రుణమాఫీలో శషభిషలేల?

రుణమాఫీలో శషభిషలేల?


ఈ ‘మనం’ పరిధిలోకి భారతీయులంతా, అంటే రైతులతో సహా చేరితే అప్పుడు వేరే విధంగా ఉంటుంది. మనం బులెట్‌ రైళ్లను ఏర్పాటు చేసుకోగలిగితే, పన్ను మాఫీ చేయగలిగితే, సంస్థ లను కష్టాల నుంచి బయటపడవేసే చర్యలు తీసుకోగలిగి ఉంటే, కార్పొరేట్‌ సంస్థల భారీ రుణాలను సర్దుబాటు చేయగలిగితే, పెద్ద మొత్తంతో రక్షణ బడ్జెట్‌ను రూపొందించుకోగలిగితే, రైతుల విముక్తి కోసం కూడా రుణ మాఫీ భారాన్ని భరించగలం. అయితే ఇలాంటి వాదన రుణ మాఫీ గురించి లేవనెత్తుతున్న అన్ని అభ్యంతరాలకు, ప్రశ్నలకు సమాధానం కాబోదు.



రైతుల రుణాలను మాఫీ చేసిన రాష్ట్రాల జాబితాలో కొత్తగా పంజాబ్‌ కూడా వచ్చి చేరడంతో, రాజకీయ వర్గాలు ఆ అంశం పట్ల మరింత మొగ్గును ప్రదర్శిస్తున్నాయి. రైతుల రుణాల మాఫీ పథకం అమలుకు మొదట తెలంగాణ, తరువాత ఆంధ్రప్రదేశ్‌ నాంది పలికాయి. ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ ప్రకటించారు. ఆ వెంటనే మహారాష్ట్ర కూడా ఆ బాటలోనే ప్రయాణిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా పంజాబ్‌ అదే పని చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశ వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీ సౌకర్యం వర్తింప చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.


అదే సమయంలో రుణమాఫీ పథకాన్ని విధాన రూపశిల్పులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించడం కూడా కనిపిస్తున్నది. ఈ ‘అంటువ్యాధి’ విస్తరించకుండా చూడాలని పలువురు ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు హెచ్చరిస్తున్నారు. పత్రికలలో సంపాదక వ్యాఖ్య ఉండే పేజీలలో కూడా ఈ ‘తెలివితక్కువ ప్రజాకర్షక’పథకానికీ, ఎన్నికల రాజకీయాల ఒత్తిడులతో జరిగే నిర్ణయాలకీ వ్యతిరేకంగా వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే ‘నైతిక పతనాల’ను కోరి తేచ్చుకోవడమేనంటూ బ్యాంకర్లు మాట్లాడుతున్నారు. రుణమాఫీతో తలెత్తే సమస్యలతో ప్రభుత్వాల ఆర్థిక పరిపుష్టికి వాటిల్లే నష్టం గురించి ఆర్థికవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదొక గిమ్మిక్‌ మాత్రమేననీ, దీనితో రైతుల దుస్థితిని రూపు మాపలేమని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ దీని గురించి గట్టిగా హెచ్చరించారు. ఇలాంటి రుణ మాఫీ పథకాలతో తమకు సంబంధం లేదని కేంద్ర ఆర్థికమంత్రి చేతులు దులిపేసుకున్నారు.




ఆక్రందనల కథా కమామిషు

అయితే ఇలాంటి వాదాలను ఒట్టి భేషజాలనీ, తమకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగాలని రైతు ఉద్యమాలు ఖండిస్తుం టాయి. వారి అనుమానాలకు కావలసినన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. 2009 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో భారత పారిశ్రామిక రంగం ఒడిదుడుకులలో చిక్కుకుంటుందని ఊహిస్తూ నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. అప్పుడు ఇలాంటి నైతిక ఆక్రందనలు మీరు ఎవరైనా విన్నారా? అలాగే కార్పొరేట్‌ రంగానికి ఇచ్చిన భారీ రుణాలలో సర్దుబాట్లు చేసినప్పుడైనా అలాంటి ఆక్రం దనలు వినిపించాయా? రైతుల రుణమాపీ చేయడంలోని నైతికత గురించి చర్చిస్తున్నప్పుడైనా, టెలికం, విద్యుత్‌ రంగాలను నష్టాల నుంచి బయటపడవేయడానికి ప్రభుత్వం హాస్యాస్పదమైన నిబంధనలకు తలొగ్గి నిర్ణయాలు తీసుకోవడం గురించి హెచ్చరికలు ఏమైనా వినిపించాయా? రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్న రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ గొంతు నోట్ల రద్దు సమయంలో ఎందుకు మూగబోయింది? నిజానికి ఆర్థికమంత్రిగారి బాస్‌ గారే ఉత్తరప్రదేశ్‌లో రైతు రుణమాఫీ గురించి హామీ ఇవ్వలేదా? అయితే ఇవన్నీ రైతు రుణమాఫీ అంశంపై జరుగుతున్న చర్చలకు సమాధానం కాదు. టీవీ యాంకర్ల పరిభాషలో చెప్పాలంటే రెండు తప్పులు ఒక ఒప్పు అయిపోవు. ఈ అంశాన్ని మనం సూటిగా కచ్చితత్వంతో చర్చించాలి. అసలు రైతు రుణ మాఫీ న్యాయబద్ధమైనదేనా? ఈ రుణమాఫీని వ్యతిరేకించేవారి ఆలోచనల మాటెలా ఉన్నా, దాని గురించి కొంచెం చర్చిద్దాం.




రైతు రుణమాఫీ అనే ఆలోచన మీద వచ్చే విమర్శకు మూలం, అర్థ రహితమైన ఒక ప్రశ్నలో ఉంది. ఆ ప్రశ్న: రుణ మాఫీయే భారత రైతాంగం దుఃఖానికి పరిష్కారం కాగలదా? దీనికి వెంటనే వచ్చే సమాధానం, ‘కాదు’ అనే. అనుకోని పరిణామాలతో వాణిజ్య వలయం ఛిన్నాభిన్నమైన పరిశ్రమకైతే రుణ మాఫీ పూర్తి పరిష్కారం కాగలదు. రుణమాఫీ అనేది చిరకాలంగా కష్టాలలో ఉన్న భారతదేశపు రైతు సమస్యలను తీర్చలేదు. అసలు వ్యవసాయమనేదే గిట్టుబాటు కాని, నష్టాలతో కూడిన వ్యవహారం. కాబట్టి రైతుల ఆదాయం అనే మౌలిక సమస్యను మనం పరిష్కరించకుంటే, రుణ మాఫీ అనేది వాళ్ల సమస్యలకు ఉపశమనం మాత్రమే అవుతుంది. లేదా మరోసారి రుణమాఫీ ఇవ్వడానికి దారితీస్తుంది. కాబట్టి రుణమాఫీ అనేది ఎవరి విషయంలోనూ సంతృప్తికరమైన చర్య కాబోదు. తప్పనిసరిగా వేసుకోవలసిన మరో ప్రశ్న: ప్రస్తుతం రైతు నెత్తి మీద రుణ భారాన్ని పూర్తిగా తొలగించకుండా, ఆదాయానికి సంబంధించిన వారి సమస్యను పరిష్కరించడం సాధ్యమేనా? అసలు అరకొర రుణమాఫీ అవసరమా?

 


రైతు ఆదాయం మాటేమిటి?

నైతిక ఒప్పందం వాదనల గురించి మొదట చర్చిద్దాం. రుణమంటూ తీసుకుంటే, దానిని తిరిగి చెల్లించాలి. ఇందులో సందేహం లేదు. తన చేతిలో లేని పరిస్థితులలో చిక్కుంటే తప్ప, ఒప్పందాలను గౌరవించవలసిందే. పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలకి రుణమాఫీ చేసి వాటిని కష్టాల నుంచి బయటపడేయడానికి చర్యలు తీసుకునేటప్పుడు ఇదే అంశం ప్రాతిపదికగా ఉంటుంది. ఈ వాదన నీతిబద్ధమైనదే అయితే, ఇది రైతుల విషయంలో మరింత బలంగా వర్తిస్తుంది.


దేశంలో అపార సంఖ్యలో ఉన్న రైతులు తమ రుణాలను చెల్లించే స్థితిలో ఏమాత్రం లేరు. జీవితావసరాలకు ఏమాత్రం చాలని స్థాయిలో వారి ఆదాయాలు ఉన్నాయి. లేదంటే ప్రతికూలంగా ఉన్నాయి. ఇందుకు కారణం రైతులు సోమరులో, అసమర్థులో కావడం మాత్రం కాదు. వారి ఉత్పత్తుల కొనుగోళ్ల వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడం, రైతుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ విధానాలు, పర్యావరణంలో వచ్చిన మార్పులు అందుకు కారణమని మరచిపోరాదు. ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్న రైతుల మీద రుణ ఒప్పందాన్ని అమలు చేయమంటూ, అంటే రుణం తీర్చమంటూ ఒత్తిడి చేయడం అమానుషమే. ఆ ఒప్పందం మేలు చేసేది కాదు.




ఈ వాదన గురించే ఇంకొంచెం చర్చిద్దాం. నిజం చెప్పాలంటే రైతు రుణ మాఫీ చేయవలసిన దుస్థితిలో ఉన్న పేదవాడు లేదా నిస్సహాయుడు మాత్రం కాదు. కానీ రైతు నెత్తి మీద ఉన్న రుణభారం మూలాలను మనం వెతకాలి. రోజురోజుకీ పెరిగిపోతున్న సాగు వ్యయానికి తగినట్టు రైతు ఆదాయం పెరగడం లేదు. అతడు రుణభారంలో కొట్టుమిట్టాడడానికి కారణం ఇదే. అసలు ఈ దుస్థితి ఎందుకు అంటే, గడచిన ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే అందుకు కారణం. 1966–67 నాటి దుర్భిక్షం తరువాత విధానకర్తలు చాలినంతగా ఆహార నిల్వలను, అది కూడా చౌకగా ఇచ్చే అంశం మీద దృష్టి సారించారు. ఇది మెచ్చదగిన లక్ష్యమే. కానీ ఈ నైతిక బాధ్యత వెనుక ఉన్న ఆర్థిక భారాన్ని రైతుకు బదలాయించారు.


వ్యవసాయోత్పత్తుల ధరలు తక్కువగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలను రూపొందించారు. ఇదే రైతాంగాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసింది. అంటే గడచిన యాభై ఏళ్ల నుంచి లక్షల కోట్ల రూపాయలు దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు రాయితీగా ఇస్తున్నారు. కాబట్టి దేశమే రైతుకు బోలెడంత రుణపడి ఉంది. బ్యాంకులకు వారు చెల్లించవలసిన రుణంలో ఇది చాలా తక్కువ. ప్రస్తుతం రైతుల రుణాలను మాఫీ చేయడం ప్రభుత్వం దగ్గరున్న అతి సులభమైన అవకాశం.


‘మనం’ అంటే ఎవరు? భారత్‌ అంటే ఏది?

ఇప్పుడు చివరిగా ఆర్థికాంశం ప్రాతిపదికగా వినిపిస్తున్న వాదనల దగ్గరకొద్దాం. ఈ రుణమాఫీ వ్యవహారాన్ని మనం భరించగలమా? ఇది సాపేక్షంగా చూడవలసిన అంశం. అలాగే రాజకీయ అంశం కూడా. ఇది మన ప్రాధా మ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా ‘మనం’ ఎవరం, భారత్‌ అంటే ఏమిటి? అనే విషయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ‘మనం’ అంటే టీవీల ముందు కూర్చునేవారు, విధాన రూపకర్తలు. వారికి గ్రామీణ భారతంతో అసలు సంబంధమే లేదు. చాలా చిన్నదే కావచ్చు కానీ ఈ బలమైన వర్గం ఒక వాస్తవాన్ని గమనించాలి. భారతదేశ విజయ గాథ గ్రామీణ ప్రాంత వినియోగం మీదే ఆధారపడి ఉంది. ఈ ‘మనం’ పరిధిలోకి భారతీయులంతా, అంటే రైతులతో సహా చేరితే అప్పుడు వేరే విధంగా ఉంటుంది.


భరించడం అనే అంశం భిన్న కోణం నుంచి దర్శనమిస్తుంది. మనం బులెట్‌ రైళ్లను ఏర్పాటు చేసుకోగలిగితే, పన్ను మాఫీ చేయగలిగితే, సంస్థలను కష్టాల నుంచి బయటపడవేసే చర్యలు తీసుకోగలిగి ఉంటే, పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థల భారీ రుణాలను సర్దుబాటు చేయగలిగితే, పెద్ద మొత్తంతో రక్షణ బడ్జెట్‌ను రూపొందించుకోగలిగితే– రైతుల విముక్తి కోసం కూడా రుణ మాఫీ భారాన్ని భరించగలం. అయితే ఇలాంటి వాదన రుణ మాఫీ గురించి లేవనెత్తుతున్న అన్ని అభ్యంతరాలకు, ప్రశ్నలకు సమాధానం కాబోదు.

రుణమాఫీ గురించి యోచిస్తున్నప్పుడు మరికొన్ని ఇతర ప్రశ్నలను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది.


బకాయిలను సకాలంలో చెల్లించలేకపోయిన రైతులకు జరిమానా విధించకుండా ఆపగలమా? రైతు రుణమాఫీ వంటి పెద్ద చర్య తీసుకున్నప్పుడు గ్రామీణ బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రైతు తీసుకున్న రుణం మొత్తం చెల్లించాలని రైతును ఏ రీతిలో ఒప్పించగలం? వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రైతులను ఎలా కాపాడుకోగలం? మార్కెట్‌ పరి స్థితులు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలతో నిమిత్తం లేకుండా రైతుకు కనీస స్థాయి ఆదాయం లభించేటట్టు చేయడమనే మౌలికాంశాన్ని ఎలా పరిష్కరించగలం? ఈ అంశాలను గమనంలోకి తీసుకోని రుణమాఫీ విఫలమైనట్టే. కాబట్టి రైతు రుణమాఫీ వ్యతిరేకులకు నేను చెప్పేది ఒక్కటే. రుణమాఫీ తప్పా ఒప్పా అనే అంశం కాకుండా,  రైతుకు ఒకే దఫా రుణమాఫీ చేసే మార్గం గురించి, వారికి చాలినంత ఆదాయం చేకూరే విధానాల వైపు చర్చను మళ్లించడం అవసరం.



యోగేంద్ర యాదవ్‌

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు




మొబైల్‌ నెం: 98688 88986  Twitter: @_YogendraYadav

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top