'టీడీపీలో చేరమంటూ ఎమ్మెల్యేలకు మైసూరారెడ్డి ఫోన్లు'

'టీడీపీలో చేరమంటూ ఎమ్మెల్యేలకు మైసూరారెడ్డి ఫోన్లు' - Sakshi


న్యూఢిల్లీ : యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీలో చేరానంటూ మైసూరారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఓ పద్ధతి ప్రకారమే ఆయనతో లేఖ రాయించినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం పెద్దిరెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైసూరారెడ్డి లేఖలో చెప్పుకోవాల్సింది ఏమీలేదన్నారు. చంద్రబాబు అవినీతిపై వైఎస్ జగన్ పుస్తకం విడుదల చేసిన నేపథ్యంలో ఈ లేఖను రాయించారు. చాలామంది నాయకులు, ఆహ్వానాల మేరకు విందులకు, బ్రేక్ ఫాస్ట్కు వెళ్తారని, అలా చెప్పగానే కండువా కప్పుకుని పార్టీ మారిపోతారా? అని ఆయన ప్రశ్నించారు.



'రాయలసీమ పరిరక్షణ ఉద్యమానికి మేం మద్దతు ఇవ్వడం లేదనడం దారుణం. రాయలసీమకు అన్యాయం గురించి ఎన్నోసార్లు మేం అసెంబ్లీలో మాట్లాడాం. రాయలసీమ ఉద్యమంపై మైసూరారెడ్డి మూడుసార్లు తేదీలు వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారో ఎవ్వరికీ చెప్పలేదు. జమ్మలమడుగులో మైసూరారెడ్డి సోదరుడి కుమారుడిని సమన్వయకర్తగా నియమించాం. దీన్ని నెపంగా పెట్టుకుని ఏవేవో లేఖలో రాశారు. కాంగ్రెస్ పదవులు అనుభవించి టీడీపీలోకి వెళ్లారు. వైఎస్ జగన్ సీఎం అవుతారని అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అపరిచితుడు మైసూరానే, మరెవ్వరో కాదు. ఆ వ్యాఖ్యలు మైసూరారెడ్డికే వర్తిస్తుంది.  మాలాంటి సీనియర్ ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ ఎంతో గౌరవంగా చూస్తారో, మాకు తెలుసు. మైసూరారెడ్డి రాజకీయ ధ్యాసతో వెళ్లారా? మరో కారణంతో వెళ్లారో చూస్తాంగా.



వైఎస్ జగన్ అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. మరి డబ్బు ధ్యాస అనే మాట ఎక్కడ నుంచి వస్తుంది. మైసూరారెడ్డిని వైఎస్ జగన్ ఎప్పుడైనా డబ్బులు ఇవ్వమని అడిగారా? గత ఆరు నెలల నుంచి మైసూరారెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన ఏ కార్యక్రమాల్లో పాల్గొలేదు. టీడీపీ అనుకూలంగా వ్యవహరించమని ఎమ్మెల్యేలకు మైసూరా చెప్పలేదా? వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలతో ఆయన ఫోన్లో మాట్లాడలేదా? అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలంటూ మైసూరారెడ్డి చేసిన సంభాషణలు పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. పార్టీ ఎమ్మెల్యేలను కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పార్టీకి రాజీనామాలు చేయించేలా వ్యవహరిస్తున్నారని అందరికీ తెలుసు. పార్టీలు మారడం వారి అభిమతం, కానీ వెళ్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు.



మా పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చేందుకు ఆరు నెలలుగా మైసూరారెడ్డి అందరికీ ఫోన్లు చేశారు. మైసూరారెడ్డికి చెందిన సిమెంట్ కంపెనీకి మైనింగ్ లీజులు, బ్యాంక్ గ్యారంటీలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినందుకే ఆయన ఇదంతా చేస్తున్నారని నేను వ్యక్తిగతంగా అంటున్నా.  హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు తన అనుచరులకు ఎలా లబ్ధి చేకూర్చారో అందరికీ తెలుసు. రాజధాని పేరుతో అమరావతిలోనూ అలానే చేస్తున్నారు. చంద్రబాబు సచ్ఛీలుడు అయితే సీబీఐ విచారణకు అంగీకరించాలి.' అని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top