1.30 కోట్లకు ముంచేసిన ఫేస్బుక్ ఫ్రెండ్

1.30 కోట్లకు ముంచేసిన ఫేస్బుక్ ఫ్రెండ్ - Sakshi


ఫేస్బుక్లో అకౌంట్ ఉంది కదాని ఎవరు పడితే వాళ్లు పంపిన ఫ్రెండ్ రిక్వెస్టులు ఓకే చేసేస్తే కొంప మునిగిపోతుంది జాగ్రత్త. డెహ్రాడూన్లో ఓ మహిళను ఆమె ఫేస్బుక్ స్నేహితుడు ఏకంగా కోటీ 30 లక్షల మేర ముంచేశాడు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు 9 కోట్ల రూపాయలు) సాయం చేస్తానంటూ చెప్పి చివరకు ఆమె వద్ద ఉన్న డబ్బులన్నీ లాగేసుకున్నాడు. డెహ్రాడూన్లోని రాం విహార్ ప్రాంతానికి చెందిన బీనా బోర్ ఠాకూర్ అనే మహిళకు అతడు ముందుగా తాను ఇవ్వాల్సిన మొత్తం కావాలంటే ఓ పన్ను చెల్లించాలని చెప్పాడు. ఆ ఉచ్చులో చిక్కుకున్న ఆమె, వివిధ బ్యాంకు ఖాతాలకు ఏకంగా రూ. 1.30 కోట్లు జమచేశారు. ఆ తర్వాత గానీ తాను మోసపోయినట్లు గుర్తించలేకపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



ఓఎన్జీసీలో ఉద్యోగి భార్య అయిన ఠాకూర్ ఫేస్బుక్ వాడతారు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఆమెకు రిచర్డ్ ఆండర్సన్ అనే వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. వాళ్లిద్దరూ ఫోన్లో కూడా చాలాసార్లు చాటింగ్ చేసుకున్నారు. భారతదేశంలోని ప్రజలకు తాను సేవ చేయాలనుకుంటున్నానని చెబుతూ  పలు రకాల ప్రతిపాదనలు తెచ్చాడు. చివరకు వృద్ధాశ్రమం ఏర్పాటుకు 9 కోట్లు ఇస్తానని చెప్పినట్లు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ రౌతెలా తెలిపారు. కొన్నాళ్ల తర్వాత రిజర్వు బ్యాంకులోని విదేశీ మారకద్రవ్య విభాగం నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. 9 కోట్లమొత్తం వచ్చిందని, అందుకు కొంత పన్ను చెల్లించి ఆ మొత్తం తీసుకోవాలని చెప్పాడు.



ఆమె ఆ మొత్తాన్ని వేర్వేరు బ్యాంకుల్లో వేసిన తర్వాత విలియం జార్జి, కెవన్ బ్రౌన్ అనే మరో ఇద్దరు ఫోన్ చేసి, మరింత మొత్తం వేయాలన్నారు. అలా మొత్తం 25 ఖాతాల్లో 1.30 కోట్లను ఆమె డిపాజిట్ చేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆండర్సన్, జార్జి, బ్రౌన్లతో పాటు మరో వ్యక్తిపై 420 కేసు నమోదు చేశారు. ఆమె డిపాజిట్ చేసిన ఖాతాలు చాలావరకు కేరళ, తమిళనాడు, కర్ణాటకలలోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top