నిజంగానే జీపీఎస్ చిప్ ఉందనుకుని..

నిజంగానే జీపీఎస్ చిప్ ఉందనుకుని.. - Sakshi

వాళ్లు ముగ్గురు దొంగలు.. ఏటీఎంలలో డబ్బులు పెడుతున్న వ్యాన్‌ను దోచుకుని బాగా సంపాదించుకుందాం అనుకున్నారు. అనుకున్న ప్లాన్ అంతా అనుకున్నట్లే అమలుచేశారు. కానీ, డబ్బులు మాత్రం వాళ్లకు దక్కలేదు! కొత్తగా ముద్రిస్తున్న నోట్లలో జీపీఎస్ చిప్ ఉందంటూ మీడియాలో జరిగిన ప్రచారం వాళ్ల కొంప ముంచింది. నిజంగా అలాంటి చిప్ ఉందేమో, దానివల్ల తాము పట్టుబడతామన్న భయంతో ఎక్కడైనా ఖర్చుపెడితే దొరికిపోతాం అనుకున్నారు.. చివరకు అలాగే దొరికిపోయారు. డిసెంబర్ 19న ఢిల్లీలో ముగ్గురు దొంగలు కలిసి నాటు తుపాకులు చూపించి రూ. 9.5 లక్షలు దోచుకున్నారు. కుట్రకు సూత్రధారి అయిన బిట్టూ (29) ఒక డిస్కం అధికారి వద్ద కారు డ్రైవర్‌గా ఉండేవాడు. అతడు తరచు ఏటీఎంలలో డబ్బులు నింపే వ్యాన్లను చూసేవాడు. అది చూసి దోపిడీకి ప్లాన్ చేశాడు. మరో ఇద్దరు కావాలని రోహిత్ నాగర్ (19), సన్నీ శర్మ (22) అనే ఇద్దరిని తోడు తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి బాగానే ప్లాన్ చేశారు. ముందుగా వివిధ వ్యాన్లు ఎక్కడి నుంచి ఎక్కడకువెళ్తున్నాయో చూశారు. వాటిలో లోపాలు కనుక్కొని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ముందుగా వాళ్లు ఒక మోటార్ సైకిల్ చోరీచేసి, దాని నంబర్ ప్లేట్ మార్చేశారు. డిసెంబర్ 19న ఒక క్యాష్ వ్యాన్‌ను ఫాలో అయ్యి, దాన్ని దోచుకోడానికి షకార్‌పూర్, లక్ష్మీనగర్, నిర్మాణ్ విహార్ ప్రాంతాల్లో మూడుసార్లు ప్రయత్నంచారు. కానీ, చుట్టూ జనం ఎక్కువమంది ఉండటంతో ఆగిపోయారు. 

 

పత్‌పర్‌గంజ్ క్రాసింగ్ వద్ద కాస్త జనం తక్కువగా ఉండటంతో గార్డును బెదిరించడానికి కాల్పులు జరిపారు. క్యాష్ బ్యాగ్ పట్టుకున్నవాళ్లతో నగర్ కొద్దిగా గొడవపడి, బ్యాగ్ లాక్కున్నాడు. శర్మ తుపాకితో డ్రైవర్‌ను, గార్డును బెదిరించాడు. అక్కడినుంచి జాగ్రత్తగా తప్పించుకుని యమునా పుష్ట వైపు పారిపోయారు. అక్కడ బ్యాగులోంచి డబ్బులు తీసి, తమ జేబుల్లో నింపేసుకున్నారు. బ్యాగును ఓ డ్రెయిన్‌లో పారేశారు. బైకును కూడా వదిలేశారు. రెండు ఆటోలు మాట్లాడుకుని ఇళ్లకు వెళ్లారు. ఒక రోజు తర్వాత అంతా కలిసి హరిద్వార్ పారిపోయారు. అయితే.. టీవీలలో ఫ్లాష్ న్యూస్ చూసి, నిజంగా కొత్త నోట్లలో జీపీఎస్ చిప్‌లు ఉన్నాయేమోనని భయపడ్డారు. ఈలోపు పోలీసులు వీళ్లను జాగ్రత్తగా గమనించారు. చివరకు దొంగిలించిన కారులో ఒక మాల్ వద్దకు వాళ్లు ముగ్గురూ రాగానే అప్పటికే అక్కడ మాటు వేసిన పోలీసులు ఎంచక్కా అరెస్టుచేసి లోపల వేశారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top