‘మహా’ ఫలితాలతో యువతపై మొగ్గు!

‘మహా’ ఫలితాలతో యువతపై మొగ్గు! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్‌తో కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీస్తుండడంతో.. తిరిగి పార్టీని ఎలా పట్టాలపైకి తీసుకురావాలనే ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతోంది. పార్టీలో నూతనోత్తేజం కలిగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మహారాష్ట్ర, హర్యానాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. త్వరలోనే పూర్తిస్థాయిలో ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణ జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా బీజేపీ తరహాలో సీనియర్లను సలహాలు, సంప్రదింపులకు పరిమితం చేసి యువతకు ప్రాధాన్యత పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాహుల్‌గాంధీ టీమ్‌ను దేశవ్యాప్తంగా ప్రోత్సహించి.. వారికి తగిన పదవులను అప్పగించి పార్టీ నిర్వహణలో భాగస్వాములను చేయాలనే దిశలో నాయకత్వం చర్యలు ఉంటాయని చెబుతున్నారు. 

 

పార్టీని ప్రక్షాళన చేసి కొత్త రక్తం ఎక్కిస్తేనే మనుగడను సాగించగలుగుతుందని పార్టీ పెద్దలకు ఇప్పటికే పలువురు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో సైతం నాయకత్వాన్ని మార్చి.. యువతకు ప్రాధాన్యం పెంచితే రాజకీయంగా పుంజుకునేందుకు అవకాశముంటుందనే వారు పేర్కొన్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో రాహుల్ కీలక బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమైతే... తదనుగుణంగా వెంటనే భారీ మార్పులకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అలాకాకుండా మరో ఏడాది పాటు సోనియాగాంధీ సారథ్యంలోనే పార్టీ నడిచిన పక్షంలో.. రాష్ట్రాల్లోనూ ప్రస్తుత నాయకత్వాలే కొనసాగవచ్చునని చెప్పారు. పార్టీలో యువతకు ప్రాధాన్యం అనేది ఇప్పటికే మొదలైందని ఎమ్మెల్యే, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. రాజస్థాన్ పార్టీ బాధ్యతలను సచిన్ పైలట్‌కు, హర్యానా బాధ్యతలను అశోక్ తల్వార్‌కు, మధ్యప్రదేశ్ బాధ్యతలను అరుణ్‌యాదవ్‌కు, ఢిల్లీ బాధ్యతలను అరవింద్‌దత్‌సింగ్ లవ్‌లీకి అప్పగించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.

 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top