రేపటి నాయకుల జాబితాలో భారత వాస్తుశిల్పి

అలోక్ శెట్టి


 న్యూయార్క్: ప్రతిష్టాత్మక టైమ్ పత్రిక రూపొందించిన ‘రేపటి నాయకుల’ జాబితాలో భారత యువ వాస్తుశిల్పి(ఆర్కిటెక్ట్) అలోక్ శెట్టికి కూడా చోటు దక్కింది. మురికివాడల్లో నివసించే ప్రజల కోసం వరదను తట్టుకునే ఇళ్లను డిజైన్ చేసినందుకు  అలోక్‌కు ఈ గౌరవం లభించింది. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేందుకు కృషిచేస్తున్న ఆరుగురు రేపటి తరం నాయకుల్లో అలోక్ కూడా ఒకరని టైమ్ పత్రిక కితాబునిచ్చింది.  అలోక్  20 సంవత్సరాల వయసులోనే బెంగళూరులోని ఆర్వి కాలేజీలో ఆర్కిటెక్చర్ చదువుతూ  20 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ప్లాన్ రూపొందించారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి యువ ఆర్కిటెక్ట్ అవార్డు కూడా అందుకున్నాడు.



భారత్‌లో క్లిష్టమైన సమస్యలకు అలోక్ సులభమైన, చౌకైన పరిష్కారాలు కనుగొంటున్నారని టైమ్ పత్రిక ప్రశంసించింది. బెంగళూరుకు చెందిన పరిణామ్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న 28 ఏళ్ల అలోక్ ‘ఎల్‌ఆర్‌డీఈ’ స్లమ్ ఏరియా పేదల కోసం వరదలను తట్టుకునే ఇళ్లను డిజైన్ చేస్తున్నారు. వెదురు, చెక్కలతో 18 వేల రూపాయలకే ఈ ఇళ్లను నాలుగు గంటల్లోనే నిర్మించొచ్చు లేదా అవసరమైనప్పుడు విప్పేసుకోవచ్చు. అలాగే మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం, విద్యను అందించేందుకు ఉపయోగపడే భవనాలను సులభంగా, చౌకగా నిర్మించేందుకు కూడా అలోక్ కృషి చేస్తున్నారు.

     

 కాగా, టైమ్ రేపటి నాయకుల జాబితాలో ఇజ్రాయెలీ సామాజిక, వ్యాపారవేత్త ఆది అల్‌షులర్(27), చైనాలో వైద్యపరీక్షల రంగంలో కృషిచేస్తున్న ఝావో బోవెన్(22), టునీషియా మహిళా హక్కుల కార్యకర్త ఇక్రమ్ బెన్ సెయిద్(34), ఆన్‌లైన్ మ్యూజిక్ వీడియో మొఘల్ జమాల్ ఎడ్వర్డ్స్(24), నైజీరియాలో తొలి ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించిన ఫ్లైయింగ్ డాక్టర్స్ నైజీరియా సంస్థ ఎండీ ఓలా ఒరెకున్రిన్(28) ఉన్నారు.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top