బడ్జెట్‌లో భరోసా ఇవ్వండి

బడ్జెట్‌లో భరోసా ఇవ్వండి - Sakshi


 కేంద్ర ఆర్థికమంత్రికి తెలుగు రాష్ట్రాల మంత్రుల విన్నపం

 వాటర్ గ్రిడ్‌కు, మిషన్ కాకతీయకు నిధులు కేటాయించండి: ఈటెల

 తెలంగాణకు ప్రత్యేక హోదా, ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి


 

 సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించి భరోసా ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశానికి తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. తమ రాష్ట్రాల్లో చేపడుతున్న పథకాలు, ప్రాథమ్యాలు, అవసరాలను వివరించారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, కాకతీయ మిషన్‌కు, వాటర్ గ్రిడ్‌కు నిధులు కేటాయించాలని ఈటెల కోరగా.. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు నిధులివ్వాలని యనమల విన్నవించారు.

 

 ఈటెల విజ్ఞప్తులు ఇవీ..

 

 తెలంగాణకు రూ.5 వేల కోట్ల సీఎస్‌టీ బకాయిలు రావాలి. వీటిని తక్షణమే విడుదల చేయాలి. అలాగే 13వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటివరకు రూ.909 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ. 2,229 కోట్లు రావాలి. 13వ ఆర్థిక సంఘం కాలం ముగుస్తున్నందున తక్షణమే నిధులు విడుదల చే యండి.

  పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల అమలుకు బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో నిధులు కేటాయించండి. తెలంగాణ సత్వర అభివృద్ధికి వీలుగా ప్రత్యేక హోదా ఇవ్వండి. ఖమ్మంలో స్టీలు ప్లాంటు, రైలు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిధులు కేటాయించండి.

  సాగునీటి చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ కోసం చేపట్టిన ‘కాకతీయ మిషన్’కు నిధులు కేటాయించండి. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించి, వచ్చే బడ్జెట్‌లోనే తగిన నిధులు కేటాయించండి. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులివ్వండి.

  కేంద్రం తలపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ను స్వాగతిస్తున్నాం. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి పెట్టుబడి పరిమితిని రూ.5 కోట్లకు పెంచారు. ఎక్సైజ్ సుంకాన్ని కూడా ఇదే నిష్పత్తిలో మినహా యించాలి. ఆయా సంస్థల రుణ వ్యవహారాల క్రోడీకరణలో కాలవ్యవధిని ఆరు నెలలకు పెంచాలి. ఆయా సంస్థలకు వడ్డీ రేటును 5 లేదా 6 శాతానికి తగ్గించాలి.

  జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్లను 16 చోట్ల ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. తెలంగాణలో కూడా ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించినా ఇప్పటికీ పురోగతి లేదు. దీనికి బడ్జెట్‌లో నిర్దిష్టమైన కేటాయింపులు జరపండి.

  రాష్ట్రం మరో రూ.4 వేల కోట్లు అప్పు చేసేందుకు వీలుగా ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ నిబంధనలను సడలించాలి.

 

 పాశ్వాన్‌తో ఈటెల భేటీ

 

 కేంద్ర ఆహార మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తో మంత్రి ఈటెల భేటీ అయ్యారు. అనంతరం  ఇక్కడి ఏపీ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘‘ఈరోజు రాంవిలాస్ పాశ్వాన్‌ను, ఆర్థిక మంత్రి జైట్లీని, రైల్వే బోర్డు చైర్మన్‌ను కలిశాం. తెలంగాణ సమస్యలపై వివరించాం. పాశ్వాన్‌ను కలిసి విద్యార్థుల విషయంలో సాయం అర్థించాం. హాస్టళ్లకు సన్నబియ్యం అందించే కార్యక్రమానికి కేంద్రం మద్దతు కోరాం. బియ్యం కోటా పెంచాలని విజ్ఞప్తి చేశాం.  రైల్వే బోర్డు చైర్మన్‌ను కలిసి పలు ఆర్వోబీల నిర్మాణంపై చర్చించాం..’’ అని తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top