బ్రేకింగ్ న్యూస్.. అనర్థాల రేస్

బ్రేకింగ్ న్యూస్.. అనర్థాల రేస్ - Sakshi


డేట్‌లైన్ హైదరాబాద్


 


మీడియా మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలన్న విషయంలో ఎవరికీ విభేదం లేదు. కేంద్ర మంత్రయినా, గవర్నరయినా, పేద పత్తి రైతైనా... వారి విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే. మీడియాను వృత్తిగా స్వీకరించే వారికి అలాంటి శిక్షణ తప్పక ఉండాల్సిందే. కాకపోతే అదే స్వరంలో మీడియా మీద జరుగుతున్న ముప్పేట దాడిని గురించి కూడా మాట్లాడుకోవాలి. మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛల పట్ల పలుపురి వైఖరి, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉంటోంది.


 


రాష్ర్ట గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గత ఆదివారం నాడు ఒక సభలో మాట్లాడుతూ మీడియా పోకడల మీద కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోని ఆవేదననూ, ధర్మాగ్రహాన్ని మీడియాతో సహా ఎవరూ కాదనలేరు. తన సోదరుడి మృతి విషయంలోనే మీడియా వ్యవహరించిన తీరును ఆయన గతంలో కూడా కొన్ని సందర్భాలలో ఉదహరించారు. నరసింహన్ సోదరుడు ఐఏఎస్ అధికారిగా అస్సాంలో పని చేస్తుండగా ఉగ్రవాదుల మందుపాతర పేలుడుకు బలైపోయారు. ఆ విషాద సంద ర్భంలో ఆయన ముఖం మీద మైకు పెట్టి, ఎలా అనిపిస్తుంది? అని అడగడం కంటే దుర్మార్గం ఉంటుందా?


 


30 ఏళ్ల క్రితమే, మండల్ కమిషన్ సిఫార సులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలోనే మీడియా అమానవీయతపై పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. అప్పటికింకా 24 గంటల వార్తా చానళ్లూ లేవు, ఇంత పోటీ, ఉరుకులుపరుగులూ లేవు. 1985లో, ఆ ఉద్యమం సాగుతుండగా రాజీవ్ గోస్వామి అనే యువకుడు వందలాది మంది సమక్షంలో వంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాన్ని మరుసటి వారం ఒక ప్రముఖ ఇంగ్లిష్ వారపత్రిక రంగుల ముఖ చిత్రంగా ప్రచురించి సభ్యసమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. ఆత్మాహుతికి పాల్పడుతున్న వ్యక్తిని అడ్డు కుని, రక్షించాల్సిందిపోయి, ఆ పత్రిక ఫొటోగ్రాఫర్ ముఖచిత్రం కోసం ఆరాటపడటం ఏమిటని అంతా విమర్శించారు.


 


అనారోగ్యకర పోటీ


ఈ మూడు దశాబ్దాలలో మీడియా ఇటువంటి విషయాలలో ఏమీ మారలేదు సరికదా మరింత అమానవీయంగా తయారయింది. 24 గంటల న్యూస్ చానళ్లు వచ్చిన తరువాత అయితే పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. నరసింహన్ గారు చెప్పినట్టు ధ్యాస అంతా బ్రేకింగ్ న్యూస్ మీదే అయ్యేసరికి మిగతా విలువలన్నీ వెనుకబడి పోతున్నాయి. గవర్నరే అన్నట్టు దీనికి ప్రధాన కారణం ‘రాట్ రేస్’ (విపత్కర పోటీ). అందరికన్నా ముందున్నామని చెప్పు కోడానికి పెడుతున్న అనారోగ్యకరమైన పరుగు. ఫలితంగా చాలా సంద ర్భాల్లో వాస్తవాలు తెరమరుగయ్యే ప్రమాదం  ఉంటుంది.


 


రెండు రోజుల క్రితమే జరిగిన సంగతి చూడండి. 800 ఏళ్ల తరువాత ఒక హిందూ పాలకుడు దేశాన్ని పాలించబోతున్నాడని సార్వత్రిక ఎన్నికల విజయానంతరం నేటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారని, లోక్‌సభలో మార్క్సిస్ట్ సభ్యుడు సలీం అన్నారు. ఒక ప్రఖ్యాత ఆంగ్ల పత్రికపై ఉన్న నమ్మకంతో ఆ పత్రిక చేసిన వ్యాఖ్యనే ఆయన ఉదహరించారు. చాలా సీనియర్ మార్క్సిస్ట్ నాయకుడైన సలీం వ్యాఖ్యలు లోక్‌సభను కుదిపేశాయి. రాజ్‌నాథ్, తానా వ్యాఖ్యలు చెయ్యలేదని ఖండించారు, సలీం క్షమాపణ చెప్పాలని పట్టు బట్టారు. మార్క్సిస్ట్ నాయకులు ససేమిరా అన్నారు. ఇంత రాద్ధాంతానికి కారణమైన ఆ పత్రిక ‘‘అయ్యా క్షమించాలి. ఆ మాటలు అన్నది రాజ్‌నాథ్ కాదు, స్వర్గీయ అశోక్ సింఘాల్. మా పొరపాటును సవరించుకుంటున్నాం, మా పత్రిక ఆన్ లైన్ ఎడిషన్‌లో మార్చేశాం’’ అని ట్వీట్టర్‌లో సవరణ జారీ చేసింది. చిన్నదీ చితకదీ కాని ఆ పత్రికను నమ్మిన ఆ ప్రముఖ నేతకూ, ఆయన విమర్శకు గురైన మంత్రికి కూడా బాధ కలిగింది, నష్టం జరిగింది.


 


మీడియా నుంచి జరిగే ఇలాంటి తప్పులు పెద్దవైనా చిన్నవైనా హానికరమైనవి. అనారోగ్యకర పోటీతో సాగిస్తున్న ఈ ఉరుకులుపరుగుల వల్ల ఇలాంటి ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. కొద్ది కాలం క్రితం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఓ రైతు కలెక్టర్ కార్యాలయం మెట్ల మీద పురుగుల మందు తాగి, ఆత్మహత్యాయత్నం చేశాడు. జనం ఆ రైతును ఆస్పత్రికి తరలించే హడావుడిలో ఉంటే, మీడియా మిత్రులు మాత్రం ఆ రైతు ముఖం మీద మైకులు పెట్టి ప్రశ్నలు గుప్పించారు.


 


ఇటీవలే ఒక వార్తా చానల్, పత్రిక, ఒక వ్యక్తి సెల్ టవర్ మీద నుంచి దూకదాన్ని దశలవారీగా చిత్రించి ప్రసా రంచేసి, ప్రచురించి సంబరపడింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా చెప్పొచ్చు. మీడియా... అవి పత్రికలే కావొచ్చు, వార్తా చానళ్లే కావొచ్చు మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలన్న విషయంలో ఎవరికీ విభేదం లేదు. మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమని మీడియా పెద్దలే నిత్యమూ ఘోషిస్తున్నారు. కేంద్ర హోంమంత్రే అయినా, రాష్ర్ట గవర్నర్ అయినా, పేద పత్తి రైతయినా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించా ల్సిందే. మీడియాను వృత్తిగా స్వీకరించే వారికి అలాంటి శిక్షణ తప్పక ఉండాల్సిందేననడంలోనూ భిన్నాభిప్రాయం లేదు.


 


తెలుగు ఏలికల రాజకీయ అసహనం


కాకపోతే అదే స్వరంలో మీడియా మీద జరుగుతున్న ముప్పేట దాడిని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంత సేపూ మీడియా స్వీయ నియంత్రణ గురించే మాట్లాడే వారు సమాజంలో పెచ్చుపెరుగుతున్న అసహనాన్ని గురించి కూడా మాట్లాడితే, దానికి నివారణ మార్గం చూపితే బాగుంటుంది. మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మీడియాకు వెలుపల ఉన్న పలుపురి వైఖరి.. నోటితో నవ్వుతూ  నొసటితో వెక్కిరించినట్టుగా ఉంటోంది. గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా మీడియా మీద, విలేకరుల మీద ఆందో ళనకరమైన రీతిలో  దాడులు జరుగుతున్నాయి. అందుకు కారణం కారణం రాజకీయ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరే. ప్రస్తుతం ఎక్కడ చూసినా అస హనంపై చర్చే వినవస్తోంది. ఇక్కడ ప్రస్తావిస్తున్నది అవార్డు వాపసీలపై ప్రద ర్శిస్తున్న అసహనం గురించి కాదు. అటువంటి విషయాలను వార్తలుగా మలిచి ప్రజలకు చేరవేస్త్తున్న మీడియా పట్ల రాజకీయ వర్గాల్లో పెరిగిపోతున్న అసహనం గురించి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు, దేశ వ్యాప్తంగానే ఉంది.


 


గత జూన్‌లో  ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జగేంద్రసింగ్ అనే జర్నలిస్ట్‌ను స్థానిక రాజకీయ నాయకుడి ప్రాపకంలోని గూండాలూ, పోలీసులు కలిసి తగులబెట్టి చంపారు. అదే నెలలో మధ్య ప్రదేశ్‌లో మరో జర్నలిస్ట్‌ను ఇలాగే హతమార్చారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి మరో పది వరకు దాడుల్లో పలువురు జర్నలిస్టులు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ ఘటనలన్నింటికీ రాజకీయ నాయకత్వం అసహనమే కారణం. తమకు నచ్చని లేదా తమ ప్రయోజనాలను దెబ్బతీసే వార్తలు రాసినందుకే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.


 


మీడియాపై ముప్పేట దాడి


గవర్నర్ నరసింహన్ ఏలుబడిలోనే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ కీయ నాయకత్వం అసహనాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన వెంటనే అక్కడి ప్రభుత్వం ప్రదర్శించిన అసహనాన్ని ప్రపంచమంతా చూసింది. అది గవర్నర్ దృష్టికి రాలేదనుకోగలమా? అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలను అనుమతించని విషయం, వర్కింగ్ జర్నలిస్ట్‌ల ఉద్య మం నిరసన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం కూడా అందరికీ తెలుసు.


 


ప్రభుత్వ వ్యతిరేక వార్తలను వెలువరిస్తున్నాయంటూ, నిన్నగాక మొన్న ఏపీ ముఖ్యమంత్రి సాక్షి దిన పత్రిక చదవొద్దని, సాక్షి టీవీ చూడొద్దనీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో తప్పులు జరిగితే, ప్రజాధనం దుర్వి నియోగమైతే వాటిని వెలుగులోకి తేకుండా ఉండాలనే కోరిక పాలకులకు ఉండొచ్చు. కానీ, ఆయన పిలుపు మేరకు ఎవరైనా వాటిని చదవడం, చూడ టం మానేస్తే అది వారి ఇష్టం. కానీ, కొన్నేళ్లుగా అధికార పార్టీ కార్యాల యంలోకి  కొన్ని మీడియా సంస్థల ప్రతినిధుల ప్రవేశాన్ని  నిషేధించడం ప్రజాస్వామ్యంలో సరైన చర్యేనా? అని గవర్నర్  ఆలోచించాలి. తన ఏలు బడిలోనే జరుగుతున్న ఈ అప్రజాస్వామిక చర్యను గురించి గవర్నర్ మాట్లాడకపోయినా, సరిచేస్తే బాగుండేది.


 


చివరగా, తెలుగుదేశం పార్టీ నాయకుల అసహనం. దానికి పరాకాష్ట ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యా ద్యక్షుడు రేవంత్‌రెడ్డి గత బుధవారం విలేకరుల గోష్టిలో చేసిన వ్యాఖ్యలు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ... రేవంత్‌రెడ్డిని వెంట పెట్ట్టుకుని ప్రచారం చెయ్యడం ఏమిటని రాసినందుకు ఆయన ఈ కాలమిస్ట్ మీద విరుచుకుపడ్డారు. నిజమే కదా, అంతకు కొద్ది నెలల క్రితమే శాసన మండలి ఎన్నికల్లో అవతల పార్టీ శాసనసభ్యుడికి రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయి, జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటున్న వ్యక్తిని వెంట పెట్టుకుని ప్రచారానికి పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో, అందునా వరంగల్ వంటి చోట ఎక్కువ ఓట్లెలావొస్తాయి? ఆ మాట అన్నందుకు అసహనం, అవాకులు చవా కులూ పేలడమా? ఈ తరహా రాజకీయ నాయకులను ఎవరు కట్టడి చెయ్యాలి?


 


- దేవులపల్లి అమర్


datelinehyderabad@gmail.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top