‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయి

‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయి


అవలోకనం

 

మహత్తరమైన మన భారత జాతీయవాదులు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వారి వెంటపడుతున్నారు. వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ లేదా  మరే ఇతర ప్రేమా కాదు... విద్వేషం, విరోధం.


 


భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ఏ విదేశీ పత్రికైనా చూడండి. భారత్ గురించి ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని ప్రపంచం భావిస్తోంది కాబట్టి. అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు.

 

మహారాష్ట్రలో ఒక ముస్లిం శాసన సభ్యుడ్ని, అతడు ‘‘భారత్ మాతా కీ జై’’ (తల్లి భారతికి విజయం) అనడానికి బదులు ‘‘జై  హింద్’’ (భారత దేశానికి విజయం) అనే అంటానని అన్నందుకు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ రెండు నినాదాల మధ్య ఉన్న తేడా ఏమిటో నాకూ క చ్చితంగా తెలియదు. కానీ అది శిక్షార్హమైందనేది మాత్రం స్పష్టం.



భారత వ్యతిరేకమైన రాతలేవీ రాయడం లేదని హామీ ఇవ్వాలని ఉర్దూ రచయితలందరినీ మార్చి 19న కోరారు. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ నిర్దేశనలోని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’(ఎన్‌యూపీయూఎల్), ఉర్దూ రచయితలను దిగువ ప్రకటనపై సంతకం చేయాలని కోరింది:



‘నేను.........ను ........... కొడుకు/కూతురు ,........ శీర్షికగల   నా పుస్తకం/పత్రికను ఎన్‌యూపీయూఎల్ ఆర్థిక సహాయ పథకం కింద పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆమోదం పొందాను. ఇందులో భారత ప్రభుత్వ విధానాలకు లేదా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనది, దేశంలోని వివిధ వర్గాల మధ్య ఏ విధమైన వైమనస్యానికి కారణమయ్యేది ఏదీ లేదు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ దేని నుంచీ దీనికి ఆర్థిక సహాయం అందలేదు.’’



ఇదీ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలిపిన విషయం. జాతీయవాదులకు, జాతి వ్యతిరేకులకు మధ్య సాగుతున్న మోసపూరితమైన, ఈ సొంత తయారీ చర్చ త్వరలోనే సమసిపోతుందని ఆశపడుతున్న నాలాంటి వాళ్లకు ఈ వార్త నిరుత్సాహం కలిగించింది. నాకైతే ఇప్పుడు సాగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ వంటి విషయాల గురించి రాయాలని ఉంది. కానీ ఈ వార్తా కథనం వల్ల... మధ్యయుగాల కాలపు ఈ నిత్య పోరాటంలో నేను కూడా ఏదో ఒక పక్షాన నిలవడం తప్ప, గత్యంతరం లేకపోయింది.



మన హిందుత్వ జాతీయవాదులు ప్రచారం చేస్తున్నది విభిన్న తరహా జాతీయవాదం. అది, మరో దేశంతో పోలిస్తే మరొక దేశంలోని వారికి తమ పట్ల ఉండే భావం అని చెప్పే యూరోపియన్ జాతీయవాదం కాదు.



సెర్బియన్లను, ఆస్ట్రో-హంగేరియన్లు, వారిని రష్యన్లు, వారిని జర్మన్లు, వారిని ఫ్రెంచ్‌వాళ్లు ద్వేషించటం వల్ల ప్రపంచ యుద్ధం జరిగింది. ఇటాలియన్లు ఆ యుద్ధంలో ఎందుకు చేరారో నాకైతే గుర్తులేదు. కానీ బ్రిటిష్‌వాళ్లు ప్రతి ఒక్కరినీ ద్వేషించేవారనేది మాత్రం నిజం. ఒక్కసారి నిప్పు అంటుకున్నదే చాలు, అంతా ఒకరిపైకి మరొకరు విరుచుకుపడ్డారు.  టర్కులను, అరబ్బులను, భారతీయులను, తత్పర్యవసానంగా అమెరికా వంటి  దేశాలనూ అందులోకి ఈడ్చారు.



రెండు ప్రపంచ యుద్ధాలలో ఆ దేశాలు తమకు తాము చేసుకున్న హాని ఫలితంగా యూరోపియన్ దేశాలు తమ సంకుచితత్వాన్ని కోల్పోయాయి. అదే ఆ తర్వాత వారిలో యూరోపియన్ యూనియన్ పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈయూ అంటేనే, తమ తమ జాతీయతలను వదుల్చుకుని, తమ సరిహద్దులను, మార్కెట్లను ఒకరికొకరు తెరుచుకోవాలని కోరుకున్న ప్రజా సముదాయాలు.  కాగా, నేటి భారతదేశంలోని మన ‘జాతీయవాదం’ మరో జాతికి వ్యతిరేకమైనది కాదు, ఇతర భారతీయులకు వ్యతిరేకమైనది. అందుకే ఇది విభిన్నమైనది.



మహత్తరమైన మన భారత జాతీయవాదులు, మరో దేశానికి వ్యతిరేకంగా కాదు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వెంటపడుతున్నారు. వారికి పట్టేది, వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ కాదు లేదా  మరే ఇతర ప్రేమా కాదు. అది విద్వేషం, విరోధం. భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ‘జాతి వ్యతిరేకత’ అని మనం అభియోగంగా అతి తేలికగా వాడేసే ఈ పదం నేడు యూరోపియన్ భాషలలో నిజంగా వాడుకలో ఉన్నది కాదు. భారతీయుల వంటి ప్రాచీన కాలపు ప్రజలు మాత్రమే వాడేది. జాతి అనేది ఏ అర్థాన్ని ఇస్తుందో దానికి వ్యతిరేకమైన విషయలకే అది ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ మాతా కీ జై అనడం గాక, ఏది నిజమైన జాతీయవాదమో నిర్ణయించేది ఎవరు? నిజంగానే నాకు భారత జాతీయవాదం అంటే ఏమిటో తెలియదు.



జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ జాతీయవాదం అంటే ఏమిటనే అంశంపై బహిరంగ ఉపన్యాసాల పరంపరను నిర్వహిస్తోంది. వీడియోల సెట్టుగా అవి అందుబాటులోకి వస్తున్నాయి. అవి విద్వద్వంతమైనవే అయినా సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. అదో గొప్ప కృషే. కానీ అందులో చాలా భాగం భారతీయుల మీదనే వృథా చేస్తారేమోనని నా భయం.  మీరెంత ఘోరంగా ప్రవర్తించినా ఫర్వాలేదు, భారత్ మాతా కీ జై అని అంటున్నంత కాలం మీరీ దేశంలో జాతీయవాదే.



వార్తా పత్రికల్లోనే వచ్చిన మరో కథనం, ఇద్దరు ముస్లింల గురించినది. వారిలో ఒకరు 15 ఏళ్ల పిల్లాడు. సరిగ్గా అమెరికన్ ఆఫ్రికన్లను అమెరికాలో చేసినట్టే... వాళ్లను కూడా చెట్టుకు కట్టేసి చిత్రహింసల పాలు చేసి చంపారు. వారిద్దరూ గేదెలను మేపుకుంటున్నారు. కాబట్టి వారి నేరం ఏమిటో స్పష్టం కాలేదు. అయితే ఈ విద్వేషాన్ని ఎక్కడి నుంచి రేకెత్తిస్తున్నారనేది మాత్రం పూర్తిగా కచ్చితంగా తెలిసినదే.



ఇదేమైనా ప్రభుత్వం కాస్త ఆగేట్టు చేస్తుందా? ఎంతమాత్రమూ చేయదు. ఇంకా మరింత ‘‘జాతీయవాదం’’ కోసం పిలుపునివ్వడం కోసం ఈ వారాంతంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కానున్నది. ఇప్పటికీ మనకున్నది సరిపోదా?



నాగరిక సమాజంలో భారత ప్రతిష్టపై ఇది ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుందో బీజేపీ వాళ్లకు తెలియదా? ఏ విదేశీ పేపర్‌ను లేదా పత్రికైనా తీసుకోండి. భారత్ గురించి అందులో ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని మనలో చాలా మందిమి, మిగతా ప్రపంచమూ కూడా భావిస్తోంది కాబట్టి. ఈ పరిస్థితుల్లో అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు.

విద్వేషం నిండిన, కపట జాతీయవాదులకు మంచి రోజులు వచ్చేశాయి.



- ఆకార్ పటేల్

 వ్యాసకర్త కాలమిస్టు, రచయిత

 aakar.patel@icloud.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top