ఢీ.. రెడీ..

పార్లమెంట్ భవనం


 నేటినుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

నిర్మాణాత్మక చర్చలకై ప్రధాని మోదీ పిలుపు

 ఆర్థిక ఎజెండాతో ప్రభుత్వం - అడ్డుకునే ప్రణాళికలో విపక్షం

బీమా బిల్లుపై ఐక్యమైన విపక్షం; కలసిరావాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి

 

 సాక్షి, న్యూఢిల్లీ:  పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నల్లధనం, బీమా బిల్లు సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని నిలదీయాలన్న ప్రతిపక్షాల నిర్ణయంతో ఈ సమావేశాలు వాడి, వేడిగా జరగనున్నాయి. తమ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆర్థిక ఎజెండాకు చట్టబద్ధత కోసం అధికార ఎన్డీయే.. నల్లధనం, బీమా బిల్లు, బీజేపీ ఎన్నికల హామీల అమలు మొదలైనవి అస్త్రాలుగా విపక్షాలు దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం అఖిలపక్ష భేటీ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నేతలు మినహా 26 పార్టీలకు చెందిన 40 మంది నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల మాదిరిగానే ఈ సమావేశాలు కూడా నిర్మాణాత్మకంగా, విజయవంతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ అఖిలపక్ష భేటీలో పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తాలనుకుంటున్న అన్ని అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజల ఆలోచనలను, ప్రజాతీర్పు స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వానికి సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు సహా ఈ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టబోయే 37 బిల్లుల వివరాలు తెలి పారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల బలోపేతం, పెట్టుబడులు, ప్రభుత్వ విధానాల సరళీకరణ, ఉన్నత విద్య, కాలం చెల్లిన  చట్టాల రద్దు, హైజాకర్లకు కఠిన శిక్ష,  బొగ్గు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు.. తదితర అంశాల్లో ఈ బిల్లులుంటాయన్నారు.



 ‘అన్ని బిల్లులూ మాకు ముఖ్యమైనవే. మన జాతీయ ఎజెండా అయిన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. పెట్టుబడులు, ఆర్థిక రంగ పునరుత్తేజం, ప్రజల స్థితిగతులను మెరుగుపర్చడం మా ప్రాథమ్యాలు. బీమా బిల్లు కూడా ఆ దిశగా రూపొందించిందే’ అని వివరించారు. భారత దేశ ఆర్థిక ప్రణాళికను ప్రపంచం నిశితంగా గమనిస్తున్న నేపథ్యంలో సరైన చట్టాల ద్వారా సరైన సందేశాన్ని పంపించాల్సి ఉందన్నారు. చట్టసభలపై ప్రజల్లో గౌరవం పెరిగేలా పక్షపాత రహితంగా ఉభయసభల నిర్వహణ సాగాలన్నది ప్రధాని ఆకాంక్ష అన్నారు. బీమా బిల్లు రూపకల్పన చివరి దశలో ఉందని వెంకయ్యనాయుడు తెలిపారు. అఖిలపక్ష భేటీకి తమను ఆహ్వానించలేదన్న తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను ఆయన కొట్టేశారు. తానే స్వయంగా ఆ పార్టీ నేతతో మాట్లాడానని, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అఖిలపక్ష భేటీకి ఆహ్వానిస్తూ ఆ పార్టీకి లేఖ రాశారని వెంకయ్యనాయుడు చెప్పారు.



 బీమా బిల్లును వ్యతిరేకిస్తాం

 బీమా బిల్లును ఐకమత్యంగా వ్యతిరేకించాలని వామపక్షాలు, తృణమూల్, జేడీయూ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బీఎస్పీలు నిర్ణయించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా తమతో కలసిరావాలని కోరాయి. కానీ బీమా బిల్లులో ప్రభుత్వం తీసుకువస్తున్న సవరణలను చూసిన తరువాత తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. అలాగే, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరపై స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, వరదలు, కరవు, అనుసంధాన భాషగా సంస్కృతం.. తదితర అంశాలపై గట్టిగా గళమెత్తాలని ప్రతిపక్షం భావిస్తోంది. అఖిలపక్ష భేటీ అనంతరం జేడీయూ నేత కేసీ త్యాగి విలేకరులతో మాట్లాడుతూ.. భూసేకరణ చట్టానికి సవరణలను, ఉపాధి హామీ చట్టంలో మార్పులను ప్రతిపక్షాలు అంగీకరించబోవని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. బ్లాక్‌మనీ అంశాన్ని సభలో లేవనెత్తుతామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ ఎన్నికల ఖర్చుపై కూడా ప్రశ్నిస్తామని తెలిపింది. శివసేన మాత్రం ఈ సమావేశాల్లో ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రకటించింది. అధికార ఎన్డీయేలో తాము భాగమేనని, మహారాష్ట్రలో విభేదాలు కేంద్రంలో బీజేపీతో సంబంధాలపై ప్రభావం చూపబోవని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top