స్వప్నాలను పండించుకున్న సిద్ధుడు

స్వప్నాలను పండించుకున్న సిద్ధుడు


యనభై ఆరేళ్ల జీవితంలో ఆయన అధిరోహించని పదవులు, వేదికలు లేవు. సృజనశీలి. సౌజన్యమూర్తి. కల్తీలేని తెలుగు సంభాషణతో ఠీవైన పంచెకట్టుతో అరవైఏళ్ల పాటు తెలుగు జాతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచారు.


తెలుగునాట ఏడుపదుల సందడి సద్దుమణిగింది. గలగల లాడే ఒక సెలయేరు నిర్జీవమై నిలిచిపోయింది. తెలుగు కవిత ఆయన కోసం వెతుక్కుంటుంది. ఆ సృజన శీలిపై బెంగపడుతుంది. ‘సి.నా.రె.’ మూడక్షరాల సంతకం మానస సరోవరంలో ఈదాడే రాయంచలా ఉండేది. ఆయన దస్తూరి తెలుగు లిపికి పట్టువస్త్రాలు కట్టినట్టుండేది. జీవితంలోనూ సాహిత్యంలోనూ మడత నలగని పొంది కైన మనిషి. గొప్ప స్వాప్నికుడు. ఊరికే కలలు కంటూ రికామీగా కూచోకుండా, నిరంతర సృజనతో స్వప్నాలను పండించుకున్న సిద్ధుడు. ఈ పోటీ లోకంలో ఆరు దశాబ్దాల పాటు ‘సెలెబ్రిటీ హోదా’ని చలాయించుకున్న అపురూప వ్యక్తి సింగిరెడ్డి నారాయణరెడ్డి.



నవాబ్‌ పాలనలో ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ దాకా చదివారు. ఆపై చదువులు తెలుగు మాధ్యమంలో చేశారు. నారాయణరెడ్డికి ఉర్దూ, పారశీ భాషలపై మంచి పట్టుంది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడై, విద్యార్థులకు పాఠాలు చెప్పే పనిలో పడ్డారు. ప్రబంధ సాహిత్యం, కావ్యాలు నాటి డిగ్రీ, పై డిగ్రీలకు నిత్యం బోధించేవారు. నారాయణరెడ్డి పాఠం చెబుతుంటే ఆ తరగతికి సైన్స్, కామర్స్‌ శాఖల విద్యార్థులు సైతం వచ్చి కూర్చునేవారు. చక్కని కంఠంతో పద్యం విడమరిచి ఆయన చదువుతుంటే – అర్థం చేసుకుంటూ ఆస్వాదిస్తూ విద్యార్థులు ఆనందించేవారు. పాఠాలు చెప్పడం ఆయన తొలి ప్రేమ. జీవితంలో ఎన్ని వ్యాపకాలు పెట్టుకున్నా విద్యార్థులతో గడపడం ఆయనకు ఇష్టం. అందుకే సినారె నిత్యోత్సాహిగా, నిత్య యవ్వనుడిగా మిగిలారు.


గంగ,యమున, సరస్వతి ముగ్గురాడపిల్లలు. వివేక్‌నగర్‌లో ఆ ఇంటిపేరు త్రివేణి. గురువుగారి లెక్క తేడా వచ్చింది. నాలుగో నది కృష్ణవేణి కదిలి వచ్చింది. సినారె రచించిన అద్భుతమైన గీత కావ్యాలు రామప్ప,∙కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం సర్వత్రా గుబాళించాయి. ఆ పరిమళాలే చిత్రసీమకు నడిపిం చాయి. స్వగ్రామం హనుమాజీపేటలో మూట కట్టుకున్న జానపద బాణీలు, అష్ట దిగ్గజాల పదగుంఫనలు తన స్వీయవాణికి జత చేసుకున్నారు. వేలాది పల్లవులు ఆశువుగా కువ్వలు పోశారు.



సాహిత్య ప్రక్రియల్లో దేని పదాలు దానికి వాడితేనే అందం. పాటలకు కొన్ని మాటలే ఒదుగుతాయి. ఆ మాటలు సినారెకు బాగా తెలుసు. పైగా ఆయన ఖజానాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. భావానికి అనువైన భాషని పొదగడంలో మహాశిల్పి. అవసరమైన చోట సమాసాలను సొగసుగా అల్లనూగలరు. జానపద శైలికి కావల్సిన సరుకూ సరంజామా ఆయన గోటి మీద ఉంటుంది. అందుకే సినారె గీతాలలో యమునా తరంగాలు, నందనవనాలు, నవపారిజాతాలు, తరిపి వెన్నెలలు, సైకత వేదికలు, వీణలు, వేణుగానాలు, పగలే వెన్నెలలు– ఇలా ఎన్నెన్నో పాత మాటలే ఈ కవి ప్రయోగంలో కొత్తగా ధ్వనిస్తాయి. అందుకే విశ్లేషకులు సినారె సినిమా పాటలకు కావ్య గౌరవం తెచ్చారని అభినందించారు.


పాటలు, లలిత గేయాలు, పద్యాలు, తెలుగు గజళ్లు, ప్రపంచ పదులు, భావ కవిత్వాలు, దీర్ఘ కవితలు ఇంకా ఆయన పండించని ప్రక్రియ లేదు. యనభై ఆరేళ్ల జీవితంలో ఆయన అధిరోహించని పదవులు, వేదికలు లేవు. సృజనశీలి. సౌజన్యమూర్తి. కల్తీలేని తెలుగు సంభాషణతో ఠీవైన పంచెకట్టుతో అరవైఏళ్ల పాటు తెలుగు జాతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచారు. పద్మభూషణ్, జ్ఞానపీuŠ‡ అవార్డ్‌ల గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యులు, ఆచార్య డాక్టర్‌ సి. నారాయణరెడ్డికి అశ్రుతర్పణం.


       -  శ్రీరమణ


     (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)



 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top