బాహుబలి లాంటి అమరావతి?

బాహుబలి లాంటి అమరావతి? - Sakshi


ఆలోచనం

‘‘బాహుబలి సినిమా చరిత్ర సృష్టించింది. అమరావతి కూడా మరో బాహుబలి కావాలి’’ అని, చిన్న వ్యాపార సినిమాను ఒక రాష్ట్ర ముఖ్యపట్టణ నిర్మాణంతో పోల్చిన సీఎం నుంచి మనం అంతకంటే జ్ఞానాన్ని ఆశించాల్సిన అవసరం లేదు.



‘‘అమరావతి అంటే దేవతల రాజధాని. అందుకే భూమి మీద మరో స్వర్గాన్ని, బ్రహ్మాం డమైన నగరాన్ని నిర్మించుకుందాం’’ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్న సందర్భంలో సీఎం అన్నమాటలివి. చిన్నప్పుడు, మాకు మా చిన్నాన్న ‘‘బాలల విజ్ఞాన సర్వస్వం’’ అనే పుస్తకాన్ని  బహుమానంగా ఇచ్చారు. బుడ్డిగ సుబ్బరాయన్‌ గారు సంపాదకత్వం వహించిన ఆ పుస్తకంలో అమరావతి అంటే, ‘‘ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బౌద్ధ క్షేత్రం ఇది’’ అని పరిచయం చేస్తూ అమరావతీ స్తూపం బొమ్మ కూడా ఇచ్చారు.



అమరావతి గురించిన మలి జ్ఞాపకం ఇది నాకు, తొలి జ్ఞాపకం శంకరంబాడి ‘మా తెలుగు తల్లికి’ లోని, అమరావతి నగర అపురూప శిల్పాలు అనే వాక్యం. ఇప్పుడు చంద్రబాబు అమరావతి అంటే దేవతల రాజధాని అన్నాక కొమర్రాజుగారి విజ్ఞాన సర్వస్వం రెండవ భాగంలో ఉన్న అమరావతి విశేషాలు వెదికాను. ఆయన అమరావతి దేవతల ముఖ్యపట్టణం, ఇంద్రుని రాజధాని అని ఒక 50 పదాలు రాసి ఆ తరువాత పేజీల కొద్దీ సమాచారం అమరావతి స్థూపం గురించి, మహా యాన బౌద్ధం గురించీ, ఆచార్య నాగార్జునుని గురించి, లోకప్రశస్తి గాంచిన ఆ స్తూప శిల్ప కళ, ఆ పిదప వచ్చిన వీరశైవమూ, అమరలింగేశ్వర ఆలయం గురించి రాసుకుంటూ వెళ్లారు. ఎక్కడా సీఎం చెప్పిన స్వర్గం గురించిన గొప్పతనం ప్రస్తావించలేదు.



దేవతల స్వర్గం అనేది మనుష్యులు సృష్టించిన ఒక భ్రాంతి. ఎమ్మా గోల్డ్మన్‌ ‘స్వర్గం మరియు నరకం, వరాలు మరియు శాపాలు ప్రజలను అదుపులో పెట్టడానికి, సంతృప్తంగా ఉంచడానికి సాధుస్వభావులుగా ఉంచడానికి ఉపయోగించే కొరడా’ అంటుంది. మనుషులు అలా సృష్టించిన స్వర్గనాయకుడు ఇంద్రుడు ఆయా పూర్వ పుస్తకాల ప్రకారమే చూసినా అంత గొప్ప వ్యక్తిత్వం కలవాడు కాదు. ఇంద్రుని గురించి పక్కనపెట్టి చంద్రబాబు చెప్పిన స్వర్గాన్నీ చూసినా ఈ స్వర్గంలో గొప్ప గొప్ప పనులేమీ జరగవు, అందరు పనీ పాటు లేకుండా గుంపులు తీరి కూర్చుని, దేవవేశ్యలు అనేవాళ్లు చేసే డాన్సులు చూస్తూ, సుర అనే కాపు సారా తాగుతూ ఆనందిస్తుంటారు. మరీ ముఖ్యంగా స్త్రీల కోసమని స్వర్గాలేం లేవు. స్వర్గానికెళ్లిన స్త్రీలు ఎవరి నృత్యాలు చూస్తారో మనకి తెలియనే తెలియదు. ఈ పురాణ సంబంధిత విషయాలను వదిలేసి చరిత్రను చూస్తే పూర్తిగా రూఢీ కాకున్నా ఇంద్రుడు దస్యుల నగరాలను కూలదోశాడు. అందుకే అతనికి పురంధరుడు అనే పేరు ఉంది.



‘‘బాహుబలి సినిమా చరిత్ర సృష్టించింది. అలా అమరావతి కూడా మరో బాహుబలి కావాలి’’ అని, చిన్న వ్యాపార సినిమాను ఒక రాష్ట్ర ముఖ్యపట్టణ నిర్మాణంతో పోల్చిన సీఎం నుంచి మనం అంతకంటే జ్ఞానాన్ని ఆశించాల్సిన అవసరం లేదు కానీ, తన స్వర్గ రక్షణ కోసం జీవహత్యాపాతకానికి వెరవని ఇంద్రునికి సీఎంకు కొన్ని పోలికలున్నాయి. ఇప్పుడు చెపుతున్న స్వర్గ నిర్మాణానికి సేకరించిన భూమిలో 40%, 20 అడుగుల లోతులోనే నీరు లభించి, 120 రకాల పంటలు పండగలిగే జరీబు భూమి. భారతదేశంలోని అత్యంత నాణ్యమైన భూములలో ఇది ఒకటట. ఈ భూమిని, సీఎం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ముందు 1908 నాటి రెవెన్యూ రికార్డులు చూపించి ఇది వట్టి బీడు భూమి అంటూ పురంధరుడిలా ధ్వంస రచన చేశారు.



పూర్వకాలంలో రాజులు ఉన్నపుడు, ఆ రాజు కోటను స్వాధీనం చేసుకుంటే రాజ్యం స్వాధీనం అయిపోయినట్టే అనే భావన ఉన్న కాలంలో రాజధాని అనే ఫ్యూడల్‌ భావనకు విలువ ఉండేది. ఇపుడు ఆ అవసరం ఏముంది? అందుకే ప్రభుత్వ కార్యకలాపాలకు ఒక చిన్న ప్రాంతాన్ని కేటాయిస్తే సరిపోతుందని కె.సి. శివరామకృష్ణ కమిటీ సూచించింది. ఆ సూచనలను సీఎం పెడచెవినపెట్టి అభివృద్ధినంతా హైదరాబాదులో కేంద్రీకరించినట్టు ఒకే చోట కేంద్రీకరిస్తూ పాత తప్పులని తిరిగి చేస్తున్నారు. మెడికల్‌ సైన్స్‌ ప్రకారం ఒకే చోట విపరీతమయిన పెరుగుదల ఉంటే దానిని ఆరోగ్యకరమైన అభివృద్ధి అనరు. కేన్సర్‌ అంటారు. అమరావతి కేన్సర్‌ లాగా పెరిగిపోయి ప్రజలంతా అక్కడికి వలసలు పోవడంకంటే 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందడం ఆరోగ్యకరం కదా. అప్పుడు మనం అమరావతికి వలస వెళ్లకుండా ఉండే ఊర్లోనే ఉద్యోగాలు చేసుకోగలం కదా.



రాజరికపు చరిత్ర చివరిలో అమరావతిని చింతపల్లి జమీందార్‌ రాజా వెంకటాద్రి నాయుడు రాజధానిగా చేసుకున్నాడట, పెద్ద రోడ్లు వేయించి, ఎక్కడెక్కడినుండో వైశ్యులను రప్పించి వారికి రకరకాల సహాయాలు చేసి వ్యాపారాలు పెట్టించాడట, పై కప్పుపై తళతళలాడే రాగి రేకులను తాపడం చేయించి భవ్యమైన రాజమందిరం కట్టించుకున్నాడట. కానీ ఆ తరువాత ఆయన వారసులు కొట్లాడుకుని కోర్టులకెక్కగా రాజ్యం గవర్మెంటు స్వాధీనమయిందట. సీఎం అలాగే తాపడపు భవనాలు కట్టిస్తున్నారు. సరే అలాగే కట్టించండి కానీ, భూమిపై  స్వర్గాన్ని నిర్మిస్తున్న సీఎం గారూ.. ఒక్క ప్రశ్నకు సమాధానమివ్వండి, ఈ ప్రశ్న మయసభను చూడవచ్చిన నారదుడు ధర్మరాజును అడిగాడు ‘‘హీనులగు కర్షకులకును! భూనుత! ధాన్యంబు బీజములు వణిజులకున్‌ మానుగ శతైకవృద్ధి న! నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్‌’’. 2–1–44 ఓ ధర్మరాజా! ఉదారబుద్ధితో పేద రైతులకు ధాన్యపు విత్తనాలూ, వర్తకులకు నూటికి ఒక రూపాయి వడ్డీ వంతున అప్పులు ఇస్తున్నావు కదా?



వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి

సామాన్య కిరణ్‌

91635 69966

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top