కొంపలు ముంచే ‘తెలివి’

కొంపలు ముంచే ‘తెలివి’ - Sakshi


ఆలోచనం



చంద్రబాబు అమరావతిలో బంగారు మాగాణిని రాజధాని కోసం సేకరించడమే కాక, అడవుల విధ్వంసం కోసం కేంద్రానికి అర్జీ పెట్టుకున్నాడు. ఆయన దృష్టిలో తెలివంటే ఇది. ఈ తెలివి ఆదివాసులకు రమ్మంటే మాత్రం వస్తుందా?



కుప్పంలోని గుడిపల్లెలో ఉప న్యసిస్తూ చంద్రబాబు ‘‘గిరిజ నులకు తెలివి ఉండదు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగు తుంటారు’’ అన్నారు. కొమరంభీం నవలకి  రాసిన ముందుమాటలో వరవరరావు ‘‘నిజాం సర్కారు, ఇంగ్లిష్‌ వాళ్ళు కూడా గోండులకు మెదడు తలలో ఉండదని భావించేవారు. ఇదంతా వలస రాచరిక భావన’’ అంటారు. బాబుకి ఉన్నది కూడా ఈ భావనే.ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసిన సంతాలీలు తెలివిలేనివారా? ఆయుధం అనివార్యమనే జ్ఞానాన్ని పొందిన కొమురంభీం తెలివిలేనివాడా? అన్యాయానికి ఎదురొడ్డిన సమ్మక్క సారలమ్మలు తెలివిలేని వాళ్లేనా? అసలు తెలివంటే ఏమిటీ? పక్కవాడి కడుపు ఎండబెట్టి మన కడుపుకు అవధులు లేకుండా చేసుకోవడమా? మన పొట్టకు మాత్రమే కాకుండా మనం ఎరుగని మన తరతరాల కడుపుల కోసం కూడా సంపాదించి, వాళ్లకి  చేయడానికి పనేంలేకుండా చేసి డ్రగ్‌ ఎడిక్ట్స్‌ అవ్వమని  ప్రోత్సహించడమా? ఏంటి తెలివంటే?



నిజమే.. బాబు  భావిస్తున్న తెలివి వారికి ఉండక పోవచ్చు. బ్రిటిష్‌ వాడు మారణాయుధాన్ని ఛాతిమీద నొక్కి పెట్టి లొంగిపొమ్మని అన్నపుడు, తలవంచ నిరాకరించి సీదో, కాన్హోలు మరణానికి సిద్ధపడటం బాబు రాసిపెడుతున్న చరిత్రలో తెలివి తక్కువతనమే. పన్నెండూర్లలో ప్రజలు దున్నుకుంటున్న భూమిపై పట్టాలిస్తానని నైజాం అన్నపుడు అంగీకరించక ‘బగటూర్‌ వోరుబాటో, నైజాం రాజ్‌ బోరు బాటో’ (ఎక్కడి వాడు బావా, నైజాం రాజు ఎవరోయ్‌ బావా) అంటూ పన్నెం డూళ్లపై తమ అధికారాన్ని గుర్తించాలని గర్జించి బల యిన కొమురం భీం ఖచ్చితంగా బాబు దృష్టిలో తెలివి తక్కువ వాడే. బాబు దృష్టిలో తెలివంటే ఏ ఎండకా గొడుగు పట్టడం కదా... ప్రపంచబ్యాంకు అడుగులకు మడుగులొత్తి, ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి దేశాన్ని అమ్మివేయడం. కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పం దాలు కుదుర్చుకుని, ఆదివాసుల, పేదల భూములు లాక్కుని వారికి నిలువలేకుండా చేయడం. ఆదివా సులు పక్షుల్లా, సీతాకోకచిలుకల్లా ప్రకృతి నుంచి తమ కెంత కావాలో అంతే తీసుకుంటారు. బాబు  అమరావతిలో పైపైనే నీరు ఊరే బంగారు మాగాణిని రాజధాని కోసం సేకరించడంతో ఆగక ఇంకా కావాలని అడవుల ధ్వంసానికి కేంద్రానికి అర్జీ పెట్టుకున్నాడు. ఆయన దృష్టిలో తెలివంటే ఇది. ఈ తెలివి ఆదివాసులకు రమ్మంటే మాత్రం వస్తుందా?



వర్షాకాలంలో పేదల్ని పీక్కుతినే మలేరియాకి కూడా బాబు మాటల్లాగే ఆదివాసుల ప్రాణాలంటే లెక్కవుండదు. ఏం చేస్తుందీ ప్రభుత్వం. వారి తల్లిగడ్డ మీద వారి హక్కులకు ఆంక్షలు విధిస్తుంది. వారి సౌందర్యమయమైన నిష్పూచీ జీవనశైలిని చిందరవం దర చేసి వారిని నేరస్తులంటూ ముద్ర వేస్తుంది. తెలివి లేని వాళ్ళని అంటుంది. ఈ మధ్య బాబుగారు ‘‘నాకింకేం కోరికల్లేవ్‌ పేద ప్రజాసేవ తప్ప’’ అంటూ అంత్య దశ మనుష్యుల ఆకాంక్షల్ని ఆయన తృప్తికర జీవిత నేపథ్యం నుండి చెబుతూ వస్తున్నారు. అవును కదా... ఆయన అన్నీ పొందారు, ఇంకేం కోరికలుంటాయ్‌ ఇప్పుడు మరింకే ఐహిక బాధలు లేకుండా ఉదారంగా ప్రజలకు ఏమైనా చేస్తారా అనిపిస్తుంటుంది. బాబు హృదయ పూర్వ కంగా నమ్మి అబద్ధాలు మాట్లాడుతారు. అవి భ్రమా త్మక ఉదార వాక్కులు మాత్రమే. బాబుగారి మాటల నుంచి సంస్కారాన్ని, ఆధునికతను, చేతులనుంచి ఉదా రతను మనం ఆశించకూడదు.



ఈ సందర్భంలో సీఎంకి ఒక కథ చెప్పాలని పిస్తుంది నాకు. యయాతి మరణానంతరం స్వర్గానికి వెళ్లి చాలా రోజులు ఉన్నాక ఒక రోజు స్వర్గాధికారులు పిలిచి నీ గడువు ముగిసింది ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నారట. యయాతి తన పుణ్యం అంత చిన్నదా అంటూ వాదనకి దిగారట. అప్పుడు స్వర్గాధిపతులు ‘‘సరే భూమి పైకి వెళ్ళు నిన్ను ఏ చిన్న ప్రాణి తలుచు కుంటూ ఉన్నా నీకిక్కడ ఉండడానికి మళ్ళీ అను మతి లభిస్తుంది’’ అని చెప్పి పంపారట. యయాతి వెళ్ళాడు. భూమిపై ఆ రాజ్యాలు, ఆయన కోడళ్ళు, కొడుకులు, లేరు. అతి కొత్త ప్రపంచం ఉందక్కడ. దిగులు పడి కూర్చుని ఉండగా ఒక తటాకంలో అతిదీర్ఘ కాలం నుంచి ఉన్న తాబేలు చెప్పిందట ‘‘ఈ తటాకం యయాతి రాజు తవ్వించింది. ఆయన చలవ వలన, ఆయన పుణ్యాన నేనివాళ సుఖంగా ఉన్నాను’’ అని. దాంతో.. ఆ చెరువు, ఆ తాబేలు కారణంగా ఆయన మళ్ళీ స్వర్గానికి వెళ్లిపోయారు.



కాలం మనుషులను, మేడలను, ఆస్తులను నగా నట్రలను నిర్దాక్షిణ్యంగా మింగేసి నామరూపాలు లేకుండా చేసేస్తోంది. కానీ అది కూడా ఆగి నిలబడి మాట మంచితనం, మనిషి మంచితనం ఘనతను కీర్తి స్తుంది. సమ్మక్కసారలమ్మలను, సిద్దో, కాన్హలను దేవు ళ్లుగా నిలుపుతుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాటా మాట్లాడేసే సీఎం చంద్రబాబు నాయుడికి ఇది ఎవరు చెబుతారు?



సామాన్య కిరణ్‌

వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top