశ్‌ వేరు రాష్ట్రం అయ్యాక మొదటి రెండు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు తప్పనిసరిగా ఆందోళన కలిగించే విషయాలే. పదవీ విరమణ అనంతరం రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా నియమితులయిన కృష్ణారావును మంగళవారం ఉదయం ఆ పదవి నుంచి తొలగించారు. దానికి కారణం– తన అభిప్రాయాలను స్వేచ్ఛగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడమే. నిజమే, ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నారు కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలూ, భావాలూ ఉన్నా అణచివేసుకోవాలే తప్ప వెల్లడించడానికి వీల్లేదు.


ఈ నిబంధన నుంచి అధికార రాజకీయ పక్షానికి చెందిన నాయకులకు మాత్రం మినహాయింపు ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లో. అదీ అందరికీ కాదు, జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని నాని, బొండా ఉమా, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అయ్యన్నపాత్రుడు తరహా నాయకులకు మాత్రమే ఉంటుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ మనిషికి ఊపిరి కంటే ముఖ్యం, అది సంపూర్ణంగా ఉన్న సమాజమే పురోగతిని సాధించగలదు అన్న వాస్తవం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పెద్దలకూ, ముఖ్యంగా దాని అధినేత చంద్రబాబునాయుడుకూ అస్సలు పట్టదు. అందుకే ఐవైఆర్‌ కృష్ణారావు మీద వేటు పడింది. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ప్రభుత్వానికీ, తెలుగుదేశం పార్టీకీ నచ్చని, నష్టం చేసే పోస్టింగ్‌లు పెట్టిన లేదా ఇతరులు పెట్టిన పోస్టింగ్‌లను ఫార్వర్డ్‌ చేసిన పాపానికి కృష్ణారావు చైర్మన్‌ పదవి ఊడిపోయింది.


సామాజిక వర్గాల మనోభావాలు పట్టవా?

కృష్ణారావు పెట్టిన పోస్టింగ్‌లు ఏవి? ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న పరిస్థితి మీద తన లేదా తన లాంటి కొందరు ఇతరుల అభిప్రాయాలు– అవి వ్యంగ్యచిత్రాలు కావచ్చు, వ్యంగ్యవ్యాఖ్యలూ కావచ్చు, అలాంటివే అన్నీ. ప్రభుత్వంలో భాగమయిన ఒక కార్పొరేషన్‌కు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సొంత అభిప్రాయాలు కలిగి ఉండకూడదని నిబంధన ఏమీలేదు. మేము జీతం ఇస్తున్నాం కదా అనవచ్చు, కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకున్నా అది ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నది మాత్రం కాదు, ప్రజల డబ్బు అన్న విషయం మరిచిపోకూడదు. అసలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదు అన్న నిబంధన ఏమయినా ఉంటే దాన్ని తక్షణం రద్దు చేసి పారెయ్యాలి.


అందులోనూ ప్రజలకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం పరిపాలన సాగినప్పుడు, ప్రజల ప్రా«థమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఏలికలు ప్రవర్తించినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఎవరయినా సరే, ఏ స్థాయి వాళ్లయినా సరే నిలబడి మాట్లాడాల్సిందే. సామాజిక మాధ్యమాలలో చంద్రబాబునాయుడు పరిపాలన తీరుతెన్నుల మీద, అధికార పక్ష పెద్దల వ్యవహార శైలి మీదా వ్యంగ్యచిత్రాలు వేసినందుకు ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్‌ చెయ్యడం తప్పు అని భావించారు కృష్ణారావు, భావించి ప్రభుత్వ కొలువులో ఉన్నాను కాబట్టి బయటికి మాట్లాడకూడదు అని ఊరుకోకుండా తన భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకున్నందుకు ఆయనను అందరూ అభినందించి తీరాల్సిందే. ఇంతకూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఇతర విషయాలు ఏమిటి? చంద్రబాబునాయుడి బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పోస్ట్‌ పెట్టారు.


చరిత్రను వక్రీకరించిన ఆ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఎట్లా ఇస్తారన్నది ఆయన వాదన. ఆ సినిమా చరిత్ర వక్రీకరణేనన్న విషయం ఒక్క కృష్ణారావు గారేం ఖర్మ, మొత్తం లోకం కోడయి కూస్తున్నది. అంత మాత్రానికే తెలుగుదేశం కార్యకర్తలకు కోపం రావాలా? ఆయనను హడావుడిగా ఉద్యోగం నుంచి తొలగించే దాకా ముఖ్యమంత్రి వెళ్లాలా? కృష్ణారావును తొలగించి, ఆయన స్థానంలో ఇంకో బ్రాహ్మణ ప్రముఖుడిని అధ్యక్షుడిగా నియమించవచ్చు, తన ఆస్థానంలోనే ఉన్న ఇంకో వందిమాగధ ప్రముఖుడి చేత ఆయన మీద నిందలు మోపవచ్చు.


అంతమాత్రం చేత కృష్ణారావును తొలగించిన కారణం, తీరు ఆ సామాజిక వర్గ ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో చూసుకోవద్దా? చంద్రబాబునాయుడు రెండవ విడత అధికారంలోకి వచ్చాక ఇటువంటి విషయాలేవీ పట్టించుకోవడం లేదు. వివిధ సామాజిక వర్గాల మనోభావాలను ఆయన ఎట్లా గాయపరుస్తున్నారో రిజర్వేషన్‌లు కల్పిస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చండి మహాప్రభో అంటూ ఉద్యమం చేస్తున్న కాపు కులస్తుల పట్లా, ఆ ఉద్యమ నేత, సీనియర్‌ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్లా, ఆయన కుటుంబం పట్లా దారుణంగా వ్యవహరించడాన్ని బట్టే అర్థమవుతుంది.


పోస్టింగులే కారణమా?

నిజానికి కృష్ణారావును తొలగించింది ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టింగ్‌ల కారణంగా అనుకుంటే పొరపాటు. అందుకు వేరే కారణాలు ఉన్నాయి. తన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఒక కార్పొరేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఆరుమాసాల పాటు కలవడానికి అపాయింట్‌మెంట్‌ ఉండదు. కానీ రోజుకు సగటున ఎనిమిది నుంచి పది గంటల సేపు ముఖ్యమంత్రి ఇస్తున్న ఉపన్యాసాలలో ప్రజోపయోగం ఎంతో అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడికి ఏ వ్యవస్థ మీదా గౌరవం ఉండదు, అన్నిటినీ ఆయన ఓటు బ్యాంకులుగానే చూస్తారు. అధికార రాజకీయాలనే ఆయన శ్వాసిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బ్రాహ్మణులు అందరినీ తెలుగుదేశం బ్రాహ్మణులుగా మార్చే ఉద్యోగం ఇచ్చారు చంద్రబాబునాయుడు.


అది అర్థం చేసుకోలేని అమాయకపు కృష్ణారావు రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణులందరికీ సేవ చెయ్యాలనీ, ఒక వ్యవస్థను నిర్మించాలనీ అనుకున్నారు. తెలుగుదేశం తమ్ముళ్లనే ఆయన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాల సమన్వయకర్తలుగా నియమించారు. కానీ ఆ కార్పొరేషన్‌ ద్వారా అందే సహాయం కూడా టీడీపీ బ్రాహ్మణులకే ఇవ్వాలన్న మాట ఆయన మరిచిపోయారు. అందుకే తెలుగు తమ్ముళ్లు కృష్ణారావు వైఎస్‌ఆర్‌సీపీ బ్రాహ్మణులకూ, కాంగ్రెస్‌ బ్రాహ్మణులకూ, కమ్యూనిస్ట్‌ బ్రాహ్మణులకూ సహాయం చెయ్యడం మీద అధినేతకు ఫిర్యాదు చేశారు. అర్హత, అవసరం కలవారే అయినా, వేరే పార్టీల వాళ్లకు ఎట్లా సహాయం చేస్తారన్నది చంద్రబాబునాయుడూ, ఆయన పార్టీ నాయకులూ, కార్యకర్తల విమర్శ.


ఇతర పార్టీల కార్యకర్తలకు హక్కు లేదా?

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కోట్ల మంది కూడా ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి, ఆ పార్టీకే ఓట్లెయ్యాలి, ఆ అధినేత, ఆయన కుమారుడికే పల్లకీ మోయాలి అన్నది వాళ్ల అభిమతం. కృష్ణారావు ఆ పని చెయ్యక పోగా అదే పనికోసం ఏర్పాటయిన జన్మభూమి కమిటీలను ఖాతరు చెయ్యకపోవడం ఇంకెంత పెద్ద నేరం! అందుకే ఆయనకు ఉద్వాసన పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికి వెళ్లినా జన్మభూమి కమిటీలలో ఎవరు ఉన్నారో, అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ఎవరు భోంచేస్తున్నారో జనం కథలు కథలుగా చెప్తారు. అయినా కృష్ణారావుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయాలు తెలియవు. అవి తెలిసిన జేసీ దివాకర్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు వగైరా వగైరా నాయకులనయితే చంద్రబాబు నాయుడు పదిలంగా చూసుకుంటారు.


తనవారి ఆగడాల మాటో?!

విమానాశ్రయ ఉద్యోగితో మాటా మాటా జరిగినందుకే మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి ప్రజా ప్రతినిధులు జైలుకు వెళ్లాలి. విమానాశ్రయంలో వీరంగం వేసి భౌతికదాడికి దిగినా కూడా జేసీ దివాకర్‌రెడ్డి మీద ఏ చర్యా ఉండదు. కనీసం కేసు కూడా ఉండదు. ఎందుకంటే మిథున్, భాస్కరరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ కాబట్టి కేసులు. దివాకర్‌రెడ్డి తెలుగుదేశం కాబట్టి కేసులు లేవు. కేశినేని నాని, బొండా ఉమా తెలుగుదేశం కాబట్టి ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంను దుర్భాషలాడినా, ఉద్యోగులు, అధికారుల మీద చెయ్యి చేసుకున్నా చర్యలుండవు. ఒక ప్రమాదంలో మరణించినవారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టర్‌ను నిలదీసినందుకు ప్రతిపక్ష నాయకుడు నేరస్తుడవుతాడు. మహిళా ఉద్యోగిని బరబరా ఈడ్చుకుపోయి కొట్టినా తెలుగుదేశం శాసనసభ్యుడు కాబట్టి చింతమనేని ప్రభాకర్‌ను పల్లెత్తు మాట అనరు.


ఇవన్నీ తెలిసీ రూల్‌ ప్రకారం పనిచేస్తాను, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాను అంటే కృష్ణారావును ఎందుకు ఉండనిస్తారు, ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ల కారణం చూపి హడావుడిగా ఇంటికి పంపెయ్యక. ఈ కారణాల ఆధారంగానే కృష్ణారావును తొలగించాలనుకుంటే, ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి మర్యాదగా చెప్తే ఆయనే రాజీనామా చేసి వెళ్లేవారు కదా! అట్లా చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకవుతారు? చంద్రబాబు ఇప్పుడు ఎందరి చేతుల్లోనో బందీ. కింద కార్యకర్తల నుంచి మీద నాయకుల దాకా అందరి చేతుల్లో బందీ. వాళ్లను ఆయన ఏమీ చెయ్యలేకనే కృష్ణారావు లాంటి వాళ్ల మీద తన ప్రతాపం చూపుతుంటారు.



దేవులపల్లి అమర్

datelinehyderabad@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top