నలభై వసంతాల ‘చరిత్ర కాంగ్రెస్’

నలభై వసంతాల ‘చరిత్ర కాంగ్రెస్’ - Sakshi


తెలుగువారికి సమగ్ర చరిత్ర- సంస్కృతిని అందించాలనే లక్ష్యంతో ఎనిమిది సంపుటాల్లో, ఆంగ్ల, తెలుగు భాషల్లో క్రీ.పూ. 5000 నుండి క్రీ.శ .1990 దాకా రాయించాలని ఏపీ చరిత్ర కాంగ్రెస్ 1999లో నిర్ణయించింది. యిప్పటికి ఆరు సంపుటాలు వెలువడ్డాయి.  

 

 కావలి జవహర్ భారతి కళాశాలలో 1976లో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్, ఈ సంవత్సరం (2016)తో నలభైఏళ్లు పూర్తి చేసుకుంది. సుమారు 70 మంది ప్రతినిధులతో ఆరంభమైన సంస్థకు ప్రఖ్యాత చరిత్ర కారులు శ్రీ నేలటూరి వెంకట రమణయ్య గారు నాంది పలికారు. సంస్థ స్థాపకులు డా. మలిరెడ్డి పట్టాభిరామరెడ్డిగారు చరిత్ర అధ్యాపకులే గాక అప్పటి కళాశాల ప్రిన్సిపాల్. వర్ధమాన చరిత్ర కారుడుగా పేరొందిన పట్టాభిరామరెడ్డి మదిలో మొలిచిన విత్తనం నేటికి 400కు పైగా జీవిత సభ్యులు, వార్షిక సభలకు ప్రతి సంవత్సరం హాజరయ్యే 150 మందికి పైగా ప్రతినిధులతో పెంపొందుతూవుంది.

 

 తెలుగు వారికొక చరిత్ర సంస్థ వుండాలనీ, చరిత్ర అధ్యయన, పరిశోధనలు శాస్త్రీయంగా లౌకిక పునాదులపై జరగాలన్న ధ్యేయంతో సంస్థ ప్రారంభమైంది. 1970 దశకం నాటికే చరిత్ర రచనలో చోటు చేసుకొన్న నూతన ఆవిష్కరణలను గ్రహిస్తూ, కేవలం గత కాలపు రాజకీయ ఘటనలను గుది గుచ్చకుండా, వాటి నేపథ్యంలోని ఆర్థిక, సామాజిక శక్తులను విశ్లేషించి, సమగ్ర చరిత్ర నిర్మించాలన్న ధ్యేయమే ఈ సంస్థ లక్ష్యం. కేవలం విశ్వవిద్యాలయ అధ్యాపకులకే పరిమితం కాకుండా, సంస్థను అనుబంధ కళాశాలల్లో బోధించే అధ్యాపకులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయాలన్న సంకల్పం సంస్థ ఆశయాలలో అంతర్భాగంగా వుంటూ వచ్చింది. ఇప్పటికి జరిగిన 40 వార్షిక సభల్లో అత్యధిక భాగం కళాశాలల్లోనే జరిగాయి. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో  అనేక చోట్ల, విశ్వవిద్యాలయాలలో సహా, వార్షిక సభలు జరిగాయి.

 

 గత నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో తెలుగు సమాజంలో దేశ చరిత్రలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. రాజకీయంగా కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలు, అంతర్జాతీయంగా సోషలిస్టు శిబిర పతనం, నూతన ఆర్థిక విధానాలు- ఇవే గాక చరిత్ర పరిశోధనలో కొత్తపుంతలు తొక్కుతూ, దేశానికంతటికీ తలమానికమైన కేంద్రంగా చరిత్ర అధ్యయన, పరిశోధనలకు పెద్దపీట వేసిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంతో పాటు ఢిల్లీ, అలీఘర్, కాలికట్ తదితర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ఊపందుకున్నాయి.

 

  మచ్చుకు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో, తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళి పరిశోధన చేసిన విద్యార్థులు అనేక మంది, చరిత్ర విభాగంలోనే గాక, అన్ని సామాజిక శాస్త్రాల్లోనూ వున్నారు. వీరి చొరవతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర వార్షిక సభలకు, అక్కడనుండే గాక, దేశంలోని ప్రఖ్యాత చరిత్రకారులందరూ ఇక్కడికి వచ్చి, సభలను ఉజ్జీవింప చేసినవారే! గత నాలుగు దశాబ్దాల్లో జరిగిన మరో రెండు ముఖ్య ఘటనలు.. 1990 లగాయతు, నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి రావడం, రాష్ట్ర విభజన జరిగిపోయాయి. రాష్ట్రంలో కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. వీటిలో చరిత్ర అధ్యయనానికి, చాలావరకు అవకాశం లేకుండా చేశారు. ఆర్థిక కారణాలను సాకుగా చూపి, సరైన ప్రవేశాలు లేవని, ఇంటర్మీడియెట్ స్థాయిలో, దాంతో పాటు డిగ్రీ స్థాయిలో కూడా చరిత్ర చదవడం ‘దండగ’ అనే మాటను పాలకులు వాడుకలోకి తెచ్చారు. నిజమే! ఒక కంప్యూటర్ విద్య మినహా ఎందులో ఇవ్వాళ ఉద్యోగాలు లభ్యమవుతున్నాయి? కళాశాలల్లో దాదాపు సైన్స్ కోర్సుల్లో - కంప్యూటర్స్ మినహా- చే రే విద్యార్థులు లేక కునారిల్లిపోయాయి. కళాశాలల్లోనే కాదు, ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో, బోధనా సిబ్బంది కొన్ని సంవత్సరాలుగా లేరు.

 

 మొత్తం విద్యావిధానమే లోపభూయిష్టంగా తయారయిన పుడు, చరిత్ర కాంగ్రెస్ తన మనుగడను భద్రంగా కాపాడు కొంటూ వచ్చింది. ఒకసారి వెనుదిరిగి చరిత్ర కాంగ్రెస్ గావించిన కృషిని అంచనా వే యాల్సిన అవసరం వుంది. వార్షిక సభల్లోనూ ప్రధాన అధ్యక్షులు, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, చరిత్ర రచన, స్థానిక చరిత్రల అధ్యక్షుల పత్రాలను సంపాదీకరించి, ఒక సంపుటంగా- ఇప్పటికి 39 సంపుటాలు వెలువరించింది. వీటిలో నిక్షేపించిన పరి శోధనా సమాచారం -కొన్నివేల పుటలు- భావి పరిశోధకులకు ఉప కరిస్తుంది. నూతన పరిశోధన ఆవిష్కరణలను వెల్లడిస్తూ, ఏ ప్రాంతీయ సంస్థకూ తీసిపోని విధంగా, వాటికంటే భిన ్నంగా, అధికంగా చరిత్ర పరిశోధనలను ముందుకు తీసుకెళ్ళిందీ సంస్థ.

 

 కేవలం చరిత్రకారులకొక చర్చావేదికగా మాత్రమే గాక, అనేక గ్రంథావిష్కరణలు (సభ్యుల పరిశోధనలు) నిర్వహించింది. సంస్థ ప్రస్థానంలో, కొన్ని జిల్లా చరిత్రల ప్రచురణను దోహదం చేసింది. ఇరు రాష్ట్రాల్లోని జిల్లా సమగ్ర చరిత్రలను వెలువరించడం సంస్థ బాధ్యతగా భావిస్తున్నది. (ప్రభుత్వం ప్రకటించిన జిల్లా గెజిటెర్లకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది). కొన్ని జిల్లాల్లో చరిత్ర అధ్యయన సంస్థల ఆవిర్భావానికి దోహదం చేసింది. చరిత్ర బోధన, శాస్త్రీ యంగా, నిక్కచ్చిగా పాఠశాల స్థాయి నుండి జరగాలని కొన్ని వర్క్ షాప్‌లను నిర్వహించింది. ఈ కృషి జరగాల్సినంతగా జరగకపోవడం విచారకరం. భవిష్యత్తులో సంస్థను ఉన్నత పాఠశాల అధ్యాపకుల స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

 

 తెలుగువారి సమగ్ర చరిత్ర- సంస్కృతిని ఇంతవరకు ప్రచురించక పోవడంతో, ఈ కృషిని ఎనిమిది సంపుటాల్లో, ఆంగ్ల, తెలుగు భాషల్లో క్రీ.పూ.5000 నుండి క్రీ.శ . 1990 దాకా రాయించాలని 1999వ సంవత్సరంలో నిర్ణయించింది. దాదాపు రెండు వందల పైచిలుకు చరిత్రకారులను, ఆయా విభాగాల్లో నిష్ణాతులను ఎంపిక చేసి, సమర్థవంతమైన సంపాదకవర్గ పర్యవేక్షణలో ఇప్పటికి ఆరు సంపుటాలు (క్రీ.శ. 1858 దాకా) ప్రచురించింది. మిగతా రెండు సంపుటాలు త్వరలో వెలువడతాయి. ప్రాంతీయ చరిత్ర రచనకు మాత్రమే గాక, పరిశోధకులకు, పోటీ పరీక్షల విద్యార్థులకు కూడా ఇవి తోడ్పడుతున్నాయని మాకందుతున్న సమాచారం. వీటిలో కొన్ని తెలుగు అనువాద సంపుటాలు పునర్ముద్రణకు నోచు కున్నాయి. ఈ సంపుటాలను ప్రారంభంలో ద్రావిడ విశ్వవిద్యాల యంతో కలసి, రెండో సంపుటం నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో ప్రచురిస్తున్నారు.  ఇటీవల జరిగిన 40వ వార్షిక సభలు కళింగాంధ్రలో  శ్రీకా కుళం పట్టణంలో జరిగాయి. కీలకోపన్యాసాన్ని ఐ.సి.హెచ్.ఆర్. చైర్మన్ ఆచార్య ఎల్లాప్రగడ సుదర్శనరావు చేశారు. ఈ యేటి అధ్య క్షులుగా ప్రఖ్యాత చరిత్రకారులు, శాసన విశ్లేషకులు ఆచార్య సోమ సుందరరావు, ప్రధాన కార్యదర్శి ఆచార్య జి.వెంకటరామ య్య ఎంపికైనారు.

 

భవిష్యత్తులో  మరింత పటిష్టంగా సంస్థ నిర్మాణం కొనసాగించాలనీ, చరిత్ర జర్నల్ ఒకదానిని వెలువరించే అవకాశా లను పరిశీలించాలనీ, ఉభయ రాష్ట్రాల్లో ఇంతవరకూ ముద్రించని శాసన సంపుటాలు ప్రచురించాలనీ, ప్రభుత్వం మంజూరు చేస్తున్న వేలాది ఎకరాల భూముల్లో నిక్షిప్తమై ఉన్న చారిత్రక సంపదను పరిరక్షించే చర్యలు చేపట్టాలనీ, రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న చారిత్రక పత్రాలను, గ్రంథాలను, పురావస్తు సంపదను విభ జించే చర్యలు వేగవంతం చేయాలని తీర్మానించారు. శ్రీకాకుళం ప్రభుత్వ స్త్రీల కళాశాల ప్రిన్సిపాల్ డా. మైథిలి వారి సహచరులను, జిల్లా యంత్రాంగాన్ని సభలు జయప్రదంగా జరిగినందుకు అభినందిస్తూ తీర్మానం చేశారు. రాబోయే వార్షిక మహాసభలు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో జరపాలని నిర్ణయించారు.

 వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ప్రముఖులు

 మొబైల్: 9866841409

 - వి. రామకృష్ణ

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top