గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని...

గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని...


దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లుగా విడిపోయిన నేపథ్యంలో, విభ జన.. అనేక సంక్లిష్ట రాజకీయ పరిస్థితు లను తీసుకువచ్చింది. సీమాంధ్రలో రాజ ధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీకి రాయలసీమకు సంబంధించిన చారిత్రక వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది.



ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, సీమాంధ్ర ఒక రాష్ట్రంగా కొనసాగటం అని వార్యమైంది. ఈ ప్రాంతానికి రాజధానిని నిర్ణయించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంగా గతంలో శ్రీ కృష్ణ కమిషన్.. ‘రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు తెలంగాణ, కోస్తాంధ్రలో ఉండవచ్చు కాని, ఒక ప్రాంతంగా రాయలసీమ మొత్తంగా వెనుకబడి ఉంది..’ అని పేర్కొనడం గుర్తుంచుకోవాలి. అందుకే అయి దున్నర దశాబ్దాల పైబడిన తర్వాత కూడా వెనుకబాటు తనం నుంచి బయటపడని రాయలసీమలో రాజధానిని నిర్మిం చడం ఈ ప్రాంత మనుగడకు తప్పనిసరి.



1953లో రాయలసీమలో రాజధానిని ఏర్పర్చాక మూడేళ్లలోనే రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చినప్పుడు గ్రేటర్ రాయలసీమ వాసులు విశాల దృక్ప థంతో అంగీకరించారు. ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపో యింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి. దక్షిణ భారత దేశంలోనే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. నీటిపారుదల సౌకర్యాలు, పరిశ్రమలు, రాజధాని ఏర్పాటు ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది.



గతంలో గ్రేటర్ రాయలసీమ అభివృద్ధికి మద్రాసు ప్రెసిడెన్సీలో చేపట్టిన మెకంజీ పథకం, 1951 కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టు, సిద్ధేశ్వరం ప్రాజెక్టు, ఖోస్లా కమిటీ ఈ ప్రాంతంలో సాగునీటి కోసం ప్రతిపాదించిన అనేక విలువైన పథకాలు నేటికీ ఆచరణకు సాధ్యం కాలేదు. తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, వెలిగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేరు నగరితోపాటు కేసీ కెనాల్ ఆధునీకరణ పనులు కూడా నేటికీ పరిపూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ రాయలసీమవాసులు (ప్రకాశం జిల్లాలో నేడు కొనసాగు తున్న గిద్దలూరు, కంబం, మార్కాపురం, పొదిలి, దర్శి, కనిగిరి, కందుకూరు, నెల్లూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలు) రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరుకోవడం సమంజసమే.



పైగా మార్కాపురం రెవెన్యూ డివిజన్ ప్రాంతం లోని దొనకొండ వద్ద దాదాపు 50 వేల ఎకరాల భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇది నూతన రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. కాబట్టి సారవంతమైన భూమిని వృథా చేయనవసరం లేదు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇక్కడ విమానా శ్రయం నిర్మించతలపెట్టారు. కాబట్టి అంతర్జాతీయ విమానా శ్రయానికి సీమాంధ్రలో ఎక్కడా లేని అనుకూలత ఉంది. రాజధాని ఏర్పాటు సందర్భంగా గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాల పరిస్థితిపై ప్రభుత్వం చర్చించడం లేదు. పోలవరం, పులిచింతల, రాజధాని.. ఇలా అన్నింటికీ ఏలూ రు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలపైనే సీమాంధ్ర ప్రభుత్వం కేంద్రీకరించినట్లు కనబడుతోంది. భవిష్యత్తులో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాదులు వేయకుండా గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు జరగాలి. చంద్రబాబు పరిపాలనలో ప్రత్యేక తెలంగాణ వాదం పుట్టింది, పెరిగింది అనే అంశం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అభివృద్ధిని వికేంద్రీకరించకుండా పాలన సాగించిన పరిణామాల్లో భాగంగానే తెలంగాణ ఉద్యమం బలపడింది. కాబట్టి గతంలో జరిగిన తప్పులను సవరించాలంటే గ్రేటర్ రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలి.



విశాలమైన మంచి రవాణా వ్యవస్థ, పారిశుధ్యానికి తగిన సౌకర్యాలు, విశాలమైన పార్కులు, చండీగఢ్ తరహాలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్ణయం జరగాలి. రాజధాని ఏర్పాటుకు సుదీర్ఘ కాలం పడుతుంది. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి వేల ఎకరాలను సేకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాని  కావాల్సింది సింగపూర్‌లు కాదు. 70 శాతం ప్రజలు పల్లెల్లో నివసించే  మన రాష్ట్రంలో సింగపూర్ తరహా రాజధాని ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదు.    

 

(వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు) ఇమామ్

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top