సార్ట్‌ హోటల్‌ ఉద్యోగిని చీర లాగాడు..

ఉద్యోగిని చీర లాగాడు, సస్పెన్షన్‌ వేటు - Sakshi

ఢిల్లీ హోటల్‌లో మహిళా సిబ్బందిపై దారుణం

సెక్యూరిటీ మేనేజర్‌ పై సస్పెన్షన్‌  వేటు

 

న్యూఢిల్లీ: ఢిల్లీ లో ఓ ఫైవ్‌ స్టార్ హోటల్‌లో మహిళా ఉద్యోగిని వేధింపుల వీడియో సంచలనంగా మారింది. సెక్యూరిటీ మేనేజర్‌ ఉద్యోగిని చీర పట్టుకుని లాగుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఎరోసిటీ హోటల్ లో ఈ ఘటన గత నెల 29న చోటుచేసుకుంది. సెక్యూరిటీ మేనేజర్‌ పవన్‌ దహియా.. మహిళ ఉద్యోగిని చీర లాగి, బలవంతంగా తన ఒడిలో కూర్చుపెట్టుకునేందుకు యత్నించాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం బయటకు వచ్చింది.



వివరాల్లోకి వెళితే స్టార్‌ హోటల్‌లో పని చేస్తున్న ఉద్యోగిని పట్ల పవన్‌ దహియా గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేస్తున్నాడు. అయితే అతని వేధింపులకు ఉద్యోగిని ఏమాత్రం లొంగలేదు.  ఈ క్రమంలో  జూలై 29న ఉద్యోగిని పుట్టినరోజు కావడంతో పవన్‌ దహియా..ఆమెను క్యాబిన్‌లోకి పిలిచి తన క్రెడిట్‌ కార్డు ఇచ్చి గిఫ్ట్‌ కొనుక్కోవాలని సూచించాడు.



అయితే అందుకు ఉద్యోగిని అంగీకరించకపోవడంతో... ఆమె చీర పట్టుకొని లాగి తనపై కూర్చోమని బలవంతం చేశాడు. ఇదంతా గమనిస్తున్న మరో ఉద్యోగిని అక్కడినుంచి బయటకు వెళ్లమని పంపించి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు అదేరోజు రాత్రి మానవ వనరుల విభాగానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. తర్వాత రోజు ఉదయం ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్లు హెచ్‌ఆర్‌ నుంచి నోటీసులు ఇచ్చింది. అలాగే సెక్యూరిటీ మేనేజర్‌ను హోటల్‌ యాజమాన్యం విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. కాగా బాధితురాలు ఈ సంఘటనపై ఆగస్టు ఒకటో తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ... ‘రెండేళ్లుగా అక్కడ పని చేస్తున్నా. శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ అతను నాపై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఆరోజు గదిలోకి పిలిచి నా చీర లాగాలని యత్నించాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి చూస్తూనే ఉన్నాడు తప్ప స్పందించలేదు. నేనే అతన్ని అడ్డుకున్నా. సీసీ పుటేజీ వీడియోలను ఓ అధికారిణికి చూపించి, విషయంపై ఫిర్యాదు చేస్తే వార్నింగ్ లెటర్ తో సరిపెట్టారే తప్ప అతనిపై చర్యలు తీసుకోలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను.’ అని తెలిపింది.



అయితే హోటల్‌ పీఆర్‌ అధికారి రాజా సింగ్ ఘటనపై స్పందిస్తూ సెక్యూరిటీ మేనేజర్ ను కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మహిళను తొలగించిన విషయంపై తనకు తెలియదని అతను చెప్పటం విశేషం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top