మదగజాలు మనకెందుకు?


భోగాపురం విమానాశ్రయానికి 4,000 ఎకరాలు ఎందుకు? అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా బతికి బట్టకట్టగలుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలూ, అంచనాలూ ఏమిటి? కానీ భోగాపురం విమానాశ్రయం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను అధిగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది. అదే జరగాలంటే ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల ప్రజలు మొత్తం నెలకి ఒక్కసారైనా గగనయానం చేయవలసి ఉంటుంది.

 

 ఆంధ్రప్రదేశ్ దిశ దశ తీరు ఆందోళనకు, విచారానికి గురిచేస్తోంది. భారత దేశంలో ప్రభుత్వాలు తాము ఏం చేయదలుచుకున్నాయో, అదే చేస్తుంటాయి. కాబట్టి ప్రజలు వాటిని అదుపులో పెట్టలేరు. ఆ ప్రభుత్వాలు కూలిపోయిన తరువాత కూడా  వాటి ద్వారా ఒనగూడిన నష్టాలను ప్రజలు అనుభవిస్తూ ఉండవలసిందే. ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కానీ ఆ ప్రభుత్వం వల్ల సంభవించిన చేటును ప్రజలంతా  చవిచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మరో దశాబ్దానికి గాని కోలుకోలేదు. 2004-2014 మధ్య మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

 

 కానీ విజ్ఞులైన రాజకీయవేత్తలు తప్పులు జరిగాయని భావించగానే పద్ధతి మార్చు కుంటారు. జాన్ ఎఫ్ కెన్నడీ తాను చేసిన తప్పులను గ్రహించాడు. వాటిని సరిదిద్దుకున్నాడు కూడా. అందుకే ఇప్పటికీ ఆయనను స్మరించుకుంటున్నాం. రైతులు, దళితులు, ఇతరులకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం అమలు తీరు మారాలని నేను ముందునుంచీ ఆందోళన చేస్తున్నాను. పోలవరం డ్యామ్ పేరుతో, తాడిపూడి పంపింగ్ పథకం పేరుతో, కాకినాడ సెజ్ కోసం, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం కోసం, రాజమండ్రి విమానాశ్రయం విస్తరణ కోసం ఈ పేదవర్గాల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు.

 

 అవసరాలకు అనుగుణంగానే...

 రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు వంటి మౌలిక వసతులు అవసరమే. కానీ వాటి నిర్మాణం అవసరాలకు అనుగుణంగా జరగాలి. ఓ విమానాశ్రయమో, నౌకాశ్రయమో నిర్మించి పెడితే విమానాలూ, నౌకలూ వాటంతట అవే వస్తాయనుకోవడం తప్పుడు అభిప్రాయం. ఇది రుజువైంది కూడా. చైనా, జపాన్ వంటి దేశాలు మౌలిక వసతుల సామర్థ్యాన్ని అతిగా పెంచుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాలు అవసరం లేని రోడ్లు నిర్మించాయి. వృథాగా రైల్వేమార్గాలను నిర్మించి పెట్టుకున్నాయి. విమానాశ్రయాలను నిర్మించి ఖాళీగా పెట్టుకున్నాయి. దీనితో ఎదురైన ఆర్థికభారం ఆ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. జపాన్ సంపన్న దేశం కాబట్టి తన పౌరులను కష్టాలలో పడకుండా రక్షించుకుంది.

 

 చైనాలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు కాబట్టి, ప్రజల ఆగ్రహాన్ని అణచిపెట్టి ఉంచింది. చైనా 150 కొత్త విమానాశ్రయాలను, వందలాది కొత్త నౌకాశ్రయాలను నిర్మించింది. రైల్వే మార్గాన్ని రెట్టింపు చేసింది. వేల మైళ్ల జాతీయ రహదారులను తయారుచేసింది. కానీ వాటిలో చాలావరకు విమానాశ్రయాలలో విమానాల జాడ కానరాదు. నౌకాశ్రయాలలో నౌకల రాకపోకలు ఉండవు. రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు ఖాళీ. అతి సామర్థ్యమే చైనా సంక్షోభానికి కారణమని ప్రతి ప్రముఖ ఆర్థికవేత్త చెబుతాడు. అక్కడ ఇప్పుడు చాలా సిమెంట్ కర్మాగారాలను మూసేశారు. కానీ ఒకటి. అవినీతి రాజకీయవేత్తలతో ఆ దేశం వ్యవహరించే తీరు ప్రత్యేకం. అవినీతి వ్యవహారాలలో పట్టుబడితే, అలాంటివాళ్లను కాల్చి చంపే బృందం లేదా ఉరి తీయడానికి తాళ్లు సిద్ధంగా ఉంటాయి. ఒక రైల్వే మంత్రి కాల్పుల బృందం చేతిలో మరణించాడు.

 

 ఈ గణాంకాలు తెలియవా?

 నౌకాశ్రయాలూ, విమానాశ్రయాల స్థాయి మౌలిక వసతుల గురించి ఆంధ్రప్రదేశ్ మాత్రమే మాట్లాడుతోంది. మికెన్సీ వంటి విదేశీ నిపుణులు, సింగపూర్ ప్రభుత్వం దీనికి సలహాదారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురంలో 4,000 ఎకరాలలో విమానాశ్రయం నిర్మించాలని ఆరాటపడుతోంది. అలాగే రాజమండ్రి విమానాశ్రయాన్ని విస్తరించాలని అనుకుంటోంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం 3,500 ఎకరాలలో విస్తరించి ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం కూడా దాదాపు అంతే. ముంబై విమానాశ్రయాన్ని 2,200 ఎకరాలలో నిర్మించారు. హైదరాబాద్‌లోనే బేగంపేట విమానాశ్రయం 700 ఎకరాలలో ఏర్పాటైంది. రోజుకు ఢిల్లీ-1,400, ముంబై-1,200, చెన్నై-400, హైదరాబాద్- 300, అహ్మదాబాద్ - 120, గోవా-100, త్రివేండ్రం-50, విశాఖపట్నం-40, భువనేశ్వర్-35, రాజమండ్రి-16 వంతున విమానాలు రాకపోకలు సాగిస్తాయి.

 

 భోగాపురం షాంఘై నగరం కాదు

 భోగాపురాన్ని ఎవరైనా ఒక పెద్ద నగరంగా భావించగలరా? అదేమైనా చైనాలో షాంఘై నగరమా? విశాఖ విమానాశ్రయానికి 40 విమానాలు రాకపోకలు సాగిస్తుంటే, భోగాపురానికి 4 మించి రాకపోకలు సాగించవు. అసలు ఒక్కటి కూడా రాకపోయినా ఆశ్చర్యం లేదు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నదేమిటి? ఒక్కొక్క ప్రయాణికుడి రూ. 500 వంతున అభివృద్ధి రుసుము కింద చెల్లిస్తే తప్ప వాటిని నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వానికి చెప్పాయి. ఆ రకంగా చూస్తే ప్రయాణికుడు నుంచి రూ. 2,000 వసూలు చేస్తే తప్ప భోగాపురం విమానాశ్రయాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ ఇది ప్రభుత్వ నిర్వహణలో విమానాశ్రయమైతే, నాసిక్ విమానాశ్రయం మాదిరిగా మూసుకోవాలి.

 

 భోగాపురం విమానాశ్రయానికి 4,000 ఎకరాలు ఎందుకు? అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా బతికి బట్టకట్టగలుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలూ, అంచనాలూ ఏమిటి? కానీ భోగాపురం విమానాశ్రయం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను అధిగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది. అదే జరగాలంటే ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల ప్రజలు మొత్తం నెలకి ఒక్కసారైనా గగనయానం చేయవలసి ఉంటుంది. విజయవాడ, విశాఖ విమానాశ్రయాలు ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాలు. మరి, కేవలం 200 మైళ్ల పరిధిలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎందుకు? నిజానికి రాజమండ్రి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాలు ఇప్పటికి కూడా ఉదయం, సాయంత్రం తప్ప మిగిలిన సమయం మొత్తం ఖాళీగా ఉంటాయి.

 

 ఈ నౌకాశ్రయాలు అవసరమా?

 ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ, భావనపాడు నౌకాశ్రయాలు పనిచేస్తున్నాయి. ఇంకా మచిలీపట్నం, నరసాపురం, నిజాంపట్నం, ఓడరేవు, ముత్యాలంపాలెం, భీమునిపట్నం నౌకాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన సందర్భంగా కేవలం కొన్ని మైళ్ల దూరంలో దగ్గరదగ్గరగానే నౌకాశ్రయాలు చూసి, ఇక్కడ కూడా అలాగే నిర్మిస్తే అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని అభిప్రాయపడుతున్నారని మీడియాలో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది. కానీ జపాన్‌లో కనిపించే ఆ నౌకాశ్రయాలన్నీ వందల సంవత్సరాల క్రితమే నిర్మించుకున్నవి. 1900 సంవత్సరం నుంచి మొదట రష్యాతో తరువాత అమెరికాతో జరిగిన యుద్ధాల సమయంలో వాటిని నిర్మించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి చరిత్ర లేదు. భావనపాడు, కళింగపట్నాలలో చేపలవేటకు ఉద్దేశించిన నౌకాశ్రయాల నిర్మాణం పూర్తయింది. తీరా చేపలవేట పడవలను ఎక్కువగా విశాఖలోనే ఉపయోగిస్తున్నారు. కానీ చేపలవేట సాగించే పడవలు లేని చోట్ల వేల ఎకరాలు సేకరించి నౌకాశ్రయాలు నిర్మించారు.

 

 చైనాను చూసి మోసపోవద్దు

 మన నాయకులు చైనాలో పర్యటించి వచ్చి, అక్కడి అభివృద్ధి గురించి ఊదరగొడుతూ ఉంటారు. కానీ చైనా అభివృద్ధిని చూసి ఇవాళ ప్రపంచం నవ్వుకుంటోంది. గడచిన సంవత్సరం 130 చైనా విమానాశ్రయాలు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూశాయని ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రఫుల్ పటేల్  పౌర విమానయాన మంత్రిగా ఉండగా నాసిక్ నగరానికి ఒక విమానాశ్రయాన్ని మంజూరు చేశారు. అక్కడ నుంచి ఒక్క విమానం కూడా ఎగరదు, దిగదు. దానిని వైమానిక దళాన్ని తీసుకోమన్నారు. ఇప్పుడు పటేల్ మంత్రి కాదు. కాబట్టి బంట్రోతు కూడా ఆయన మాట వినడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఆ శాఖను నిర్వహిస్తున్నప్పటికి ఇలాంటి పనికి మాలిన బహుమానాలు మాత్రం మనకి వద్దు. ఇంకో పౌర విమానయాన మంత్రి వస్తే తరువాత పరిస్థితి ఏమిటి? నాలుగు వేల ఎకరాల భూమిని ఎందుకు వృథా చేయాలి?

 ఈ దండగమారి వ్యవహారాలు ఎందుకు!

 

 భోగాపురం విమానాశ్రయం శుద్ధ దండగమారి వ్యవహారం. దేశంలోని మిగిలిన విమానాశ్రయాల కోసం సేకరించిన భూమి, భోగాపురం విమానాశ్రయం కోసం సేకరించిన భూమి కంటే తక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి. నాసిక్ విమానాశ్రయం వలె దీనిని మూసివేయడం జరగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు భరోసా ఇవ్వాలి. ఐదేళ్ల తరువాత కూడా విమానాశ్రయం పుంజుకోకపోతే రైతుల భూములు వారికి తిరిగి ఇవ్వాలి. నిజానికి రాకపోకలు సరిగా లేని, 4,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన విమానాశ్రయాన్ని నిర్వహించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదు.

 

అంతా సజావుగా సాగాలంటే ఇక్కడికి రోజుకు కనీసం 500 విమానాలు రాకపోకలు సాగించాలి. మచిలీపట్నం సహా, ఇతర నౌకాశ్రయాలు కూడా వ్యర్థమే. ఇవి సహజ నౌకాశ్రయాలు కాకపోవడం వల్ల, నిత్యం పూడిక తీయవలసిన పని ఉంటుంది. ఇంత భూమి సేకరించడం వెనుక ఆలోచన చూస్తుంటే, ఎవరో రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు భూమి అప్పగించి, మనకి ఇంకో నౌకాశ్రయం వచ్చిందని చెప్పడానికే అని అనిపిస్తుంది. కాకినాడ సెజ్ 10,000 ఎకరాల భూమికి సంబంధించినది. కానీ అక్కడ జరుగుతున్నదేమీ లేదు. సెజ్ పేరుతో తీసుకున్న తమ భూములను వెనక్కు ఇవ్వాలని అక్కడ రైతులు కోరుతున్నారు. ఒకటి వాస్తవం. మహారాజులు కూడా తెల్ల ఏనుగులను భరించలేరు. నిజానికి అనాలోచితంగా నిర్మించిన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు తెల్ల ఏనుగులు కూడా కాదు. అవి మదగజాలు. మనుషులను చంపడానికే ఉపయోగపడతాయి. అవి మనకొద్దు.

 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)

 మొబైల్: 98682 33111

 - పెంటపాటి పుల్లారావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top