ప్రత్యామ్నాయ విధానాలే ప్రతిపక్షానికి ఊపిరి

ప్రత్యామ్నాయ విధానాలే ప్రతిపక్షానికి ఊపిరి - Sakshi


త్రికాలమ్: ఈతరం పౌరులు ఉచితాలు ఆశించడం లేదు. అవినీతికి ఆస్కారం లేని బాధ్యతాయుతమైన పరిపాలన కోరుకుంటున్నారు. చట్టపాలన కావాలంటున్నారు. ఈతరం హృదయాన్ని మోదీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. కనుకనే మోదీ మార్కు రాజకీయాన్ని యువతీ యువకులు స్వాగతిస్తున్నారు.

 

 ‘ఒక మిత్రుడు వస్తున్నాడు.’ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ డే సందర్భంగా మన అతిథిగా ఢిల్లీకి రాబోతున్నాడని ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌లో రాసుకుంటే ప్రపంచానికి తెలిసింది. అంతవరకూ అమెరికా దౌత్యాధికారులకు కానీ భారత ఉన్నతాధికారులకు కానీ తెలియదు. భారత గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా విదేశీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యే ఆనవాయితీ జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచీ ఉంది. అమెరికా అధ్యక్షుడు రావడం మాత్రం ఇదే ప్రథమం.

 

 దేశంలో మారుతున్న రాజకీయ సంస్కృతికీ, ప్రపంచంలో పెరుగుతున్న భారత దేశ పేరుప్రఖ్యాతులకీ ఈ ఉదంతం అద్దంపడుతోంది. ఒబామా వంటి అగ్రదేశా ధినేత ఢిల్లీకి రావడానికి అంగీకరిస్తే ఆ వార్త వెల్లడించడానికి పెద్ద హంగామా జరుగుతుంది. ఏ రకమైన ఆర్భాటం లేకుండా కేవలం ట్విట్టర్‌లో ప్రకటించడం ద్వారా ఇంత ప్రధానమైన వార్తను వెల్లడించడం మోదీ ప్రవేశపెట్టిన కొత్త సంస్కృతి.

 

 మోదీ ఆహ్వానాన్ని ఆమోదించడమే కాదు, చట్టబద్ధత లేకుండా అమెరికాలో నివసిస్తున్న నాలుగున్నర లక్షలమంది భారతీయుల ఉనికికి చట్టబద్ధత కల్పిస్తూ, వారికి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి ఒబామా చూపిన ప్రత్యేక శ్రద్ధ రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇంటగెలిచిన మోదీ రచ్చ గెలవడం ప్రపంచ దేశాలలో భారత్‌కు ప్రత్యేకస్థాయిని సమకూర్చుతోంది. మోదీ ఇంటాబయటా సాధిస్తున్న విజయాల వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది.

 

 కొత్త పరిణామాల వెల్లువ

 మునుపెన్నడూ ఊహించని పరిణామాలు ఇప్పుడు దేశంలో, దేశం వెలుపలా జరుగుతున్నాయి. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ముఖ్యమైన పాత్రధారిగా అవతరించడం, అక్కడ అన్ని రాజకీయ పార్టీలూ భాజపాని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించి విమర్శనాస్త్రాలు సంధించడం కొత్త పరిణామం. ఇంతకాలం వింటే విడ్డూరంగా. అతిశయోక్తిగా అనిపించే వాదనలూ, ప్రతిపాదనలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన మూడురోజుల ప్రపంచ హిందూ మహాసభ (వరల్డ్ హిందూ కాంగ్రెస్)కు 50 దేశాల నుంచి విదేశీ భారతీయులు వచ్చారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే బృహత్తరమైన భూమికను భారతీయులు పోషించవలసిన సమయం ఆసన్నమైనదని దలైలామా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్, ఇతర వక్తలు ప్రకటించారు.

 

  ‘మనవాళ్లు ఈ విషయం రెండువేల సంవత్సరాల క్రితమే చెప్పారు’ అంటూ శ్రీలంక నుంచి వచ్చిన అతిథి అన్నప్పుడు చాలామంది సంతోషంగా చప్పట్లు కొట్టారు. కానీ ఆర్థికాంశాలపైనా, మీడియా పైనా, వ్యవస్థల నిర్మాణంపైనా, ఇతర అంశాలపైనా జరిగిన చర్చలలో ఛాందసం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎట్లా ప్రగతిపథంలో దూసుకుపోవాలన్న ఆరాటం ఉంది. దాదాపు 15 వందల మంది సభ్యులలో కాషాయాంబరాలలో కనిపించినవారు పాతికమందికి మించి లేరు.

 

  సభికులందరూ తమతమ రంగాలలో విజయాలు సాధించిన లబ్దప్రతిష్టులు. ఈ సభలో చోదకశక్తి రుషీకేశ్ ఆశ్రమానికి చెందిన విజ్ఞానానందస్వామి. ఖరగ్‌పూర్ ఐఐటీలో పట్టభద్రు డైన తర్వాత పదేళ్లపాటు గురుముఖంగా సంస్కృతం అభ్యసించి, సన్యాసం స్వీకరిం చి రెండు పర్యాయాలు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ పాదయాత్ర చేసిన వ్యక్తి. వివేకానందుడు ఎక్కడ వదిలిపెట్టాడో విజ్ఞానానందుడు అక్కడ అందుకున్నాడు. ఆధ్యాత్మిక, ఆర్థిక, వాణిజ్య, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతికరంగాలలో భారత బావుటా ఎగరవేయాలంటూ ప్రబోధించే ఆధునిక స్వామి. హరియాణాలో అరెస్టయిన రాం పాల్ వంటి దొంగస్వామి కాదు. ప్రపంచ హిందూ మహాసభ వెనుకా, మోదీ అమె రికా, ఆస్ట్రేలియా పర్యటనలలో దిగ్విజయంగా జరిగిన ఎన్‌ఆర్‌ఐ సభల వెనుకా ఎంతో ప్రయాస ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల కృషి ఉంది. లక్షలాదిమందితో వ్యక్తి గత సంబంధాలు పెట్టుకొని వాటిని రాపాడి కాపాడుకున్న నెట్‌వర్కింగ్ వ్యవస్థ ఉంది. హిందూ సమాజంలో, హిందువుల ఆలోచనా సరళిలో సంభవిస్తున్న పెను మార్పులకు సంకేతం.

 

 ఆధునిక భావజాలానికి ఆహ్వానం

 ఇటువంటి దశలో కొత్త, పాత ఆలోచనల మధ్య ఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణ ప్రభావం భాజపాలో సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాతా వచ్చిన పరిణా మాలలో చూడవచ్చు. పోటీకి తట్టుకోలేక పక్కకు తప్పుకున్న పెద్దతరం నాయ కులూ, కొత్త నాయకత్వాన్ని ఆమోదించి దారికొచ్చిన పాతకాపులూ ఉన్నారు. మొన్న టిదాకా హిందూమత సంరక్షకుడిగా తనను తాను భావించుకొని ప్రత్యర్థులపైన గర్జించి, లంఘించిన సింఘాల్ వంటి అద్వానీతరం నాయకులు మోదీ ఆధునిక పోక డలను అభినందిస్తున్నారు.

 

 పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తర్వాత ఎనిమిది వం దల సంవత్సరాలకు దేశంలో సిసలైన హిందువులు ప్రభుత్వంలోకి వచ్చారని సింఘాల్ ప్రపంచ హిందూమహాసభలో అన్నాడు. వాజపేయి నాయకత్వంలోని మొదటి ఎన్‌డీఏ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వం కనుక, మనుగడకోసం రాజీలు అనివా ర్యం కనుక దాన్ని హిందువుల పాలనగా లెక్కవేయలేదు. పృథ్వీరాజ్ తర్వాత మోదీనే. మోహన్ భాగవత్ సైతం ఆధునిక భావజాలానికీ, సృజనాత్మకతకూ పెద్ద పీట వేస్తున్నారు. సామాజిక సమరసతకూ, ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన, అణచివేతకు గురైన దళితులనూ, ఆదివాసీలనూ ప్రధాన స్రవంతిలోకి తీసుకొని రావాలన్న సంక ల్పం ఉన్నది. వివేకానంద, గోల్‌వాల్కర్, అంబేద్కర్‌ల భావజాలాలను కలబోసి తర తరాలుగా లొంగని సామాజిక సమస్యలకు సామరస్యవంతమైన పరిష్కారం కను గొనాలన్న ప్రయత్నం చేస్తున్నారు.

 

 నవతరం ఆకాంక్షలు ఎలాంటివి?

 ఈ రోజున దేశ జనాభాలో 60 శాతానికి పైగా 35 సంవత్సరాలలోపు వయస్సు వారు. ఇందిర ఆత్యయిక పరిస్థితి తర్వాత పుట్టిన తరం. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత కళ్లు తెరిచిన తరం. ఒకటి లేదా రెండు ఎన్నిక లలోనే ఓటు హక్కు వినియోగించుకున్న తరం. ఐటీ రంగంలో విప్లవ ఫలితాలను సంపూర్ణంగా వంటబట్టించుకున్న తరం. వీరు అన్ని కులాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని తరగతులలో ఉన్నారు. వీరికి ఆర్థికం అత్యంత ప్రధానం.

 

 సామాజికానికి ద్వితీ య స్థానం. మోదీ స్వాతంత్య్రానంతరం పుట్టిన తొలి ప్రధాని. యువతరం ఆశలూ, ఆకాంక్షలూ, ప్రాథమ్యాలూ తెలిసిన తెలివైన రాజకీయ నాయకుడు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుడిగా రాజకీయావతారం ప్రారంభించి భారత ప్రధాని వరకూ సాగించిన ప్రస్థానంలో తనను తాను మార్చుకోవడం, పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడం, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాధించడానికి సాహసోపేతంగా ప్రణాళికలు రచించడం, శక్తివంచన లేకుండా అమలు చేయడం కనిపిస్తుంది. ఆయన ఎదిగిన క్రమంలో అవధులు మీరిన ఆత్మవిశ్వాసం నియంతను తలపించే సంద ర్భాలు లేకపోలేదు.

 

 సరికొత్త ధోరణులకు చొరవ

 చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అవినీతి మకిలం అంటని ప్రభుత్వం ఉన్నదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఒకరిద్దరు మంత్రులు తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కనిపెట్టే కనికట్టు మోదీ దగ్గర ఉంది. కేంద్రమం త్రులకు స్వేచ్ఛ లేదనీ, ఐఏఎస్ అధికారులే చక్రం తిప్పుతున్నారనీ, ప్రధాని కార్యా లయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా అదుపాజ్ఞలలో సమస్త యంత్రాంగం నడుస్తున్నదనే మాట ప్రభుత్వ వర్గాలలో బలంగా వినిపిస్తున్నది. మంత్రులనూ, అధికారులనూ కట్టడి చేసే పని మిశ్రాకి అప్పగించి మోదీ జాతీయ, అంతర్జాతీయ రంగాలలో కొత్త చొరవల గురించీ, సరికొత్త ధోరణుల గురించీ ఆలోచిస్తున్నారు.

 

  అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి కాకుండానే అంతర్జాతీయంగా తనకూ, తన దేశానికీ ఒకస్థాయిని సంపాదించడంలో సఫలీకృతుడైనట్టు చెప్పవచ్చు. జాతీ య రంగంలో లెసైన్స్, పర్మిట్ రాజ్ నడ్డిని పీవీ-మన్మోహన్‌సింగ్ ద్వయం విరిచేసిన తర్వాత ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో ఉత్పాదకరంగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న పట్టుదల పెరిగింది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే. ఓటర్లకు వరాలు లేకుం డా, ఉచితాలు ఇవ్వచూపకుండా ఎన్నికలలో ఘనవిజయం సాధించవచ్చునని నిరూపించిన ఘనత కూడా మోదీదే.

 

  స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు డిపాజిట్ చేస్తానంటూ ఎన్నికల ప్రచా రంలో మోదీ చేసిన వాగ్దానం అతిశయోక్తికి పరాకాష్ఠ అయినప్పటికీ అన్నీ ఉచితంగా ఇస్తానంటూ వాగ్దానం చేయకుండానే భాజపాకి చరిత్రలో మొదటిసారి లోక్‌సభలో 280 పైచిలుకు స్థానాలు సంపాదించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా సంక్షేమ వాగ్దానాలు లేకుండానే మూడో సారి గెలిచింది. వాగ్దానాల వెల్లువ ప్రవహిం పజేసిన కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, హరియాణాలలో మట్టికరిచింది. ఈ తరం పౌరులు ఉచితాలు ఆశించడం లేదు. అవినీతికి ఆస్కారం లేని బాధ్యతాయుతమైన పరిపాలన కోరుకుంటున్నారు. చట్టపాలన కావాలంటున్నారు. ఈతరం హృద యాన్ని మోదీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు కనుకనే మోదీ మార్కు రాజకీయాన్ని యువతీ యువకులు స్వాగతిస్తున్నారు.

 

 వాస్తవాల జోలికెళ్లని కాంగ్రెస్

 తన విజయాన్ని మోదీ సరిగానే అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అర్థం చేసుకోవడంలో కూడా విఫలమైనట్టున్నది. సార్వత్రిక ఎన్నిక లలో ఘోరపరాజయం తర్వాత ఆ పార్టీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కశ్మీర్‌లో భాజపా పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ప్రచారం చేస్తోంది. శుక్రవారంనాడు సోనియాగాంధీ కశ్మీర్ సందర్శించారు. ఆ పార్టీకి ఈ ఎన్నికలలో గెలవాలనే కోరిక కూడా ఉన్నట్టు కనిపించదు. నిజానికి ఆ పార్టీ నాయ కత్వం ఆత్మపరిశీలన చేసుకుంటున్నది.

 

 దాదాపు రెండు మాసాలుగా రాహుల్ ఆధ్వ ర్యంలోనే సమీక్షా సమావేశాలు నిత్యం జరుగుతున్నాయి. రాబోయే ఏఐసీసీ సమా వేశంలో రాహుల్‌గాంధీని పూర్తిస్థాయి పార్టీ అధ్యక్షుడుగా నియమించాలని సోనియా సంకల్పించారు. ప్రియాంకకు సహాయక పాత్రే కానీ ప్రధాన పాత్ర ఉండదు. సంక్షేమ పథకాలను రద్దు చేయడం ద్వారా పేదలకు మోదీ దూరం అవుతారనీ, హిందూత్వ విధానాలకు ప్రాధాన్యం ఇచ్చి ముస్లింల ఆగ్రహానికి గురవుతారనీ, కార్మిక చట్టాలను సరళతరం చేయడం ద్వారా కార్మికులకు కోపం తెప్పిస్తారనీ కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.

 

ఈ కారణంగా పేదలూ, ముస్లింలూ, దళితులూ తిరిగి తమ పార్టీ పరిష్వంగంలోకి వస్తారని ఆశిస్తున్నారు. అంతేకానీ సంపద సృష్టించడం ఎట్లానో, కొత్త తరం కోరుకుంటున్న సుపరిపాలన అందించడం ఎట్లానో, అవినీతి మరక లేని వారికి పార్టీలో స్థానం కల్పించడం ఎట్లానో ఆలోచించడం లేదు. అన్ని రాష్ట్రాలలో అవినీతిపరులుగా, అసమర్థులుగా పేరుమోసిన నాయకులే పార్టీని నడిపిస్తున్నారు. నలభై ఏళ్లలోపు యువకులు పార్టీలో కనిపించరు. వామపక్షాలలో కూడా అంతర్వీక్షణం మొదలైంది.  హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పది వామపక్షాల నాయకులూ కూర్చొని వామపక్ష సానుభూతిపరుల, మేధావుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భాజపాను ఓడించి అధికారంలోకి రావా లంటే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలనూ, సరికొత్త అభివృద్ధి వ్యూహాలనూ ప్రతిపాదించాలి. ఆ పని చేయకుండా పాతపాటే పాడుతూ కూర్చుంటే నవతరానికి అర్థం కాకుండా వ్యర్థమై బుట్టదాఖలైపోతారు.     

 - కె. రామచంద్రమూర్తి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top