ఒలింపిక్ ప్లేయర్‌ను ఓడించిన రాందేవ్

ఒలింపిక్ ప్లేయర్‌ను ఓడించిన రాందేవ్


యోగా గురువు బాబా రాందేవ్ తాను విసిరిన సవాల్‌లో నెగ్గి భళా అనిపించుకున్నారు. 2008 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన ఆండ్రీ స్టాడ్నిక్‌ను తనతో తలపడి గెలవాల్సిందిగా బాబా రాందేవ్ సవాలు విసిరారు. తాను ప్రతిరోజు వ్యాయామం చేస్తానని, దానివల్ల ఎంతో శక్తి చేకూరుతుందని ముందుగానే హెచ్చరించిన రాందేవ్ బుధవారం రాత్రి ఆండ్రీ స్టాడ్నిక్‌ తో జరిగిన కుస్తీ పోటీలో గెలుపొందారు. ఈ బౌట్‌లో 12-0 పాయింట్లతో ఒలింపిక్ ప్లేయర్ ను ఓడించారు. నాలుగు పాయింట్లతో ఖాతా తెరచిన రాందేవ్, వరుస పాయింట్లు సాధిస్తూ 7-0 ఆధిక్యంలోకి వెళ్లి.. బౌట్ ముగిసేసరికి మరో ఐదు పాయింట్లు సాధించడంతో పాటు ఒలింపిక్ ప్లేయర్‌కు కనీసం ఒక్క పాయింట్‌ను కూడా కోల్పోకపోవడం గమనార్హం. మ్యాచ్ ముగియగానే రాందేవ్‌ను విన్నర్‌గా ప్రకటించగానే భారత్ మాతా కి జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.



ముందుగా బౌట్ ప్రారంభానికి ముందు రాందేవ్ సూర్య నమస్కారాలు చేశారు. ప్రత్యర్థి స్టాడ్నిక్‌ను ఆశీర్వదించి కుస్తీ ప్రారంభించారు యోగా గురువు. బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఓడించిన స్టాడ్నిక్ ఈ గేమ్‌లో ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. రాందేవ్ బాబా మ్యాట్‌పై చాలా చురుగ్గా కదులుతూ ప్రత్యర్థిని తికమక పెట్టారు. యోగా గురువు వరుస పాయింట్లు సాధిస్తున్నా.. స్టాడ్నిక్ మాత్రం ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. బుధవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కి ముందు ఆండ్రీ స్టాడ్నిక్‌, రాందేవ్‌ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ వీక్షకులకు వినోదాన్ని పంచింది. జాతీయ ఆటగాళ్లను ఓడించిన రాందేవ్, ఓ అంతర్జాతీయ స్థాయి ఆటగాడిని ఓడించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.





బౌట్ ముగిసిన అనంతరం రాందేవ్ బాబా మాట్లాడుతూ.. రాబోయో రోజుల్లో భారత్‌లో రెజ్లింగ్‌కు ప్రాముఖ్యం ఏర్పడుతుందని, అత్యంత ఆదరణ ఉన్న ఆటగానూ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top