ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు


రాష్ట్రానికి ప్రత్యేకహోదా లభిస్తుందని కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్న ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలూ అడియాసలయ్యాయి. రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదా ‘సంజీవని’ కాదంటూ కేంద్రాన్ని వెనకేసుకురావడం అన్నిటికన్నా దురదృష్టకరం. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతా రని తాజా సంఘటనతో స్పష్టమైంది. ప్రత్యేక హోదావల్ల పరిశ్రమలు వస్తాయని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరు గుతాయని అనేకులు ఆశపెట్టుకున్నారు. అవి నెరవేరవేమోనన్న ఆందో ళనతో ఒత్తిడికి లోనవుతున్నారు. దాని ఫలితంగా వివిధ పట్టణాల్లో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు.

 

 కొత్తగా ఏర్పడిన రాష్ర్టం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో సమస్యలున్నాయి. రాజధాని లేదు. ఉద్యో గుల జీతాలు కూడా ఇవ్వలేని విధంగా ఆర్థిక సంక్షోభం ఉంది. మరో వైపు నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడుతున్నారు. వీటన్నింటినీ అధిగ మించడం కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించడం అత్యవసరం. విభజనలో ప్రత్యేక హోదా అంశాన్ని ‘పునర్విభజన బిల్లు’లో చేర్చలేదం టూ ఎన్డీఏ నేతలు కొత్త పల్లవి పాడుతున్నారు. అది నిజమే కావచ్చు.  ప్రత్యేక హోదా అంశం చట్టంలో ఉండి తీరాలని కేంద్రం భావిస్తే చట్ట సవరణతో చట్టబద్ధత కల్పించవచ్చు కదా. పార్లమెంటులో భారీ మెజా రిటీ ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి ఇది పెద్ద  కష్టమైన పనికాదు. ఇప్పుడు ప్రత్యేకహోదా డిమాండ్‌కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలుకు తోంది.

 

 కాబట్టి ఈ విషయంలో భాజపా వెనకడుగు వేయడం తగదు. తెలుగు ప్రజల మీద, వారికిచ్చిన వాగ్దానాల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రత్యేక హోదా తప్పక కార్యరూపం దాల్చుతుంది. దీనిపై తటపటా యింపు ధోరణి అవలంబించడం సహేతుకం కాదు. ఆంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేస్తుం దన్న నమ్మకాన్ని భాజపాపై రాష్ర్ట ప్రజలు ఉంచారు. రాష్ర్ట విభ జన ఎంతగా బాధించినా, ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కలిగించింది. అందువల్ల ప్రత్యేక హోదా అనేది ’ఆంధ్రుల హక్కు’గా మారింది. కాబట్టి ఆంధ్రప్ర దేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. ఒకవేళ భాజపా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించని పక్షంలో రాష్ర్టంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై నిలబడాల్సిన అవసరం ఉంది. రాష్ర్ట ప్రయోజనాల దృష్ట్యా తమ రాజకీయ ఎజెండాలను పక్కనపెట్టి మూకు మ్మడిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తద్వారా ఐదు కోట్ల ఆంధ్రుల కోరిక అయిన ప్రత్యేకహోదాను రాష్ట్రానికి తెచ్చుకోవాలి. గుంటూరు జిల్లాలో నేడు జరుగనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ప్రత్యేక హోదా లక్ష్యంతో సకల వర్గాల ఐక్యతను పెంపొందించే దిశగా సాగాలి.

 - బట్టా రామకృష్ణ దేవాంగ  సౌత్ మోపూరు, నెల్లూరు. 9542206130

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top