‘చరిత్ర’ను జన మార్గం పట్టించిన పరిశోధకుడు

‘చరిత్ర’ను జన మార్గం పట్టించిన పరిశోధకుడు


- డాక్టర్ మల్లిరెడ్డి పట్టాభిరామరెడ్డి

 (1922-2004)


నేడు నలభై ఏండ్లు పూర్తి చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్‌ను డాక్టర్ మల్లి రెడ్డి పట్టాభిరామరెడ్డి 1976 మే 6న స్థాపించారు. నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలకు, పట్టణా లకు, గ్రామాలకు వెళ్లి చందాలు వసూలు చేసి మరీ ఈ మహత్కార్యానికి పూనుకున్నారు. ఆయన కష్టం వృథా కాలేదు. ఈ నలభై ఏండ్లలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర పరిశోధన గొప్ప పురోగతిని సాధించింది. వేలకొద్దీ చారిత్రక అంశాలను వెలుగులోకి తెచ్చింది. కళాశాల, పీజీ స్థాయిల్లోనేగాక, సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఒక పేపర్‌గా ఆంధ్రప్రదేశ్ చరిత్ర స్థానాన్ని సంపాదించుకుంది. దీనికి ప్రధాన కారకులుగా మల్లిరెడ్డి పట్టాభి రామరెడ్డినే చెప్పుకోవాలి.

 

 అప్పట్లో వారి శాఖలోనే అధ్యాపకునిగా ఉన్న ఈ రచయిత వ్యవస్థాపక సభ్యునిగా ఏపీ చరిత్ర కాంగ్రెస్ స్థాపనకు సేవలందించాడు. ఎంపీఆర్‌గా సుపరిచితులైన మల్లిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఆగస్టు 21, 1922న నెల్లూరు జిల్లా, రాపూరు తాలూకా, గౌండవోలు గ్రామంలో రాఘవరెడ్డి, సిద్ధమ్మలకు జన్మించారు. నెల్లూరులో సీఏఎం హైస్కూ లులో, వీఆర్ కాలేజీలోనూ, ఆ తరువాత మద్రాస్ పచ్చయప్పాస్ కాలేజీలోనూ చదివారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. మద్రాస్‌లో చదివే రోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1954 ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ తరఫున రాపూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు కూడా. 1946-1954 మధ్య మద్రాస్ పచ్చయప్పాస్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన లోహియా ప్రభావంతో గ్రామీణ ప్రాంతంలో సేవ చేయాలని 1954లో నెల్లూరు కావలి జవ హర్ భారతి కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. 1955లో చరిత్ర శాఖ అధిపతిగా, ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా, ప్రిన్సి పాల్‌గా సేవలందించి 1978లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తరువాత యూజీసీ ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా కొనసాగారు. 2004 మార్చి 30న ఆయన పరమపదించారు. పాలకుల చుట్టూ తిరుగుతుండే చరిత్ర రచ నకు నూతన మార్గాన్ని నిర్దేశించి పాలిత ప్రజల చరిత్ర దిశకు మరల్చడంలో పట్టాభిరామరెడ్డి కృషి కూడా చిరస్మరణీయమైనది. ఆయన ‘క్లియో’ అను చరిత్ర పరిశో దనా పత్రికను స్థాపించి చారిత్రక అంశాల చర్చకు వేదికను ఏర్పర్చారు.

 

1974లో ‘క్వార్టర్లీ జర్నల్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్’ను, 1980లో ‘ఆంధ్ర ప్రదేశ్ హిస్టారికల్ రివ్యూ’ను స్థాపించారు. వీరి రచనల్లో ముఖ్యమైనవి: ‘‘ఈస్టిండియా కంపెనీ ఇన్ ఆంధ్ర, 1757- 1857’’, ‘‘వేమన అండ్ హిస్  టైమ్స్’’, ‘‘థాట్స్ ఆన్ ఇండియన్ ఫ్యూడ లిజం’’, ‘‘ఆస్పెక్ట్స్ ఆఫ్ అవేకనింగ్ ఇన్ నైన్టీన్త్ సెంచరీ’’, ‘‘పెజెంట్ రివో ల్ట్ ఇన్ రాయలసీమ’’, ‘‘వేమన ది హ్యూమ నిస్ట్’’, ‘‘పెజంట్ మూవ్ మెంట్స్ ఇన్ ఆంధ్ర, 1800-1850’’, ‘‘గ్లింప్సస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు క్విట్ ఇండియా మూవ్‌మెంట్’’,‘‘వీరేశలింగం యాస్ ఎ నేషనలిస్ట్’’, ‘‘అగ్రేరియన్ క్రైసిస్ ఇన్ ఏపీ టుడే’’, ‘‘హిస్టారియోగ్రఫీ:  బిఫోర్ బాస్వెల్ అండ్ ఆఫ్టర్’’, ‘‘అల్లూరి సీతారామరాజు’’ ‘‘ఎవల్యూషన్ ఆఫ్ అగ్రేరియన్ రిలేషన్స్ ఇన్ తెలంగాణ’’, ‘‘ట్రైబల్స్ ఆఫ్ అంధ్ర’’ తదితర పరిశోధనా పత్రాలను వెలువరించిన పట్టాభిరామిరెట్టి అగ్రశ్రేణి చరిత్ర పరిశోధకునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.



(ఏపీ హిస్టరీ కాంగ్రెస్ నేడు 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా)

 వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్

 - డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి

 చరిత్ర శాఖ, ఎస్వీ యూనివర్శిటీ  మొబైల్: 9849584324

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top