కరీంనగర్‌ ఉద్యమాల చుక్కాని చుక్కారెడ్డి

కరీంనగర్‌ ఉద్యమాల చుక్కాని చుక్కారెడ్డి


 జనధర్మ ఆచార్య, జీవగడ్డ (విద్యుల్లత) విజయ్‌ కుమార్, కేకలు రామదాస్, మంటలు ప్రభాకర్‌ అదే కోవలోకి వొచ్చే పత్రికా సంపాదకుడు నవత చుక్కారెడ్డి. సన్నిహిత మిత్రుడు, పాత్రికేయుడు, సంఘ సేవకుడు నవత చుక్కా రెడ్డి (72) గురువారం ఉదయం హైదరా బాద్‌లోని ఒక ఆస్పత్రిలో మరణించారన్న వార్త విన్నాక ఇది రాయాలనిపించింది. పైన పేర్కొన్న వాళ్లెవరి ఇంటి పేర్లూ అవి కావు. వాళ్లు నడిపిన పత్రికల పేర్లే వాళ్ల  ఇంటి పేర్లుగా స్థిరపడిపోయాయి. తెలంగాణ జిల్లాల్లో ఆయా సమయాల్లో అక్కడి సమాజాన్ని అత్యంత ప్రభా వితం చేసిన పత్రికలు జనధర్మ, జీవగడ్డ, కేకలు, మంటలు, నవత. వీళ్లంతా తెలంగాణా జిల్లాల్లో చాలా కాలమో, కొంత కాలమో స్వతంత్రంగా, నిర్భయంగా, అద్భుతంగా స్థానిక వార్తా పత్రికలు నడిపిన వాళ్లు.



కోమటిరెడ్డి చుక్కా రెడ్డి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వెలగటూర్‌ మండలం చేగ్యాం గ్రామస్థుడు. వ్యవసాయ భూములు బాగానే ఉన్న మోతుబరి రైతు కుటుం బంలో జన్మించినా విద్యార్ధి దశ నుంచే రచనా వ్యాసంగం పట్ల విపరీతమైన ఆసక్తి. కాలేజీ రోజుల్లోనే ఆయన కథలు ప్రముఖ మాస పత్రిక యువలో చాలా అచ్చయ్యాయి.



1978లో నవత పక్ష పత్రిక ప్రారంభించాక ఆయన ఇంటి  పేరు, ఊరి పేరు అందరూ మరిచిపోయారు. నవత చుక్కారెడ్డిగా కరీంనగర్‌ జన హృదయాల్లో నిలి చిపోయాడు. 1990 దాకా చుక్కా రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన నవత పక్ష పత్రిక ప్రజల సమస్యలకు, ఉద్యమాలకు ఊపిరిగా ఉండేది. నవత పత్రిక సంపాదకత్వం ద్వారా మాత్రమే కాకుండా ఆయన కరీంనగర్‌లో జరి గిన ప్రతి ప్రజా ఉద్యమంలో భాగస్వామి అయ్యేవాడు. కరీంనగర్‌ ఫిలిం సొసైటీ నుంచి మొదలుకుని లోక్‌సత్తా  ఉద్యమ నిర్మాణం దాకా చుక్కారెడ్డి భాగస్వామ్యం లేని పౌర ఉద్యమాలు గత నాలుగు  దశాబ్దాలలో కరీంనగర్‌ జిల్లాలో మనకు  కనిపించవు. ఇంగ్లిష్, తెలుగు భాషలలో ఆయన చదవని పుస్తకం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రేమాస్పదుడు, వివాద రహితుడు నవత చుక్కా రెడ్డి మరణం తెలంగాణ సామాజిక ఉద్యమాలకు తీరని లోటు.



చుక్కారెడ్డి మరణంతో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి దివిటీలయి దారి చూపి ముందుకు నడిపించిన ఈ పత్రికల జ్ఞాపకాలను పదిలపరిచే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేస్తే బాగుండునని అనిపిస్తున్నది. చిన్న పత్రికల చరిత్ర చిరస్మరణీయం చెయ్యడం ద్వారానే చుక్కారెడ్డి వంటి పలువురు unsung editors (గుర్తింపు రాని సంపాదకుల) జ్ఞాపకాలను పదిలపరుచుకోగలుగుతాం. ఆప్తమిత్రుడు చుక్కారెడ్డికి నివాళి. – దేవులపల్లి అమర్‌

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top