‘ఆమెను పెళ్లాడతా.. అనుమతివ్వండి’
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు అబూసలేం.. వివాహానికి సిద్ధపడ్డాడు. తనను పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చిన 26 ఏళ్ల యువతిని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నానని.. అందుకు అనుమతించాలని సలేం సోమవారం టాడా కోర్టును కోరాడు. ఆ యువతి తన లాయర్ ద్వారా సలేంను వివాహం చేసుకోవటానికి అనుమతించాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసింది. గత ఏడాది ఓ పత్రికలో సలేం తనను రహస్యంగా పెళ్లాడినట్లు వార్త వచ్చిందని..తర్వాతి పరిణామాలతో తనకు పెళ్లి కాకుండా పోయిందని ఆరోపించింది.
గత్యంతరం లేక సలేంనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆమె సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేసేందుకు పెళ్లి చేసుకుంటానని సలేం చెప్పాడు.