అయినా బాబు మారలేదు, ఆయన కాంక్ష తీరలేదు

కె.రామచంద్ర మూర్తి, ఎడిటోరియల్ డైరెక్టర్, సాక్షి. - Sakshi


తెదేపా నాయకులు కొందరు కొత్తబాబు వస్తాడనుకుంటే పాతబాబే వచ్చాడంటూ నిట్టూర్చుతున్నారు. పాత చంద్రబాబునాయుడిని చూస్తుంటే పాత చంద్రబాబునాయుడే కళ్ళ ముందు కదులుతున్నట్టు అనుభూతి. చరిత్ర పునరావృత్తం అవుతున్న భావ న. అందుకే ‘దేజా వూ’ (ఇవన్నీ ఇదివరకు చూసిన దృశ్యాలే సుమా) అనిపిస్తున్నది.

 

 ‘దేజా వూ’ అనే ఫ్రెంచి పదం ఇంగ్లీషులోకి వచ్చి చేరింది. వర్తమానంలో ఏదైనా దృశ్యం చూసినప్పుడు గతంలో అదే మాదిరి దృశ్యం చూసినట్టు అనిపించ డాన్ని ‘దేజా వూ’ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తాజా పోకడలు ఈ మాటను పదేపదే గుర్తు చేస్తున్నాయి.

 

 ప్రతిపక్షంలో గడిపిన పదేళ్ళలో, రెండు ఎన్నికల పరాజయాలలో చంద్రబాబు నాయుడు కొన్ని గుణ పాఠాలైనా నేర్చుకొని ఉంటారని అనుకున్నాం. నిజానికి కొన్ని రాజకీయ తప్పిదాలు చేసినట్టు ఆయనే స్వయంగా చెప్పారు. రైతులను అనవసరంగా కష్టపెట్టానని అంగీకరించారు. విద్యుత్‌రంగ సంస్కరణల విషయంలో కఠినంగా వ్యవహరించానని అన్నారు. తన వైఖరిలో మార్పు వచ్చిన ట్టు కూడా సభాముఖంగా ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కడగండ్లకు అంతు లేకుండా పోయిందంటూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రైతులకోసం పాదయాత్ర చేస్తున్నందుకు నేను కరీంనగర్ జిల్లా చొప్పదొండి ప్రత్యేకంగా వెళ్ళి అభినందించి ఆయనతో కొంత దూరం నడిచాను.

 

  పాదయాత్ర సందర్భంగా అన్నదాతల సంక్షే మాన్ని ఆశిస్తూ అనేక వాగ్దానాలు చేశారు. రుణమాఫీ వాగ్దానం ఆలోచన ఆ సంద ర్భంలోనే పుట్టింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్ కేంద్రం నెలకొల్పడం అన్యా యమని ఎలుగెత్తి చాటారు. ఉత్తరాంధ్రలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తే సహిం చేది లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాలను గట్టిగా హెచ్చరించారు. నక్కపల్లి ఇండ స్ట్రియల్ పార్క్ కోసం భూమి సేకరించేందుకు అధికారులు ఎవరైనా వస్తే వారిని చెట్టుకు కట్టేసి కొట్టమంటూ రెండేళ్ళ కిందటే ప్రజలకు ప్రబోధించారు. హైదరాబాద్ నిర్మాతను తానే అని చెబుతూనే శక్తినంతా ఒక్క హైదరాబాద్ అభివృద్ధికోసం వెచ్చించడం పొరబాటేనని గ్రహించినట్టు చెప్పారు. భవిష్యత్తులో అటువంటి తప్పు చేసేది లేదనీ, ప్రగతి వికేంద్రీకరణకు కట్టుబడి ఉంటానని కూడా నమ్మబలికారు.

 

 అధికారంలోకి తిరిగి వచ్చి ఆరు మాసాలు పూర్తి కాకుండానే తాను రవ్వంత కూడా మారలేదని అనుక్షణం గుర్తు చేస్తున్నారు. 2004లో నిలిపివేసిన ప్రపంచ బ్యాంకు అజెండాను తిరిగి నెత్తికి ఎత్తుకున్నారు. రైతులకోసం పడిన తాపత్రయం నిజమైతే రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించడమో, సమీకరించడమో చేయాలని సంకల్పించగలరా?  జపాన్‌లో ఐదు రోజుల పర్యటన విజయవంతంగా ముగించుకొని కొన్ని గంటల కిందట హైదరాబాద్ తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం బాధ్యతను జపాన్‌కు అప్పగించారు. అంతకుముందు రాజధాని డిజైన్ రూపొందించే పని సింగపూర్ వెళ్ళి అక్కడి సంస్థకు అప్పగించారు. జనవరిలో అమె రికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీకి వస్తే ఆయనను కలవాలని నిర్ణయించుకు న్నారు. వీలైతే స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి అమెరికా పూచీ పడిన విశాఖ పట్టణానికి ఒబామాను తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తారు.

 

 లోగడ ఢిల్లీ సందర్శనానికి వచ్చిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గే ట్స్‌ను కలుసుకొని రాష్ట్రానికి ఆహ్వా నించారు. నిజంగానే గేట్స్ రాష్ట్రానికి వచ్చారు. బిల్ క్లింటన్‌ను కూడా హైదరాబాద్ రప్పించి సత్యం రామలింగరాజు సరసన కూర్చోబెట్టారు. సంపన్న దేశాధినేతల శిఖ రాగ్ర సదస్సు జరుగుతున్న దావోస్ వెళ్ళి వారికి తనను తాను పరిచయం చేసుకు న్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో చూపించిన అసాధారణ చొరవకు అభినం దిస్తూ టైమ్స్ ఆసియా ఎడిషన్ చంద్రబాబునాయుడు ఫొటోను ముఖచిత్రంగా ప్రచురించింది.  మరోసారి టైమ్స్ ప్రశంస పొందాలనీ, హైదరాబాద్ బాబులాంటి మహానగ రాన్ని నిర్మించాలనీ నాయుడు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

 

 జాపనీస్ ప్రధాని షింజో అబేని కలుసుకొని కొత్త రాజధాని నిర్మాణానికి సహకారం ఇవ్వవలసిందిగా అభ్య ర్థించారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలత చెందే విధంగా నాయుడు వేగంగా కదులుతున్నారు. పరిశ్రమల శాఖను తన దగ్గరే పెట్టుకొని సిద్ధ రామయ్య తప్పు చేశారనీ, కీలకమైన ఆ శాఖను మరో మంత్రికి కేటాయించకపోతే జాపనీస్ పారిశ్రామికవేత్తలు బెంగళూరు వదిలి ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతారంటూ కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ షెట్టార్ విమర్శిస్తున్నారు. తాము చంద్రబాబు నాయుడి కంటే ఎక్కువగా పెట్టుబడులు తెస్తామని సిద్ధరామయ్య ప్రకటన జారీ చేయవలసివచ్చింది. నాయుడు జపాన్ యాత్రకు పోటీగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు చైనా నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ రకంగా అటు సిద్ధరామయ్యనూ, ఇటు కేసీఆర్‌నూ చిందరవందర చేస్తూ నాయుడు వేగంగా ముందుకుపోతున్నారంటూ పత్రికలు ప్రశంసిస్తున్నాయి.  నక్కపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌ను విస్తరించి బ్రహ్మాండమైన పెట్రోలియం కారి డార్ (పీసిపీఐఆర్-పెట్రోలియం కెమికల్ పెట్రోకెమికల్ ఇన్‌విస్ట్‌మెంట్ రీజియన్) నిర్మించాలన్న నిర్ణయాన్ని అమలు చేయడానికి నాయుడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. విశాఖ జిల్లాలో 82 గ్రామాలలో 840 చదరపు కిలోమీటర్ల భూమిని సేకరిస్తారట. ఈ ప్రాజెక్టు వల్ల రెండు లక్షల మంది రైతులూ, లక్షా ఇరవై వేల పైచిలుకు మత్స్యకారులూ నష్టపోతారు.

 

 భూములు మాత్రమే సేకరిస్తామనీ, ప్రజలు గ్రామాలలో నివాసం కొనసాగించవచ్చుననీ అధికారులూ, శాసనసభ్యులూ చెబుతు న్నారు. పొలాలూ, తోటలూ పోయిన తర్వాత గ్రామాలలో రైతులు ఎందు కుంటారు? ఉండి ఏమి తింటారు? జపాన్ సహకారంతో శ్రీకాకుళంలో సోంపేట దగ్గరే బారువలో బీలభూముల్లోనే థర్మల్ కేంద్రం నిర్మించాలన్న నిర్ణయం జరిగి పోయింది. ఇదివరలో ప్రతిఘటన ఉద్యమం నిర్వహించి తాత్కాలిక విజయం సాధించిన స్థానిక వైద్యుడు డాక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలోనే తిరిగి ఉద్యమం రాజుకుంటోంది. విశాఖలో జరిగిన మూడు రోజుల సదస్సు బాక్సైట్ తవ్వకాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని శనివారంనాడు తీర్మానించింది. ఈ సదస్సు వెనుక తెదేపా ప్రభుత్వం ఉన్నదని వేరే చెప్పనక్కరలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొత్త రాజధాని నిర్మాణ ప్రహసనం ఒక ఎత్తు.

 

 కొత్త రాజధానిని విజయవాడ సమీపంలో నిర్మించడం పట్ల పెద్దగా వ్యతిరేకత లేదు. ఒక వేళ ఉన్నప్పటికీ అది బయటపడలేదు. రాజధాని నిర్మాణం కోసం ముఖ్య మంత్రి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా లక్ష ఎకరాల భూమి సేకరించాలని నిర్ణ యించినప్పుడు మళ్ళీ రైతులతో పెట్టుకుంటున్నారు కదా అనిపించింది. విద్యుత్ రంగ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నాటి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి తోడుగా తొమ్మిది వామపక్షాలు ఏకమై నిలిచాయి. ఇప్పుడు తుళ్ళూరు వ్యవహారంలో రైతుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు పోరా టం చేసేందుకు పది వామపక్షాలూ ఒకే తాటిమీదికి వస్తున్నాయి.



ఏకం కావాలంటూ అభిమానులు కొన్ని దశాబ్దాలుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా వామపక్ష నాయకులు పట్టించుకోలేదు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం రెండో సారి వామ పక్షాలను ఒకే వేదికపైకి తెచ్చారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతుపక్షపాతి. కాంగ్రెస్ వాది కాదు. సోషలిస్టుగా రాజకీయాలలో ప్రవేశించి తె దేపాలోనే పార్లమెంటు సభ్యు డుగా, రాష్ట్ర మంత్రిగా పదవులు నిర్వహించారు. రాజకీయాల నుంచి దాదాపుగా విరామం తీసుకున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట ఎందుకు తప్పుతున్నారంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ కొత్త రాజధాని నయారాయపూర్ కోసం కేవలం రెండు వేల ఎకరాల భూమి సమీక రించారనీ, అందులో 750 ఎకరాలలో కేపిటల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారనీ చెప్పారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో 12 వేల ఎకరాలలో రాజధాని నిర్మించుకున్నా రనీ, అందులో కేవలం 500 ఎకరాలలో అన్ని కార్యాలయాలనూ, సచివాలయాన్నీ, విధానసభనూ, ఇతర హంగులనూ ఏర్పాటు చేసుకున్నారనీ సాధికారికంగా చెప్పారు.

 

ప్రభుత్వం సేకరించే 30 వేల ఎకరాలలో ఏమి చేయబోతున్నారో విడమరచి చెప్పడం లేదు. ఇది కాకుండా కార్ల రేసింగ్‌కూ, ఇతర వినోదాలకూ ఇంకా భూములు కావాలంటున్నారు. జార్ఖండ్ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇంతవరకూ రూ.800 కోట్లు ఇచ్చింది. ఉత్తరాఖండ్‌కు రూ.400 కోట్లు ముట్టాయి. నయారాయ్‌పూర్ నిర్మాణం మొదలు పెట్టి పుష్కరం దాటినా ఇంకా పూర్తి కాలేదు. ఈ నగరం కోసం కేంద్ర సర్కార్ ఇంతవరకూ విడుదల చేసింది రూ.500 కోట్లు మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రూ.1,13,000 కోట్లు అవసరమని అంచనా. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత నిధి? తుళ్ళూరు చుట్టుపక్కల భూముల ధరలు పెంచి రైతుల నుంచి సేకరించిన భూములను విక్రయించి నిధులు సమీకరి స్తారనే మాట ప్రచారంలో ఉంది. ఇంకా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 

చంద్రబాబునాయుడి విదేశీ వ్యామోహం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఒబామా భారత ఇంజనీర్ల ప్రతిభను ప్రశంసిస్తుంటే రాజధాని రూప కల్పన బాధ్యతను సింగపూర్‌కు అప్పగించవలసిన అవసరం ఏముంది? నిర్మాణాన్ని జపాన్ చేయవలసిన అగత్యం ఏముంది? భారతీయుల నైపుణ్యం పట్ల, ముఖ్యంగా తెలుగు ఇంజనీర్ల సామర్థ్యం పట్ల ఏ మాత్రం విశ్వాసం లేదా? అమెరి కాలో వంద అంతస్తుల ఆకాశహర్మ్యాల నిర్మాణంలో తెలుగు ఇంజనీర్లు చాలామంది పని చేశారని వడ్డే గుర్తు చేశారు.

 

 గతాన్ని తలపించే మరో అంశం కర్నూలు జిల్లాలో పరిణామాలు. అక్టోబరు 31న నంద్యాల మునిసిపాలిటీ సమావేశంలో జరిగిన గొడవను పురస్కరించుకొని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు భూమా నాగిరెడ్డిపైన మూడు కేసులు బనాయించడం, ఇందుకు పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం చరిత్ర తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించడం లేదు. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా కర్నూ లు ఎస్‌పీగా సీతారామాంజనేయులును నియమించి విజయభాస్కరరెడ్డి అనుచరు లను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన రోజులూ, కడప ఎస్‌పీగా ఉమేశ్‌చంద్రను పంపించి వైఎస్‌ఆర్ మనుషులను వేధించిన రోజులూ గుర్తురాకమానవు. కర్నూలు జిల్లాలో రెండు లోక్‌సభ సీట్లనూ, పద్నాలుగు అసెంబ్లీ స్థానాలలో పదకొండింటినీ గెలుచు కున్న వైఎస్‌ఆర్‌సీపీని బలహీనపరచడానికి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పావులు కదిపారు.

 

 జిల్లా పరిషత్తును తెదేపా కైవసం చేసుకున్న తీరు అత్యంత అప్రజాస్వామికం. మొత్తం 53 స్థానాలలో 30 స్థానాలు గెలుచుకొని మెజా రిటీ సాధించిన వైఎస్‌ఆర్‌సీపీ కాకుండా 20 స్థానాలు మాత్రమే గెలుచుకున్న తెదేపా ప్రస్తుత జిల్లా పరిషత్తు అధ్యక్షుడు మల్లెల రాజశేఖరగౌడ్, మరి నలుగురు సభ్యుల చేత పార్టీ ఫిరాయింపజేసి అధికారం హస్తగతం చేసుకోవడం ఏమంత నీతిమంతం? పైగా జిల్లాలో పలుకు కలిగిన నాయకుడు నాగిరెడ్డిని అణచివేయడానికి అడ్డగోలుగా అధికార దుర్వినియోగం. పదవీ బాధ్యతలు చేతబట్టి 180 రోజులు కాకుండా చంద్రబాబునాయుడు రాజకీయంగా, నైతికంగా 180 డిగ్రీలు తిరిగి, ఈ చివరి నుంచి ఆ చివరికి మారిపోవడం ఏమని నిరూపిస్తోంది? ఆయన వాస్తవంగా మారలేదని. ప్రతిపక్షంలో ఉండగా ఏమీ నేర్చుకోలేదనీ, నేర్చుకున్నట్టు కేవలం నటించారనీ. అందుకే తెదేపా నాయకులు కొందరు కొత్తబాబు వస్తాడనుకుంటే పాతబాబే వచ్చాడంటూ నిట్టూర్చుతున్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడిని చూస్తుంటే పాత చంద్రబాబునాయుడే కళ్ళముందు కదులుతున్నట్టు అనుభూతి. చరిత్ర పునరావృత్తం అవుతున్న భావ న. అందుకే ‘దేజా వూ’ (ఇవన్నీ ఇదివరకు చూసిన దృశ్యాలే సుమా) అనిపిస్తున్నది.  

- కె. రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top