ఒరిగిన తెలుగు శిఖరం

ఒరిగిన తెలుగు శిఖరం - Sakshi


దాసరి బహుముఖీనుడు. త్రిముఖుడిగా ప్రముఖుడు. సినిమా ఒక ముఖం. అది ప్రధానమైనది. పత్రికా ప్రపంచం రెండో ముఖం. రాజకీయం మూడోది. మూడు రంగాలలోనూ తనదైన ముద్ర బలంగా వేసిన సమర్థుడు ఆయన. దర్శకరత్నగా అందరి అభిమానం చూరగొన్నారు. 151 సినిమాలకు దర్శకత్వం వహించి లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఎక్కారు. 53 సినిమాలు నిర్మించారు. దాదాపు 250 సినిమాలకు కథ, మాటలు రాశారు. చాలా సినిమాలకు పాటలు కూడా రాశారు. టీవీ (దూరదర్శన్‌) కోసం సుదీర్ఘమైన సీరియల్‌ ‘విశ్వామిత్ర’ నిర్మించి, దర్శకత్వం వహించారు.



దాసరి నారాయణరావు అస్తమయంతో ఒక తెలుగు శిఖరం ఒరిగి పోయింది. తెలుగు సినీ పరిశ్రమ అనాథగా మారింది. తెలుగు రాజకీయంలో ఒకానొక శూన్యం ఏర్పడింది. తెలుగు పత్రికారంగంలో ఆద్భుతంగా వెలిగిన తారాజువ్వ ఆరిపోయింది. దాసరితో పరిచయం ఉన్నవారూ, ఆయనతో కలసి పనిచేసినవారూ, ఆయన శిష్యరికం చేసినవారూ అందరూ ఆయనను త్రికరణశుద్ధిగా ప్రేమించేవారే. దాసరి శిష్యులమంటూ సగర్వంగా చాటుకునే వారు వందమందికి మించి ఉండటం ఆయన ప్రతిభకూ, వాత్సల్యానికీ, పరిశ్రమకూ నిదర్శనం.



పేదరికంలో పుట్టి, చందాలతో చదువు సాగించి, హైదరాబాద్‌ వీధులలో చెప్పులు లేకుండా తిరిగిన వ్యక్తి ఆయన. సినిమా పరిశ్రమలో ప్రఖ్యాత  రచయిత పాలగుమ్మి పద్మరాజు శిష్యుడిగా జీవితం ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగిన సృజనశీలి దాసరి. హీరోలు రాజ్యం చేసే కాలంలో పేరు లేని కొత్త నటులకు కథానాయకుడి పాత్రనూ, కథా నాయకి పాత్రనూ ఇచ్చి వారిలో దాగున్న ప్రతిభను వెలికితీసి వారిని చిత్ర పరిశ్రమలో నిలబెట్టిన ఘనత దాసరిది. దర్శకుడి నిర్వచనాన్ని, సినిమా పరి శ్రమలో అప్పటి వరకూ ఉన్న నియమనిబంధనలను పూర్తిగా మార్చివేసిన నిర్దేశకుడు ఆయన.



నిండైన విగ్రహం, చక్కటి వాచకం, నేల విడవని సాము, అర్భకులకు అండగా ఉంటూ న్యాయం కోసం ఎంత పెద్దవారినైనా ఎదిరించి పోరాడే స్వభావం ఆయనను ఒక సమున్నత  శిఖరంగా నిలబెట్టాయి. దాస రిది నిండు జీవితం. జీవిత సహచరి పద్మ మరణం ఆయనను కుంగదీసింది. కొన్ని మాసాలుగా అనారోగ్యంతో చాలా బాధ అనుభవించారు. దాదాపు మూడు మాసాలు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లోనే ఉన్నారు. ఆయనను కాపా డటానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన శరీరం ఒక ప్రయోగశాలగా మారింది. ఒక సమస్య పరిష్కరిస్తే మరో సమస్య తలె త్తేది. ఊపిరితిత్తులతో ప్రారంభమైన అనారోగ్యం మూత్రపిండ వ్యాధికి దారి తీసింది. ఆహారం లేదు. కాళ్ళు సన్నబడినాయి. గురువారం సాయంత్రం ఆయన చివరి శ్వాస వదలడం ఒక రకంగా నరక యాతన నుంచి  విముక్తి. మేలో పుట్టిన దాసరి మేలోనే కాలం చేశారు.



నాకు వ్యక్తిగతంగా దాసరి నారాయణరావు 1984లో ‘ఉదయం’  పత్రిక ప్రారంభించినప్పటి నుంచి పరిచయం. ఆ పత్రికలో పనిచేయడం వల్ల నాకు విశేషమైన గుర్తింపు వచ్చింది. అనేక విన్యాసాలు చేయడానికి అవకాశం దక్కింది. వందల మంది యువ జర్నలిస్టులను సుశిక్షితులైన అక్షర సైనికు లుగా తీర్చిదిద్దడానికి వీలు కలిగింది. 1985 మే 4 నుంచి మొన్న మే 4 వ తేదీ వరకూ నేను ఎక్కడ, ఏ పత్రికలో ఉన్నా దాసరి పుట్టినరోజున ఆయన ఇంటికి వెళ్ళి అభినందించవలసిందే. పాత మిత్రులను కలుసుకొని కబుర్లు చెప్పు కోవడానికీ, ‘ఉదయం’ స్మృతులను పంచుకోవడానికీ  మంచి అవకాశాన్ని ఆ రోజు ప్రసాదిస్తుంది.  ఈ ఏడాది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత మరుసటి రోజు కూడా నేనూ, మా శర్మ దాసరి ఇంటికి వెళ్ళాం. అప్పుడు ఆయన అన్నగారితో కలిసి సినిమా చూస్తున్నారు. అదే ఆయన ప్రపంచం.



దాసరి బహుముఖీనుడు. త్రిముఖుడిగా ప్రముఖుడు. సినిమా ఒక ముఖం. అది ప్రధానమైనది. పత్రికా ప్రపంచం రెండో ముఖం. రాజకీయం మూడోది. మూడు రంగాలలోనూ తనదైన ముద్ర బలంగా వేసిన సమర్థుడు ఆయన. దర్శకరత్నగా అందరి అభిమానం చూరగొన్నారు. 151 సినిమాలకు దర్శకత్వం వహించి లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఎక్కారు. 53 సిని మాలు నిర్మించారు. దాదాపు 250 సినిమాలకు కథ, మాటలు రాశారు. చాలా సినిమాలకు పాటలు కూడా రాశారు. టీవీ (దూరదర్శన్‌) కోసం సుదీర్ఘమైన సీరియల్‌ ‘విశ్వామిత్ర’ నిర్మించి, దర్శకత్వం వహించారు. సినిమా రంగంలో యథాతథ స్థితిని తోసిరాజని కొత్త వరవడి సృష్టించిన వ్యక్తి దాసరి.



ఆయన కంటే ముందు లబ్ధప్రతిష్ఠులైన దర్శకులు కొందరు ఉన్నారు. కానీ వారు ఎవరూ దాసరి చేసినన్ని ప్రయోగాలు చేయలేదు. ఆయన తయారు చేసినంత మంది దర్శకులను మరెవ్వరూ తయారు చేయలేదు. సినిమా రంగంలోని ప్రతి విభాగాన్ని సంస్కరించారు. విశ్వనాథ్‌ కళాత్మకతకి ప్రాధాన్యం ఇస్తే, రాఘవేంద్రరావు కమర్షియల్‌ సినిమాలకు దర్శకత్వం వహించారు. దాసరి ‘తాతామనవడు’ వంటి కుటుంబ కథా చిత్రంతో ప్రారంభించి ‘మేఘ సందేశం’ వంటి కళాత్మకమైన సినిమాలూ, ‘బొబ్బిలిపులి’ వంటి కమర్షియల్‌ సినిమాలు, ‘నీడ’ వంటి సందేశాత్మకమైన సినిమాలూ, ‘ఒసే రాములమ్మ’ వంటి విప్లవాత్మక సినిమాలూ తీశారు. దర్శకుడిగానే కాకుండా కథా రచ యితగా, మాటలు, పాటల రచయితగా కూడా ఆయన ఘనవిజయాలు సాధించారు.



చిన్న సినిమాలకు పెద్ద పేరు తెచ్చారు. జాతీయ స్థాయి పుర స్కారాలు అందుకున్నారు. ప్రేక్షక హృదయాలలో శాశ్వత స్థానం సంపాదిం చారు.  ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకుడి అవతారం దాసరి ప్రోత్సాహంతోనే (కన్యాకుమారి). హీరో మహేశ్‌బాబు బాల నటుడుగా ప్రవేశించింది దాసరి దర్శకత్వంలోనే (నీడ). విలన్‌ పాత్ర లలో రాణిస్తున్న మోహన్‌బాబుని హీరో చేసిన ఘనత దాసరిదే. తనకు దాసరి గాడ్‌ఫాదర్‌ అని మోహన్‌బాబు నిస్సంకోచంగా చెబుతారు. వారిద్దరి బంధం హృదయంగతమైనది. ఆసుపత్రిలో దాసరి మరణం తర్వాత మోహ న్‌బాబు దుఃఖం ఆపులేకపోయారు. దాసరి పుట్టిన రోజున చిరంజీవి, మోహ న్‌బాబు, అల్లు అర వింద్‌లు ఆయన ఇంటికి వెళ్ళి అల్లు రామలింగయ్య స్మారక పురస్కారం అందించారు. ఆ తర్వాత వెళ్ళిన నాకు ఈ విషయం గర్వంగా, సంతోషంగా చెప్పారు. మురళీమోహన్‌కు కూడా దాసరి చాలా అవకాశాలు ఇచ్చారు.



నటుడు, దర్శకుడు, నిర్మాతగా నారాయణమూర్తి ఎదగ డానికి కారకుడు దాసరి. శ్రీహరిని పరిచయం చేసింది దాసరే. కోడి రామ కృష్ణ, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు వంటి అనేక దర్శక రత్నా లను తీర్చిదిద్దిన ఆచార్యుడు దాసరి. బాలనటుడిగా, గాయకుడిగా నాగుర్‌ బాబు ఎదగడానికి దాసరి ఆశీస్సులు తోడ్పడ్డాయి. ప్రసిద్ధ సమర్పకురాలు సుమను సినిమాలో నటింపజేసింది దాసరే. ఇట్లా అనేక ప్రయోగాలు చేశారు. సినిమారంగంలో బడుగులకు అండగా నిలబడి కొమ్ములు తిరిగినవారిని ఎది రించి పోరాడిన ధీశాలి ఆయన. ముగ్గురు నలుగురి చేతుల్లో సినిమా థియే టర్లు చిక్కుబడి చిన్న సినిమాలు తీసే కొత్త నిర్మాతలకు ప్రవేశం లేకుండా చేస్తున్న పరిస్థితిని ఎదిరించి మాట్లాడే వ్యక్తి దాసరి ఒక్కరే. ఆయనంటే సినిమా రంగాన్ని శాసిస్తున్నామని భావించేవారికి  సైతం హడల్‌. ఆయన మాట శాసనంగా చెలామణి అయ్యేది. తెలుగు సినిమా పరిశ్రమ మీద దాసరి ప్రభావం అటువంటిది.  



పత్రికారంగంలో దాసరి పాత్ర అసాధారణమైనది. ‘ఉదయం’ ఆయన హృదయం. ఆయన ‘ఉదయం’ పత్రికను నిర్వహించింది నాలుగున్నర సంవ త్సరాలే అయినప్పటికీ అది ఆయన ఊపిరిగా మారింది. హైదరాబాద్, విజయవాడ ఎడిషన్లతో రెండు లక్షల సర్క్యులేషన్‌తో ప్రారంభమైన సంచలన పత్రిక ‘ఉదయం’. దాసరి సారథిగా, ఏబీకే ప్రసాద్‌ సంపాదకుడిగా మొదలైన పత్రిక అనేక ప్రయోగాలకు నెలవైంది. పరిశోధనాత్మక జర్నలిజం తెలుగులో వీరవిహారం చేసింది ఉదయం హయాంలోనే. రోవింగ్‌ కరెస్పాండెంట్‌ వ్యవస్థను నెలకొల్పి  రాష్ట్రం అంతటా పర్యటిస్తూ  పరిశోధనాత్మక కథనాలకు సామగ్రి సేకరించడానికి ఆరుగురు ఉద్దండులైన విలేకరులను నియమించడం వినూత్నమైన, విశేషమైన చొరవ.



ఎవ్వరినీ ఖాతరు చేయకుండా ఉన్న దున్నట్టు రాయడానికీ, నిర్భయంగా వ్యాఖ్యానించడానికీ సంపూర్ణ స్వేచ్ఛ జర్నలిస్టులకు లభించింది ‘ఉదయం’లోనే. నిర్భీతికీ, నిజాయితీకీ, నిజానికీ ప్రతీకగా ఆ పత్రిక భాసిల్లింది. నక్సలైట్ల ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు బాలగోపాల్‌ నాయకత్వంలో నిజ నిర్ధారణ సంఘం ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి, అక్కడి ప్రజలతో మాట్లాడి, వాస్తవాలు తెలుసుకొని  తిరిగి వచ్చిన తర్వాత విలేకరుల గోష్ఠిలో చెప్పిన అంశాలను పూసగుచ్చినట్టు ప్రచురించేవాళ్ళం. సత్యమూర్తి అజ్ఞాత వాసానికి స్వస్తి చెప్పింది హైదరాబాద్‌ ‘ఉదయం’ కార్యాలయంలో నా గదిలోనే. నక్సలైట్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్త ఉదయం పత్రికలో వస్తే ఆ నక్సలైట్‌ ప్రాణం దక్కేది. పోలీసులు విధిగా అతడిని కోర్టులో హాజరుపరిచేవారు.



వార్త రాకపోతే అరెస్టయిన వ్యక్తి  గల్లంతే.  విప్లవ నాయకులకు ఉదయం పట్ల అచంచల విశ్వాసం ఉండేది. పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ ప్రధాన కార్యదర్శి కొండపల్లి సీతారామయ్యను ఇంటర్వూ్య చేయడానికి రమణమూర్తిని పంపిన సంగతి దాసరికీ, నాకూ మాత్రమే తెలుసు. సాహసాలను ప్రోత్సహించేవారు. దాసరి ఎన్నడూ జర్నలిస్టుల పనిలో జోక్యం చేసుకోలేదు. ఫలానావారిని ఉపేక్షించాలని కానీ ఫలానావారి పని పట్టాలని కానీ ఎన్నడూ చెప్పలేదు. పెద్దవారిపైన బాణాలు సంధిస్తే ఇబ్బంది కలుగుతుందేమోనని ఎన్నడూ సంకోచించలేదు. ముళ్ళ పూడి హరిశ్చంద్రప్రసాద్‌కు సంబంధించి పరిశోధనాత్మక వ్యాసం ప్రచురి స్తున్న∙విషయం ఆయనకు ముందుగా  తెలియదు.



అందుకే ఉదయం మూతపడిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచినా  ఆ పత్రికలో పనిచేసిన జర్నలిస్టులు ఎక్కడైనా కలుసుకున్న సందర్భంలో నాటి స్వర్ణయుగం ప్రస్తా వన విధిగా వస్తుంది. నెల రోజుల కిందట ఢిల్లీ నుంచి మాడభూషి శ్రీధర్, విశాఖ  నుంచి రమణమూర్తి వచ్చినప్పుడు వారిద్దరూ, నేనూ, మిత్రుడు యాదగిరి కలసి దాసరి దగ్గర ఆరగంటకు పైగా కూర్చొని మాట్లాడుతుంటే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆయనలో కొత్త ఉత్సాహం కనిపించింది. ‘ఉదయం’ తిరిగి ప్రారంభించడమే తన జీవిత ధ్యేయం అని చివరిసారి చెప్పారు. దాసరితో 45 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న రామకృష్ణ ప్రసాద్‌ ‘ఉదయం’లో మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఆయనను ఇప్పటికీ అందరం ఎండీ గారనే పిలుస్తాం. అందరం దాసరి కుటుంబంలో సభ్యులుగా ఉండేవాళ్ళం.



రాజకీయాలలో దాసరిది ప్రత్యేక పాత్ర. మంచి వక్త. విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. కాపు కులంలోనే కాకుండా అన్ని కులాలలో, వర్గాలలో పలుకుబడి కలిగిన నాయకుడిగా ప్రతి ఎన్నికలోనూ ఆయన ప్రభావం ఉండేది. ముద్రగడ పద్మనాభంతో కలసి తెలుగుతల్లి పార్టీని నెలకొల్పడానికి సన్నాహాలు చేశారు. చివరి క్షణంలో విరమించుకున్నారు. రాజకీయంగా చిరంజీవితో చాలాకాలం విభేదాలు ఉన్నప్పటికీ కొంతకాలం క్రితం ఇద్దరూ కలసిపోయారు. ముఖ్యంగా కాపు సమాజానికి చెందిన అంశాలలో వారు కలసి పనిచేశారు. ఇటీవల ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం పున రుద్ధరించినప్పుడు ఆయన హైదరాబాద్‌ వచ్చి దాసరి నివాసంలోనే ఇతర నాయకులతో సంప్రతింపులు జరిపారు. ఎన్నికల ప్రచారంలో దాసరి సభ లకు జనం బాగా వచ్చేవారు. ప్రజల హృదయాలకు హత్తుకొనే విధంగా ప్రసంగించేవారు. సోనియాగాంధీతో నేరుగా మాట్లాడి రాజ్యసభ సీటునూ, మంత్రి పదవినీ తెచ్చుకోగలిగిన స్థాయి ఆయనది. బొగ్గుశాఖ సహాయ మంత్రిగా ఉన్నకాలంలో కుంభకోణం జరిగినట్టూ, అందులో దాసరిని  నింది తుడిగా పేర్కొన్నట్టూ సీబీఐ ప్రకటించింది. నిజనిర్ధారణ జరగకముందే ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు.  

 

ఆయన ఎన్నుకున్న మూడు రంగాలలోనూ ఆయన తనదంటూ ఒక ముద్ర వేశారు. ఆద్భుతాలు చేశారు. అసాధారణ వ్యక్తిగా వెలిగారు.



ఈ సంవత్సరం ‘సాక్షి’ ప్రతిభా పురస్కారాల ప్రదాన సభను  ఈ నెల 14న నిర్వహించాం. సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించాం. అంతకంటే ముందు దాసరి నారా యణరావును సన్మానించుకోవాలని యాజమాన్యం సంకల్పించి  తెలుగు శిఖరం బిరుదం (టైటిల్‌) ప్రకటించాం. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి సన్మానం చేస్తామని సభలో ప్రకటించాం. అటు వంటి అవకాశం రాకుండానే తెలుగు శిఖరం ఒరిగిపోయింది. ఆయనకు ఇదే హృదయాంజలి.

కె. రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top