చిన్న వరం, పెద్ద సంబరం

చిన్న వరం, పెద్ద సంబరం - Sakshi


రేవంత్‌రెడ్డి షరతులతో కూడిన బెయిల్ మీద విడుదలైనట్టుగా లేదు. ఆయన బెయిల్‌ను సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తరఫు న్యాయ వాదులు కాగితాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా లేదు. ఆయన నిర్దోషిగా బయటికి వచ్చినంతగా వాతావరణాన్ని సృష్టించేశారు తెలుగుదేశం పార్టీ వారు. ఓటుకు నోట్లు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి నిందితుడు. కేసు విచారణ పూర్తయి న్యాయస్థానం తీర్పు వెలువడే వరకూ నిందితుడిని జైలులో ఉంచడం న్యాయసూత్రాలకు విరుద్ధం. కాబట్టి బెయిల్ ఇవ్వడం సహజం. హర్షించాలి కూడా.

 

 తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నాయకుడు రేవంత్‌రెడ్డికి హైకోర్టు షరతు లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి తప్ప, ఇంకెక్కడికి వెళ్లడానికి వీలులేదని హైకోర్టు షరతు విధించింది. ఆయన పాస్‌పోర్ట్ కూడా స్వాధీనం చెయ్యాలని కోరింది. ఈ వార్తాలేఖ రాస్త్తున్న సమయానికి ఇంకా ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదల కాలేదు. బెయిల్ ఉత్తర్వుల కోసం వేచి చూస్త్తున్నారు. రేవంత్‌కు బెయిల్ మంజూరు అయిందని తెలియగానే భార్యాపిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా ఉద్వేగానికి గురయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. సహజంగా జరిగేదే ఇది. కుటుంబ పెద్ద- భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, కొడుకు కావచ్చు, ఒక నెల రోజులపాటు జైలులో గడిపి తిరిగి వస్త్తుంటే ఎవరైనా ఉద్వేగానికి గురవుతారు. స్టీఫెన్సన్ అనే నామినేటెడ్ శాసన సభ్యుడికి 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ పట్టుబడి, జైలుకు వెళ్లారు రేవంత్‌రెడ్డి. మే నెల 31న ఇది జరిగింది.

 

 రేవంత్‌రెడ్డి తన సొంత లాభం కోసం స్టీఫెన్సన్‌ను ప్రలోభ పెట్టలేదు. తన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే ఆ పని చేశాడు. ఆ మాట చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పినట్టు టెలిఫోన్ సంభాషణల రికార్డులు బయటపడ్డాయి. అవి తన మాటలు కావు అని చంద్రబాబు ఇప్పటివరకు చెప్పలేదు. చంద్రబాబు రేవంత్‌కు ఈ పనిని అప్పగించింది కూడా శాసనమండలి ఎన్నికలలో తమ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించుకోవడం కోసమే. అధినేత ఆదేశాల మేరకు ఈ బాధ్యత నెత్తిన వేసుకుని రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లారు. ఆయన కుటుంబానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదు. రాజకీయాలలో ఉన్న వాళ్లు బయట చేసే పనులన్నిటికీ కుటుంబ సభ్యులు జవాబుదారీ కారు. అయితే బాధ ఉంటుంది. దశాబ్దాల తరబడి తమతో జీవితం పంచుకున్న వ్యక్తి ఏ కారణంగా జైలుపాలైనా కుటుంబసభ్యులు పడే బాధే రేవంత్ కుటుం బం ఈ నెల రోజులూ పడింది. ముందే చెప్పినట్టు ఇది చాలా సహజం.

 

 ఎందుకీ హడావుడి?

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, శాసనసభ్యులు ఇతర నాయకులు రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయిందన్న వార్త వినగానే ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. తెలంగాణ జిల్లాలతో బాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా బాణాసంచా పేల్చి పండుగ చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఈ నెల రోజులు నివాసం ఉన్న చర్లపల్లి జైలు ముందు టీడీపీ హడావుడి అయితే చెప్ప నక్కర లేదు. ఈ మధ్యే ఆయన జైలులో ఉండగా కట్టిన పాటలు పాడారు, నృత్యాలు చేశారు. టీవీ చానళ్ల మైకులు ముందున్నాయి కదా అని ఒళ్లు మరచి ప్రసంగాలు చేశారు. మర్యాదలను అతిక్రమించే విధంగా వారిలో కొందరి భాష సాగింది. రాజ్యం పన్నిన కుట్రను ఛేదించి బయటికి వచ్చిన మహా నేతగా రేవంత్‌రెడ్డిని వర్ణించారు. టీడీపీ కార్యాలయం ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవ న్‌లో తెలంగాణ టీడీపీ నాయకులూ పోటీలుపడి రేవంత్‌రెడ్డి బెయిల్ మీద విడుదల కావడాన్ని గొప్ప విజయంగా శ్లాఘించారు. ఇంకా ఏమేమి జరగబో తున్నాయో చూస్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో తన కార్యాలయంలో సమీక్షలు చేస్తున్నారు.

 

 ఇంకా టీవీ కెమెరాలు ముఖ్యమంత్రి కార్యాలయం చేర లేదు, అక్కడి దృశ్యాలు రికార్డు చెయ్యడానికి. ఇదంతా చూస్త్తుంటే రేవంత్‌రెడ్డి షరతులతో కూడిన బెయిల్ మీద విడుదల అయినట్టుగా లేదు. ఆయన బెయి ల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తరఫు న్యాయవాదులు కాగితాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా లేదు. ఆయన నిర్దోషిగా బయటికి వచ్చినంతగా వాతావరణాన్ని సృష్టిం చేశారు తెలుగుదేశం పార్టీ వారు. ఓటుకు నోట్లు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి నిందితుడు. కేసు విచారణ పూర్తయి న్యాయస్థానం తీర్పు వెలువడే వరకూ నిందితుడిని జైలులో ఉంచడం న్యాయసూత్రాలకు విరుద్ధం. కాబట్టి బెయిల్ ఇవ్వడం సహజం. హర్షించాలి కూడా.

 

 నిందితులకు అండా?

 నిందితులందరి విషయంలో ఈ న్యాయం జరుగుతుందా అంటే, లేదు. అందరికీ న్యాయం ఒక లాగా ఉండదు అని చెప్పడానికి ఢిల్లీ ప్రొఫెసర్ సాయి బాబా ఒక తాజా ఉదాహరణ. పౌర హక్కుల సంఘాలు ఆ విషయంలో చేస్తున్న ఉద్యమాలు ఎవరికీ పట్టడం లేదు. సరే, అది ఇంకో అంశం. ఇక్కడ రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే ఆ కేసులో ఏసీబీ దర్యాప్తు ఇంకా జరుగుతు న్నది. మరి కొందరికి ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్నారు. ఒక నిందితుడు పొరుగు రాష్ర్టంలో, అక్కడి పోలీసుల రక్షణలో హాయిగా కాలం గడిపేస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తులో సహకరించాల్సిన మరో ప్రజా ప్రతినిధి ఏసీబీ నోటీసులను త్రోసిరాజని అదే పొరుగు రాష్ర్టంలో బాధ్యతారహి తంగా, వైద్యం పేరిట చట్టానికి దూరంగా తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడారంటున్న ఆడియో టేపుల పరీక్ష ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరి గింది. దాని వివరాలు ఇంకా బయటికి రావలసి ఉన్నది.

 

ఇంకా ఎంత మంది ఈ వ్యవహారంలో పాత్రధారులో తెలియాల్సి ఉన్నది. కేవలం ఒక్క శాసన మండలి స్థానం గెలుచుకోడానికి కాదు ఇదంతా చేసింది, మా ప్రభుత్వాన్నే కూలదోయడానికి పెద్ద కుట్ర దీని వెనక ఉంది అని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. కాదు తెలంగాణలో మా పార్టీని బలహీనపరచడానికి టీఆర్‌ఎస్ చేసిన కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నది అని తెలుగుదేశం అంటు న్నది. ఎవరేం చేశారన్నది ఏసీబీ దర్యాప్తు పూర్తయి, న్యాయ విచారణ జరిగితే తప్ప బయటపడదు. శాసనసభ్యుడి ఓటు కోసం ఐదు కోట్లు ఇవ్వజూపి భంగపడి కేసులో ఇరుక్కున్న వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడా నికి తెలుగుదేశం అధినేత, ఆయన పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టినట్టే. సెక్షన్ 8ని ముందుకు తెచ్చారు, తమ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు. రకరకాల అంశాలను తెర మీదకు తెచ్చి చివరికి చంద్రబాబునాయుడు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదన్న చిన్న విషయం దాకా జనం దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారు.

 

వెర్రితలలు వేస్తున్న రాజకీయం

ఇతర పార్టీల శాసన సభ్యులను ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్ తన సంఖ్యను పెంచు కోగా లేనిది, మేము చేస్తేనే తప్పయిందా అని కూడా వాదించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టానని చెప్పే జూపూడి ప్రభాకర్‌రావు లాంటివారు అదే రాజ్యాంగం మీద ఏమాత్రం గౌర వం లేకుండా ‘ఎవరు పతివ్రతలు కనుక?’ అని మహిళలను కూడా అవమా నించే విధంగా, ‘అవినీతి మామూలే’ అని మాట్లాడేవరకూ ఈ ధోరణి వెర్రిత లలు వేస్తున్నది. ఇతర పార్టీల శాసన సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని ఎవ రూ సమర్ధించనక్కరలేదు. చట్టబద్ధంగా ఆ విషయంలో కూడా చర్యలు ఉండా ల్సిందే. ఇంత గందరగోళం జరుగుతుంటే రేవంత్‌రెడ్డికి కేవలం షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడాన్ని తెలుగుదేశం వారు ఒక గొప్ప విజయ మైనట్టు పండుగ చేసుకోవడం ఎందుకో ఆత్మ విమర్శ చేసుకోవాలి. కథ ఇక్కడితో ముగిసిందని అనుకుంటే పొరపాటు. ఇంకా ఉంది.

 

 ఇక కొసమెరుపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రావెల కిషోర్‌బాబు అనే మంత్రి ఉన్నారు. ఆయన మంగళవారం విలేరులతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా స్థానిక సంస్థలకు చెం దిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో శిబిరం ఏర్పాలు చేసి ఉంచడాన్ని ఆక్షేపించారు. వైఎస్‌ఆర్ కాం గ్రెస్, టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యిందనడానికి ఇదే నిదర్శనం అన్నారాయన. అధికారబలంతో తమ సభ్యులను తెలుగుదేశం వారు డబ్బు ఆశ చూపి చెన్నైకి తరలిస్తే మిగిలిన వాళ్లను కాపాడుకోడానికి వైఎస్‌ఆర్ సీపీ గద్వాల శిబి రం తెరిచింది. మరి తెలుగుదేశం పార్టీ చెన్నైలో శిబిరం తెరిచిందంటే జయ లలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకేతో కుమ్మక్కు అయినట్టా? ఇది కిషోర్ బాబు గారే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మద్దతుతో మీరు స్థానిక సం స్థల ప్రతినిధులను చెన్నైకి తరలిస్తే, వైఎస్‌ఆర్ సీపీ అదే పోలీసుల దాష్టీకానికి భయపడి తన ప్రతినిధులను తెలంగాణకు తరలించింది. తెలంగాణ, తమిళ నాడు రెండూ పొరుగు రాష్ట్రాలే కదా !

 - దేవులపల్లి అమర్

 datelinehyderabad@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top