ఇదో హెచ్చరిక!

ఇదో హెచ్చరిక!


న్యూఢిల్లీ: భారీ విపత్తుల్లో ఎలా వ్యవహరించాలనే దానికి నేపాల్‌లో సంభవించిన భూకంపం ప్రభుత్వానికి ఒక మేలుకొలుపు లాంటిదని భూకంపాలను అధ్యయనం చేసే నిపుణులు పేర్కొన్నారు. భవన నిర్మాణాలలో అత్యున్నత సాంకేతక పరిజ్ఞానం వినియోగించడం అత్యంత ఆవశ్యకమని వారు చెప్పారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపాల్లో ఇదే పెద్దదని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ముఖ్య శాస్త్రవేత్త శ్రీనగేశ్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. ఈ విపత్తును ఒక పాఠంగా భారత ప్రభుత్వం తీసుకోవాలని, భవనాల నిర్మాణాల్లో అత్యాధునిక పద్ధతులు అవలంభిస్తే నష్టాలను తగ్గించవచ్చన్నారు.



1934 నేపాల్, బిహార్, 2001 భుజ్ భూకంపాలు మనకు ఎన్నో అనుభవాలను మిగిల్చాయన్న ఆయన.. ఇలాంటి ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రజలకు అవగాహన అవసరం అన్నారు. భూకంపాలకు అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తాము ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు మర్చిపోకుండా ఉండటానికి తరచుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అయితే ముందస్తుగా భూకంపాలను గుర్తించడం అసంభవమని ఆయన స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top