వాస్తు విశ్వాసం, వృథావ్యయం వాస్తవం

వాస్తు విశ్వాసం, వృథావ్యయం వాస్తవం - Sakshi


ఒక అంచనా ప్రకారం నిరుడు జూన్ నుంచి ఇప్పటి వరకూ సచివాలయంలో వాస్తుదోషాల నివారణ పేరుతో చంద్రబాబునాయుడు 81 కోట్లూ, కేసీఆర్ 34 కోట్లూ ప్రజాధనం వ్యయం చేశారు. ఇతర మంత్రులూ, ఉన్నతాధికారులూ చేసిన ఖర్చు అంతా కలిపితే మొత్తం రూ. 173 కోట్లు అని ఒక ఉన్నతాధికారి తెలిపారు.  

 

జాతకం, జ్యోతిష్యం, వాస్తు నమ్మేవారి సంఖ్య మన దేశంలో పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి గౌరవం పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఈ నమ్మకాలు అందరికంటే అధినాయకులకే అధికం. శాస్త్రీయంగా ఆలోచించేవారు వీటిని మూఢనమ్మ కాలుగా కొట్టిపారేస్తారు. శాస్త్రీయ దృక్పథం కలిగిన వారిలో సైతం వాస్తు, జ్యోతిష్యం వంటి అంశాలను విశ్వసించేవారు చాలామంది ఉన్నారు. నమ్మకం ఉన్నా, లేకపోయినా వాస్తు నిబంధనలు పాటిస్తే నష్టం ఏముంది అని సరిపెట్టుకు నేవారు అనేకమంది. దైవభక్తి లాగానే వాస్తు విశ్వాసం కూడా వ్యక్తిగతం. మన రాజ్యాంగం ప్రకా రం వీటిని ప్రభుత్వాలకు ఆపాదించకూడదు. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించేముందు ఇస్రో అధినేత తిరుమలను దర్శించుకొని వెంకన్నకు దండం పెట్టుకోవడం, అంతరిక్ష ప్రయోగ విజయభారాన్ని దేవుడిపైన వేయడం అశాస్త్రీ యం అనడంలో సందేహం లేదు.

 

నెహ్రూ తరువాత నుంచి ఇదే ధోరణి

శాస్త్రీయ స్పృహ కలిగిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు ఇటువంటి ఛాందస ధోరణులు ఉండేవి కావు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ రోజులలో అభధ్రతాభావం వెంటాడేది. కంచిస్వామిని తరచు సంప్రదించేవారు. సోనియా గాంధీ కూడా జ్యోతిషుల సలహా మేరకు ఫోన్ నంబర్లూ, కారు నంబర్లూ మార్చి వేశారు. సంఖ్యాశాస్త్రజ్ఞుల సూచన మేరకు జయలలిత ఇంగ్లిష్‌లో తన పేరు చివరలో అదనంగా మరో అక్షరం జోడించారు. అయినా ఆమెకు పదవీచ్యుతి తప్పలేదు. వీరి వ్యక్తిగత విశ్వాసాల వల్ల ప్రభుత్వ నిధులు ఖర్చు కాలేదు. చిన్న మార్పులతో వాస్తుదోష నివారణ మార్గాలు అనుసరించారు. అంతే.

 

కానీ ఆంధ్రప్రదేశ్‌లో వాస్తునమ్మకాలతో వందలకోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అవుతోంది. సంజీవరెడ్డి నుంచి జలగం వెంగళరావు వరకూ ఏ ముఖ్యమంత్రి కూడా వాస్తుదోష నివారణకు ప్రభుత్వం చేత ఖర్చు పెట్టించలేదు. మర్రి చెన్నారెడ్డి హైదరాబాద్‌లోని తార్నాకాలో స్వగృహంలో కొన్ని మార్పులు చేయించుకున్నారు. అంజయ్య బరకత్‌పురాలోని స్వగృహంలో కొత్త అంతస్తు నిర్మించిన తర్వాత రాజీవ్‌గాంధీ చేతిలో అవమానంపాలై, పదవిని కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులలో చాలామంది తమ విశ్వాసాలే ప్రభుత్వ విశ్వాసాలనుకున్నారు. వాస్తులోపాలను పరిహరించడంకోసం సచివాలయంలో కట్టడాలను కట్టడం, కూల్చడం సర్వసాధారణమైపోయింది. నందమూరి తారక రామారావు సచివాలయ ప్రహరీకి సమాంతర ప్రహరీగోడ కట్టించారు. సమాంతర ప్రహరీ నిర్మాణం ప్రారంభించిన కొద్దిరోజులకే ఎన్టీఆర్ శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లారు. అన్నగారు అటు వెళ్లగానే సోదరుడు నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నారు. తర్వాత నెలరోజులపాటు మహోద్య మం సాగించి ఎన్టీఆర్ అధికారం తిరిగి హస్తగతం చేసుకున్నారు.

 

 రెండు ఖజానాలకూ మాత్రం శని

 ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులూ ఒకే వాస్తు బడిలో చదివిన వత్సలు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన క్యాంప్ ఆఫీసు భవనం ఇద్దరు ముఖ్యమంత్రులకూ నచ్చలేదు. ముఖ్యమంత్రి అధికార నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటున్నారు కానీ క్యాంప్ కార్యాల యాన్ని వినియోగించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో తిప్పలు పడ్డారు కానీ క్యాంప్ కార్యాలయం ఉపయోగించడం లేదు. కేసీఆర్ కుందన్‌బాగ్‌లో రెండు భవనాలలో మార్పులు చేయించి తీరా అక్కడికి వెళ్ళాలన్న సంకల్పం విరమించుకున్నారు. ఒక అంచనా ప్రకారం నిరుడు జూన్ నుంచి ఇప్పటి వరకూ సచివాలయంలో వాస్తుదోషాల నివారణ పేరుతో చంద్రబాబునాయుడు 81 కోట్లూ, కేసీఆర్ 34 కోట్లూ ప్రజాధనం వ్యయం చేశారు. ఇతర మంత్రులూ, ఉన్నతాధికారులూ చేసిన ఖర్చు అంతా కలిపితే మొత్తం రూ. 173 కోట్లు అని ఒక ఉన్నతాధికారి తెలిపారు.

 

 సరికొత్త చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి తల పెట్టారు. వాస్తు ప్రకారం సవ్యంగా లేని సచివాలయంలో చిన్నచిన్న మార్పులు చేయడం కంటే ఏకంగా సచివాలయాన్ని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన మదిలో మెదిలిందే తడవుగా మంత్రివర్గ సమావేశంలో సహచరులతో పంచుకున్నారు. ప్రభుత్వ ఉన్నతాదికారులతోనూ కొత్త ఆలోచనపై చర్చించారు. అద్భుతమైన ఆలోచన అన్నవారే కానీ ఇదేమి చాదస్తం అని అనలేదు. ఎవరైనా మనసులో అనుకున్నారేమో కానీ బయటికి అనే సాహసం చే యలేదు.

 

  చార్లెస్ కొరియ అనే ప్రఖ్యాత వాస్తుశిల్పి నిర్మించిన మధ్య ప్రదేశ్ విధాన సభాభవనంలో దుష్టశక్తులున్నాయని రాజకీయ నాయకులు కొందరి ప్రగాఢ విశ్వాసం. 1996లో కొత్త భవనం వినియోగంలోకి వచ్చిన తర్వాత సభాపతి, ఉప సభాపతి మరణించారు, మొత్తం ఇరవైమందికి పైగా శాసనసభ్యులు (మాజీలు కారు)అకాల మరణం చెందారు. వ్యక్తులు వార్థక్యం వల్లనో, ప్రమాదాలలోనో, వ్యాధుల కారణంగానో మరణిస్తారు కానీ భవనాల కారణంగా చనిపోరని ప్రముఖ హేతవాది సమాల్ ఎడుమురుకు చేస్తున్న వాదనను పెడచెవిన పెడుతున్నారు.

 

పార్లమెంటు భవంతికీ వాస్తు దోషమేనట

ఢిల్లీ పార్లమెంటు భవనం వాస్తుశాస్త్ర నిబంధనలకు అనువుగా లేదని వాస్తుశాస్త్ర కోవిదుడు అశ్వనీకుమార్ బన్సల్ చాలా సంవత్సరాల కిందటే చెప్పారు. పార్ల మెంటు భవనం ఎదుట 1993 అక్టోబరు రెండో తేదీన మహాత్మాగాంధీ విగ్రహం ప్రతిష్ఠాపన జరిగినప్పటికీ వాస్తు పూర్తిగా గాడి తప్పిందని ఆయన నమ్మకం. త్రికోణం ప్లాట్‌లో గుండ్రటి కట్టడం నిర్మించిన కారణంగా అత్యున్నత చట్టసభలో చర్చలు ఫలప్రదం కావడం లేదని వాదన.

 

 పొరుగు దేశాలతో యుద్ధాలు రావ డానికీ, దేశంలో అశాంతి పెరగడానికీ ఇదే మూలం అని కొందరి విశ్వాసం. లోక్ సభలో స్పీకర్ దక్షిణ ముఖంగా కూర్చోవడం, ప్రెస్‌గ్యాలరీ కింద ఆయన స్థానం ఉండటంతో ఆయన సభ్యులను సమర్థంగా నియంత్రించలేకపోతున్నారనీ, ఫల ప్రదమైన చర్చకు దోహదం చేయలేకపోతున్నారనీ బన్సల్ అంటున్నారు. నిజానికి లోక్‌సభలో ప్రెస్‌గ్యాలరీలో కూర్చున్న మీడియా ప్రతినిధులకు స్పీకర్ మొహం కానీ, ప్రధాని, ప్రతిపక్ష నాయకుల మొహాలు కానీ కనిపించవు. పార్లమెంటును తాత్కాలికంగా విజ్ఞానభవన్‌కు మార్చి ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని చతు రస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో పునర్మించాలని వాదిస్తున్నారు. ఎవరు వింటారు?

 

 మన దేశంలో ఎంతో మంది సమర్థులైన ముఖ్యమంత్రులుగా, ప్రజారంజకు లైన పాలకులుగా, దార్శనికత కలిగిన ప్రగతికాముకులుగా చరిత్రపుటలలోకి ఎక్కారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి పథకాలు రచించి అమలు చేసే అద్భుతమైన అపూర్వమైన అవకాశం తొలి ముఖ్యమంత్రులుగా ఎన్నుకొని కేసీఆర్‌కూ, చంద్రబాబునాయుడికీ ప్రజలు ఇచ్చారు. ఆ సువర్ణావకాశాన్ని సద్విని యోగం చేసుకోకుండా వీరిద్దరూ స్వప్నవీధులలో విహరిస్తూ ఆచరణ సాధ్యం కాని కార్యక్రమాలను అలవోకగా ప్రకటిస్తున్నారు. ఇదివరకు ఏదైనా పథకాన్ని ప్రకటించే ముందు అధికారులూ, ముఖ్యమంత్రులూ సాధ్యాసాధ్యాలను అధ్య యనం చేసి, నిధుల కేటాయింపులు ఖాయంగా లభిస్తాయన్న నమ్మకం కుదిరిన తర్వాత ప్రకటన చేసేవారు.



గాలిమేడలు దిగాలి

వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కొన్ని చక్కటి కార్యక్రమాలను ప్రకటిం చారు. కొన్ని జయప్రదంగా అమలు చేయడం ప్రారంభించారు. పొరుగున చంద్రబాబునాయుడు చేత పిల్లిమొగ్గలు వేయిస్తున్న రైతుల రుణమాఫీ పథకాన్ని కేసీఆర్ సునాయాసంగా అమలు చేయగలిగారు-నిధుల పరిస్థితి నయం కనుక. ఆసరా పథకం కింద సహాయం మొత్తాన్ని రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచి ఆ ప్రకారం చెల్లిస్తున్నారు. ఆహారభద్రత కార్యక్రమం కింద అర్హత కలిగిన కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అంతమందికీ ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున మేలురకం బియ్యం ఇస్తున్నారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల వంతున జీవన భృతి చెల్లించాలన్న నిర్ణయం కూడా అభినం దించదగినది.

 

పేదల పట్ల సానుభూతి ఉన్నదనీ, తరతరాలుగా అన్యాయానికీ, పీడనకూ, వివక్షకూ గురైన దళిత, ఆదివాసీ వర్గాలకు మేలు చేయాలన్న సత్సం కల్పం కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నదనే సందేశం ప్రజలకు అందుతోంది కానీ దానితో పాటు అనేక సందేహాలు పట్టిపీడిస్తున్నాయి.

 ఆదివాసీలకూ, ముస్లింలకూ చెరి పన్నెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని రాజ్యాంగ ప్రవీణులు చెబుతున్నప్పటికీ కేసీఆర్ అదే హామీని పదేపదే చేయడంలో అర్థం ఏమిటి? నగర మధ్యంలో ఉన్న సచివాల యాన్ని అక్కడి నుంచి కేవలం వాస్తు కోసం ఎర్రగడ్డకు తరలించడం ఎందుకు? శనివారం మోండా మార్కెట్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి పెక్కంతస్తుల భవన ప్రాంగణంలో మార్కెట్‌ను నిర్మిద్దామంటూ వాగ్దానం చేసినట్టు వార్త.

 

 పెక్కం తస్తుల నిర్మాణాల పట్ల అంత ప్రేమ ఎందుకో ఉన్నతాధికారులకు సైతం అంతు బట్టడం లేదు. ఆకాశ హర్మ్యాల గురించి ఆలోచించడం కంటే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో చేసిన ప్రకటనలను చిత్తశుద్ధితో అమలు చేస్తే కేసీఆర్‌కు గొప్ప కీర్తి దక్కుతుంది. వాటిలో ఒకటి దళితులకు మూడెకరాల భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి ఇస్తామన్నది. ఈ పని కనుక చేయగలిగితే ఇందిరా గాంధీ తర్వాత దళితులు కేసీఆర్‌కే ఎక్కువగా రుణపడి ఉంటారు. మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన వాటర్‌గ్రిడ్‌నూ, చెరువుల పునరుద్ధ రణకోసం మిషన్ కాకతీయనూ పట్టువిడవకుండా అమలు చేయగలిగితే, విద్యలో, వైద్యంలో ప్రభు త్వ ప్రమేయం పెంచి పేదలకు నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటు లోకి తేగలిగితే చాలు కేసీఆర్‌ను చరితార్థుడిని చేయడా నికి. గాలిమేడలు అక్కరలేదు.

 - కె.రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top