అడ్మిషన్ల దోషాలకు ‘దోస్తు’ జవాబేనా?

అడ్మిషన్ల దోషాలకు ‘దోస్తు’ జవాబేనా? - Sakshi




విశ్లేషణ



తమ అడ్మిషన్లను తామే చేసుకోవటం అటానమస్‌ కాలేజీలకు యూజీసీ కల్పించిన హక్కు. గుంపు నుంచి విడదీసి స్వయంప్రతిపత్తి కల్పించి వాటి ఎదుగుదలను మరింత ప్రోత్సహించాలనే సంకల్పంతో యూజీసీ ఆ విధానాన్ని ప్రవేశపెట్టి అమలుపరుస్తుంది. మళ్లీ వాటిని గుంపులో ఎందుకు కలపటం?



ఒక విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలలన్నీ అదే విశ్వ విద్యాలయానికి అనుబంధంగా ఉంటాయి. అవి సంప్రదాయక కోర్సులనందించే డిగ్రీ లేదా పీజీ కళాశాలలు కావచ్చు, వృత్తి విద్యా కళాశాలలు కావచ్చు. ప్రతి కళాశాల విద్యా సంవత్సరం వివిధ కోర్సులలో విద్యార్థుల ప్రవేశంతో (అడ్మిషన్‌) ప్రారంభమవుతుంది. ప్రస్తుతం పీజీ, వృత్తి విద్యా కోర్సులలోనికి సెట్స్‌ (ఎంట్రెన్స్‌తో కూడిన) ద్వారా ప్రవేశాలు జరుపుతుండగా సంప్రదాయక డిగ్రీ కోర్సులకు మాత్రం ఇంటర్‌ మెరిట్‌ ఆధారంగా ఆయా డిగ్రీ కాలేజీలే అడ్మిషన్స్‌ చేసుకునే విధానం అమలులో ఉంది. యూనివర్సిటీ నిర్ణయించిన అడ్మిషన్‌ షెడ్యూలు ప్రకారం కాలేజీలే అడ్మిషన్లు జరుపుకొని ఆ విద్యార్థుల జాబితాను యూనివర్సిటీకి సమర్పిస్తాయి.



డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానానికి స్వస్తి పలికి ‘దోస్తు’ అనే ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ పద్ధతిని 2016–17 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దోస్తుకు చైర్మన్‌గా కళాశాల విద్యా కమిషనర్‌ను, కన్వీనర్‌గా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ను, ఆయా సంప్రదాయక విశ్వవిద్యాలయాల ఉపకులపతులను సభ్యులుగా నియమించినట్టు వార్తలు వచ్చినాయి. అంటే డిగ్రీ అడ్మిషన్స్‌ని కాలేజీల, యూనివర్సిటీల పరిధి నుంచి తప్పించారన్నమాట. అయితే వాటి విధి నిర్వహణలో ఇదో మార్పు, ఓ పెద్ద మలుపు. అంటే వీసీలు తమ బాధ్యతలను, విధులను ఇతరులకు అప్పజెప్పటానికి సిద్ధపడ్డారన్నమాట. ఈ పని యూనివర్సిటీలు కూడా చేయొచ్చు. ఉస్మానియాకు, కాకతీయకు అడ్మిషన్‌ డైరెక్టొరేట్స్‌ కూడా ఉన్నాయి. పీజీ అడ్మిషన్స్‌ నిర్వహిస్తూనే ఉన్నాయి. ఒక కొత్త సంస్థను సృష్టించాల్సిన అవసరం ఎందుకొచ్చింది. అదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో.



ఈ మార్పు, మలుపు ఎందుకో.. ఒక కారణం మాత్రం బయటికి విని పించింది, అది: బోగస్‌ కాలేజీలూ, బోగస్‌ విద్యార్థులూ ఉన్నారు, వారి పేరుతో కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాజేస్తున్నాయి, దీన్ని ఆపాలి అని. ఆ తలంపు మంచిదే. బోగస్‌లు లేకుండా చేయటాన్ని సమర్థించాల్సిందే. అయితే దానికి ‘దోస్తు’ మాత్రమే పరిష్కారమా? ఆ పని యూనివర్సిటీలకు సాధ్యం కాదని అనుకుంటున్నదా ప్రభుత్వం. యూనివర్సిటీ వీసీలు కూడా అదే భావిస్తున్నారా? అయితే దశలవారీగా ఒక్కో కొత్త సంస్థని సృష్టించి యూనివర్సిటీ బాధ్యతలను ఆ సంస్థలకు అప్పజెబుతారా? అప్పుడు యూనివర్సిటీలు ఏం చేస్తాయి. అనుబంధ కాలేజీలు వక్రమార్గం పట్టినప్పుడు వాటిని సక్రమార్గానికి తీసుకురావటమో, అవసరమనుకున్నప్పుడు మూసివేయటమో చేసిన సంఘటనలు, తీసుకున్న చర్యలు గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో చాలానే ఉన్నాయి.



సాధారణ అనుబంధ కళాశాలలను మాత్రమే ‘దోస్తు’ పరిధిలోకి తెచ్చారా అంటే అదీ కాదు. యూనివర్సిటీ స్వంత కళాశాలలైన నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్‌ కాలేజీలతో సహా గవర్నమెంటు అటానమస్, ఎయిడెడ్‌ అటానమస్, ప్రైవేట్‌ అటానమస్, మైనారిటీ కళాశాలలని కూడా ‘దోస్తు’ పరిధిలోకి తెచ్చారు. ఇవేవీ బోగస్‌ కాలేజీలు కావు, బోగస్‌ అడ్మిషన్స్‌ చేయటం లేదు. అందులో ఆర్‌బీవీఆర్‌ఆర్‌ ఉమెన్స్‌ కాలేజీ ఒకటి.



యూనివర్సిటీగానీ, యూజీసీగానీ ఆషామాషీగా అటానమస్‌ స్టేట స్‌ని, కాలేజీలకు దఖలు పర్చవు. ఆర్థికంగా, అవస్థానపరంగా, నిర్వహణపరంగా పరిపుష్టిగా ఉండి, అనేక సంవత్సరాల అనుభవంతో, తమ కోర్సులను తామే రూపొందించుకునే, డిజైన్‌ చేసుకునే స్థాయి కలిగిన టీచర్లని, డిపార్ట్‌మెంట్లను కలిగి ఉండి తమ విద్యార్థులకు స్వంతంగా పరీక్షలను నిర్వహించి మూల్యాంకనం చేయగలిగిన సత్తా ఉంది అని రూఢి చేసుకొని ఆయా కమిటీలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా యూజీసీగానీ, యూనివర్సిటీగానీ ఓ కాలేజీకి అటానమస్‌ (స్వయంప్రతిపత్తి) స్థాయిని (స్టేటస్‌) మంజూరు చేస్తాయి. యూనివర్సిటీలు తమ అధికారాలను కొన్నింటిని స్వయంప్రతి పత్తి పొందిన కాలేజీలకు దఖలు పరుస్తాయి. అలాంటప్పుడు వాటి స్థాయి ఏమిటో వేరే చెప్పనక్కర లేదు.



సెమిస్టర్‌ విధానంతో కూడిన సీబీసీఎస్‌ను సాధారణ అనుబంధ కాలేజీలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమలు పరిస్తే కొన్ని అటానమస్‌ కాలేజీలలో అంతకుముందే అమలుపరిచారు. ఉదాహరణకు ఆర్‌బీవీఆర్‌ఆర్‌ ఉమెన్స్‌ కాలేజీలో సీబీసీఎస్‌ విధానాన్ని గత ఐదు సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుపరుస్తోంది. ఆ కాలేజీలో అందిస్తున్న కోర్సులకు అడ్మిషన్స్‌ చేయటం ‘దోస్తు‘ సాఫ్ట్‌వేర్‌కు సాధ్యం కాకపోవచ్చు. ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. యూజీసీ నిర్దేశానుసారం విద్యా క్యాలెండర్‌ను పాటిస్తూ సకాలంలో అంతర్గత మరియు సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించి రిజల్ట్స్‌ని ప్రకటిస్తున్నాయి. ఇట్లాంటి కాలేజీలను ‘దోస్తు‘ ద్వారా మిగతా కాలేజీలతో సమానం చేసి విద్యా క్యాలెండర్‌ను భగ్నపరచటం లేదా ఒక క్రమం లేకుండా చేయటం ఎందుకో అంతుపట్టని విషయం. తమ అడ్మిషన్లను తామే చేసుకోవటం అటానమస్‌ కాలేజీలకు యూజీసీ కల్పించిన హక్కు. గుంపు నుంచి విడదీసి స్వయంప్రతిపత్తి కల్పించి వాటి ఎదుగుదలను మరింత ప్రోత్సహించాలనే సంకల్పంతో యూజీసీ ఆ విధానాన్ని ప్రవేశపెట్టి అమలుపరుస్తుంది. మళ్లీ వాటిని గుంపులో ఎందుకు కలపటం. ప్రభుత్వానికి ఎందుకంత మంకుపట్టు.



ఇవ్వాళ విశ్వ విద్యాలయాలు, రాష్ట్రంలో అనుభవగ్నులైన ఆచార్యులు లేక సరిపోని నిధులు లేక దిక్కులేనివిగా ఉన్నాయనే చర్చ నిత్యకృత్యమైంది. విద్యావేత్తలలో, ఆలోచనాపరుల మధ్య క్షీణ దశకు చేరుతున్నాయి ఉన్నత విద్యా సంస్థలు. వాటి గ్రాఫ్‌ ఎప్పుడో యూటర్న్‌ తీసుకుంది అనే కథనాలు రోజూ పేపర్లలో కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యాసంస్థల పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదనే అపవాదును ఇప్పటికే మూటకట్టుకుంది. నూతన రాష్ట్రంలో ఇట్లా ఉండటం ఊహించనిది. విషయాలను వేగంగా ఆకళింపు చేసుకోగల, అనేక విషయాలపట్ల అవగాహన ఉన్న, అనుకున్నది సాధిం చగల పట్టుదల, సత్తా, సంకల్పం మెండుగా కలిగిన ముఖ్యమంత్రిని పొందిన రాష్ట్రమిది. ఈ రాష్ట్రం విలువలకూ, ప్రమాణాలకూ పెద్ద పీట వేయాలని (విద్యలో) ఆశించినవాళ్లు నిరాశ చెంది అనారోగ్యం పాలు కాకుండా చూస్తారన్న ఆశ ఇంకా ఉంది విద్యావేత్తల్లో. వారి ఆశను బతికించండి.



యూనివర్సిటీ, స్వంత అనుబంధ కళాశాలలో అడ్మిషన్స్‌ ఆయా యూనివర్సిటీ పర్యవేక్షణలో, స్వయం ప్రతిపత్తి గల కాలేజీలలో యూజీసీ నిబంధనల ప్రకారం వారే అడ్మిషన్లు చేసుకునేటట్టు, బోగస్‌ కాలేజీలను, విద్యార్థులను గుర్తించి చర్యలు తీసుకునే ఒక పటిష్టమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు రూపొందించేటట్టుగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని మరోసారి మనవి.

వ్యాసకర్త పూర్వ రిజిస్ట్రార్, యంజీ యూనివర్సిటీ

ప్రొ. కట్టా ముత్యం రెడ్డి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top