రాజ్యాంగ స్ఫూర్తికీ వెన్నుపోటే

రాజ్యాంగ స్ఫూర్తికీ వెన్నుపోటే - Sakshi


మరెవరైనా తనకు వెన్నుపోటు పొడుస్తారన్న అభద్రతాభావం చంద్రబాబుకు ఉంది. దాని నుంచి బయటపడాలి. అదే కాకపోతే,  ‘సంతల్లో పశువుల మాదిరిగా’ ఆంధ్రప్రదేశ్‌లో ఆయన విపక్ష సభ్యులను ఎందుకు కొనుగోలు చేస్తున్నట్టు? ప్రజలలో విశ్వాసం తగ్గి, తన ప్రభుత్వానికి వ్యతిరేకులు పెరుగుతున్నారని తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు చంద్ర బాబు. ‘తన వేగులు’ తనకీ విషయం అందించే ఉంటారు. అందుకే తన పార్టీలో చేరిన ప్రతిపక్ష సభ్యుల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లేందుకు జంకుతున్నారాయన.

 

 ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావ తిలో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ ప్రకటన విన్న తరువాత మావో పాలనలో సాంస్కృతిక విప్లవానికి బీజం వేసిన సంఘటనలలో ఒకటి గుర్తుకు వస్తున్నది. చైనాలోని ఒక పెద్ద గ్రామంలో ఉన్న టూరింగ్ టాకీస్‌లో ఒక సినిమాను ప్రదర్శిస్తున్నారట. హాలు బయట పెద్ద మావో కటౌట్ ఉంది. చైనా విప్లవం ఇతివృత్తంగా నిర్మించిన చిత్రమని ప్రచారం కూడా. లోపల ప్రదర్శిస్తున్న సినిమా మాత్రం మావో విధానాలకు వ్యతిరేకమైనది. ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించేది. తన పేరును జపి స్తూనే విప్లవ ప్రతీఘాతశక్తులు సాగిస్తున్న దుశ్చర్యలు అలా మావో దృష్టికి వచ్చాయి.

 

 ఈనాడు అంబేడ్కర్ మహాశయుడు మన మధ్య లేరు. కానీ ఆయన భజన చేస్తున్నట్టు కనిపిస్తూనే, ఆయన ఆశయ స్ఫూర్తికి భంగం కలిగించే రీతిలోనే ఆంధ్రప్రదేశ్‌లో పాలన సాగుతున్నది. దళితుల గురించీ, మహిళల గురించీ చంద్రబాబు గతంలో చేసిన అమర్యాదకర వ్యాఖ్యలు ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు రాజ ధాని ప్రాంతంలో రిజర్వేషన్లు అమలు చేయడం జరగదని ప్రభుత్వం ప్రకటిం చింది. అంటే నోటితో భజన చేస్తారు. ఆచరణలో మాత్రం అంబేడ్కర్ ఆశ యానికి తూట్లు పొడుస్తారు. ఇది చంద్రబాబుకి అలవాటైన విద్య. మన రాజ్యాంగం పట్ల, ఆ రాజ్యాంగం పునాదిగా ఏర్పడిన ప్రజా ప్రాతినిధ్య సంస్థ శాసనసభ పట్ల, ఇతర ప్రజాప్రాతినిధ్య సంస్థల పట్ల జరుగుతున్న అపచారం ఎలాంటిదో తెలుసుకోవాలంటే చంద్రబాబు గతం గురించి గుర్తు చేసుకోవాలి.

 

 రాజ్యాంగమంటే ఏదీ గౌరవం?

 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఎన్నికలలో ఘనవిజయం సాధించి, రాజకీయ చరిత్రలో ఒక ప్రభంజనం సృష్టించారు. అప్పటికే చంద్రబాబు ఎన్టీఆర్‌కు అల్లుడు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా, మంత్రిగా పని చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం జోరుగా ఉన్నవేళ ‘మామ అయిన ఎన్టీఆర్ మీద పోటీ చేస్తా, ఆయనను ఓడిస్తా’ అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. తీరా ఎన్నికలలో ఎన్టీఆర్ కాంగ్రెస్‌ను ఓడించి అధికారం చేపట్టాక... చంద్రబాబు తన ప్రతిజ్ఞను పక్కన పడేసి ప్లేటు ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కుట్రలూ కుతంత్రాలు తెలియని ఎన్టీఆర్ నమ్మకంతో చంద్రబాబుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. నాదెండ్లను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర సమయంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరింత దగ్గరయ్యారు. తన పథకాన్ని ఆషాఢభూతి వలె అమలు చేయాలని ప్రయత్నాలు ఆరంభించారు. అప్పటికి గవర్నర్‌గా ఉన్న కృష్ణకాంత్, ఒక ప్రముఖ పత్రికాధిపతి ఈ పథకం అమలులో తోడ్ప డ్డారు. నాటి శాసనసభ స్పీకర్ యనమల రామకృష్ణుడిని కూడా చంద్రబాబు తన కుట్రలో పావుగా వాడుకున్నారు.

 

 చట్టబద్ధంగా, లక్షలమంది ఎదుట లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్న ఉదంతానికి చిలవలు పలవలు అల్లి ఆయనను వ్యక్తిగతంగా కించ పరిచారు. ఎన్టీఆర్ ప్రచారం చేస్తే తప్ప డిపాజిట్ కూడా దక్కని కొందరు ఎమ్మెల్యేల చేత అప్పుడు అన్నగారి మీద చెప్పులు కూడా విసిరేటట్టు చేశారు. రాజ్యాంగానికి ఇన్ని విధాలుగా తూట్లు పొడిచి ముఖ్యమంత్రి అయిన వారు చంద్రబాబు. ఇక్కడ ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈ ఘోరకలిని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ వెనుకే ఉన్నారు. కానీ వారు ఎన్నుకున్న పలువురు ప్రజాప్రతినిధులు మాత్రం ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు పంచన ఉండి పోయారు. అలా నైతికంగా ప్రజా ప్రతినిధులు అని పిలిచేం దుకు అర్హత కోల్పోయారు. ఈ వెన్నుపోటు రాజకీ యంలో అంబేడ్కర్ ఆశించిన ఉన్నత విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య కార్యాచరణ వక్రమార్గం పట్టాయి.

 

 చంద్రబాబు తెలుగుదేశానికి రాజకీయ నిబద్ధత లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మొదట కమ్యూనిస్టులతో జత కట్టింది. 1999లో అటల్ బిహారీ వాజపేయి హవాలో అందలం దక్కించుకుందామని బీజేపీకి దగ్గర యింది, 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి తనతో పాటు బీజేపీని కూడా ముంచింది. అన్ని ఇజాలు అంతరించాయి, మిగిలింది టూరిజమేనని కమ్యూ నిస్టులను అవహేళన చేసింది. 2009 ఎన్నికలలో మతతత్వ బీజేపీతో చేతులు కలిపేది లేదని చెప్పి, మళ్లీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో టీఆర్‌ఎస్ తోనూ కలసి మహాకూటమిని ఏర్పాటు చేసింది. ఆ తరువాత 2014లో మళ్లీ కమ్యూ నిస్టులను కాదని నరేంద్ర మోదీ గాలీ, పవన్‌కల్యాణ్ సినిమా గ్లామర్ కోసం వారితో కలిశారు.

 

 విపక్షం నోరు నొక్కడమే ధ్యేయం

 టీవీలు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రస్తుత శాసనసభ నడుస్తున్న తీరు గురించి వివరించవలసిన అవసరం లేదు. విపక్షం నోరెత్తే ప్రశ్నే లేదు. ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నా అడుగడుగునా అడ్డుపడాలి.  స్పీకర్ లేదా ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడితే నిబంధనలను ఉల్లంఘించి సభలో ఓట్లు లెక్కించకుండా మూజువాణి ఓటుతో ప్రభుత్వమే నెగ్గిందని ప్రకటించాలి. విపక్షం మీద, వారి నేతతో సహా అందరి మీద అధికార పక్ష సభ్యులు, మంత్రులు నోటి దురుసును ప్రదర్శించినా స్పీకర్ పట్టించుకోకూడదు. చూపు డువేలు చూపుతూ, బయటకు రా చూసుకుందాం అన్నా మందలించరాదు. ఈ ప్రవర్తనను చూస్తూ ఊరుకోవాలి. ప్రతిపక్ష సభ్యులపైనే వేటు వేయాలి. లెనిన్ వ్యాఖ్యానించినట్టు చట్టసభలు బాతాఖానీ క్లబ్బులు అన్న మాటను రుజువు చేసే విధంగా అధికార పార్టీ ధోరణి సాగుతోంది. ఇది చాలదన్నట్టు పార్టీ మారతామంటూ వస్తున్న విపక్ష సభ్యులలో కొందరికి పచ్చ కండువాలు కప్పి చేర్చుకోవడం ఇంకో దారుణం.

 

 తెలంగాణలో కూడా ఇదే ధోరణి. అక్కడ కూడా ప్రజాస్వామిక సూత్రాలను గౌరవించకుండా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి శాసనసభ్యులను చేర్చుకుంటున్నారు. తెరాసది అప్రజాస్వామికమని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నది. వచ్చే ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌లో  ప్రతిపక్షం ఉనికే ఉండరాదన్న ధ్యేయంతో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తున్నది. ఓటుకు కోట్లు కేసులో దొరికినా లాలూచీ వల్ల అది ఏళ్లు గడుసున్నా మూలన పడే ఉంటోంది. అయితే చంద్ర బాబు అక్రమ పాలన గురించి చెబుతున్నా మంటే మిగిలిన చోట్ల రాజ్యాంగ స్ఫూర్తి పరిఢవిల్లుతోందని అర్థం కాదు. 1957లో కేరళలో నెహ్రూ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ఈఎంఎస్ నంబూద్రి ప్రభు త్వాన్ని ఒక కలం పోటుతో కూల్చివేసింది. అంబేడ్కర్ మరణించిన రెండేళ్లకే ఇది జరిగింది. కేరళపై కేంద్రం విషపు కాటు, ప్రజా స్వామ్యం బలి అంటూ ఆనాడే పత్రికలు వార్తలు ఇచ్చాయి.

 

 ప్రజలూ ప్రతిపక్షాలే పరిరక్షకులు

 అయితే పాలకపక్షాల నిరంకుశత్వాన్ని ప్రజలు గ్రహించి, అందుకు వ్యతి రేకంగా పోరాడిన సందర్భాలు కూడా లేకపోలేదు. 1975లో ఇందిరాగాంధీ ఏకవ్యక్తి పాలనే ధ్యేయంగా ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇందుకు గొప్ప ఉదాహరణ. ఆ నిరంకుశ త్వానికి వ్యతి రేకంగా ప్రజలు పోరాడి 1977లో ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. అలాగే 1984లో కాంగ్రెస్ పార్టీ నాదెండ్లతో కలసి ఎన్టీఆర్‌ను పదవీభ్రష్టుణ్ణి గావించినప్పుడు తెలుగు ప్రజలు చేసిన ఉద్యమం కూడా అటువంటిదే. చంద్రబాబుకు ఇవన్నీ తెలుసు. సభలో సంఖ్యాబలం తగినంతగా ఉన్నా, నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అన్న రీతిలో మరెవరైనా తనకు వెన్నుపోటు పొడుస్తారన్న అభద్రతాభావం చంద్రబాబుకు ఉంది. దాని నుంచి బయటపడాలి.

 

 అదే కాకపోతే, ‘సంతల్లో పశువుల మాదిరిగా’ ఆంధ్రప్రదేశ్‌లో ఆయన విపక్ష సభ్యులను ఎందుకు కొనుగోలు చేస్తున్నట్టు? తనకు ప్రజలలో విశ్వాసం తగ్గి, తన ప్రభుత్వానికి వ్యతిరేకులు పెరుగు తున్నారని తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు చంద్రబాబు. ‘తన వేగులు’ తనకీ విషయం అందించే ఉంటారు. అందుకే తన పార్టీలో చేరిన ప్రతిపక్ష సభ్యుల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లేందుకు జంకుతున్నారాయన. అందుకే అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహమని జపం చేస్తూ, ఆయన నేతృత్వాన రూపొందిన రాజ్యాంగానికి, ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కాలం గడుపుతున్నారు.

 

ఈ క్రమంలో శాసనసభలు ప్రజల ఆకాంక్ష లను నెరవేర్చగల వేదికలుగా కాక వారి న్యాయమైన కోర్కెలను నేలరాసేం దుకు సాధనాలుగా ప్రస్తుత పాలకపక్షం వినియోగించుకుంటున్నదన్న వాస్తవం ప్రజలు అనుభవం ద్వారా గ్రహిస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంతో కలసి, ప్రజాస్వామ్య పరిరక్షణకై మహత్తర ప్రజా ఉద్యమం నిర్మించాలి! ఆ పవిత్ర కర్తవ్య నిర్వహణకు ప్రజా సమూహాన్ని సన్నద్ధం చేసి రంగంలో దింపే ఆవశ్యకత దృష్ట్యా తక్షణ రాజకీయ పోరాటానికి, ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా సమరశీలంగా ఉద్యమించగలవా?

 వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు

 మొబైల్: 9848069720

 - డా॥ఎ.పి. విఠల్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top