చంద్రగ్రహణం చేరువైనట్టేనా?

చంద్రగ్రహణం చేరువైనట్టేనా? - Sakshi


ఆర్జేడికాని, లాలూప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబీకులుకాని అవినీతిపరులు కాదంటే నమ్మశక్యంకాదు. పశుగ్రాసం కేసులో లాలూ ఇరుక్కున్నప్పుడు నేతలు గడ్డి తింటున్నారని కాబోయే ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆనాడే సెలవిచ్చారు.



అవినీతికి ఒక హద్దంటూ ఉందని, దాన్ని దాటితే నిజాయితీపరులైన నాయకులు చేయగలిగిందేమీ ఉండదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమర్ నిరూపించారు. తేజస్వీ యాదవ్ హద్దుమీరడంతో అది తన పీకకు చుట్టుకున్నప్పుడు పాపం నితీశ్ మాత్రం ఏం చేయగలరు? బయటపడే మార్గంకోసం ఒకరోజుకాదు రెండ్రోజులు కాదు, ఏకంగా 17 రోజులు ప్రయత్నిస్తూ పెనుగులాడారు.  ప్రతి ఒక్కరినీ, రాహుల్ గాంధీతో సహా అందరినీ సంప్రదించారు. నితీశ్ మాటల్లోనే: "లాలూజితో మాట్లాడాను...తేజస్వితో సమావేశమయ్యాను. ఆఖరికి రాహుల్ గాంధీతోనూ మాట్లాడి మార్గంకోసం అన్వేషించాను. ఏమీ జరగలేదు. లాలూజీకి ఫోన్ చేసినప్పుడల్లా ఎంతసేపూ మేము కష్టాల్లో ఉన్నాం, దయచేసి కాపాడండి అనడం తప్ప ఏమీ చేయలేదు. అది వారి స్వయంకృతం. వివరణ ఇవ్వాల్సిందే. కానీ అదికూడా చేయలేదు."



నితీశ్‌ది ఒక పరిణితి చెందిన రాజకీయవేత్త తీసుకునే నిర్ణయమే. రాత్రికి రాత్రి ఆయన హడావిడిగా చేసినది మాత్రం కాదు. కాకపోతే ఉభయత్రా ఆలోచించి నిర్ణయం అటో ఇటో తీసుకోడానికి వేచి ఉన్నారంతే! ఇక కలిసి పనిచేయటం కష్టమని తేలిపోయాక ప్రకటించారు. ప్రధాని మోదీ "అవినీతి వ్యతిరేక పోరాటంలో చేరుతున్నందుకు నితీశ్ కుమార్ కు అభినందనలు. నిజాయితీకి మద్దతుగా మీ నిర్ణయాన్ని 125 కోట్లమంది స్వాగతిస్తున్నారు," అని ట్వీట్ చేశారు.



బిహార్ కు ఒక నీతి ఆంధ్ర ప్రదేశ్ కు మరో నీతి ఉండకూడదు కదా. ఓటుకు నోటు కేసు, ఎన్నికల వాగ్ధానాన్ని నిలుపుకోమంటే అణచివేత చర్యలు, లక్షల కోట్ల రూపాయల భూకుంభకోణాలు, ఇవన్నీ ఆయన చూస్తూనే ఉండొచ్చు. జగన్ ఇచ్చిన అవినీతి చక్రవర్తి పుస్తకంలో కొన్నిపుటలైనా తిరగేసి ఉండొచ్చు.



లాలూ కుటుంబం మేం కష్టాల్లో ఉన్నామన్నదేకాని, అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా, ఒక ముఖ్యమంత్రిని ఏంచేయగలరని ప్రశ్నించారే తప్ప, ఎమ్మెల్సీ స్టీఫన్ తొ ఫోన్ సంభాషణలో ఉన్నది తనస్వరంకాదని పాపం ఎన్నడూ అనలేదు. బాబుగారు తన తప్పిదం ఒప్పుకున్నారని మోదీకి ఈపాటికి అర్థమయ్యే ఉండాలి. బాబుగారిని కంటికిరెప్పలా కాపాడే వెంకయ్యగారిని కూడా దూరంచేశారు కాబట్టి ఇక తర్వాత దృష్టిపెట్టేది ఆంధ్రప్రదేశ్ పైన అనే ఆశిద్దామా?



- బులుసు ప్రభాకర శర్మ (సీనియర్ పాత్రికేయులు)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top