ఏం చెప్పానో గుర్తుంచుకుంటా: మోదీ

ఏం చెప్పానో గుర్తుంచుకుంటా: మోదీ - Sakshi

ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఒక్క ఇంజన్ ఉంటే చాలదని, రెండు ఇంజన్లు కావాలని, వాటిలో ఒకటి ఢిల్లీ ఇంజన్ అయితే మరొకటి డెహ్రాడూన్‌దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లో చార్‌ధామ్ హైవే అభివృద్ధి ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను తప్పుడు హామీలు ఇవ్వనని, ఏం చెప్పానో గుర్తుంచుకుంటానని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రసంగం సాగింది. తనకు ఇక్కడివారు అందరి మీద ఒక ఫిర్యాదు ఉందని, 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇక్కడకు వచ్చినప్పుడు మైదానం సగమే నిండిందని, కానీ ఇప్పుడు వేలాది మంది కనిపిస్తున్నారని, దాన్నిబట్టి చూస్తే ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం ఇక ఏమాత్రం ఆగే పరిస్థితి లేనట్లుందని అన్నారు. కేదార్‌నాథ్ దుర్ఘటనలో మరణించిన వారికి నివాళిగానే చార్‌ధామ్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. హడావుడిగా చేపట్టే పనులు కేవలం రాజకీయాల కోసమే తప్ప అభివృద్ధి కోసం కాదని, ప్రజలకు అన్ని విషయాలూ తెలుసని అన్నారు. 

 

కేదార్‌నాథ్, బదరీనాథ్ యాత్రకు వచ్చినవాళ్లంతా ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారని మోదీ చెప్పారు. తన ప్రభుత్వం పేదల కోసమే ఉందని, ఉత్తరాఖండ్‌కు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్‌ను అవకాశాల గనిగా మారుస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తాను పేదల కోసం పనిచేస్తున్నానా.. ధనవంతుల కోసమా అని ప్రజలను ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు 40 ఏళ్లుగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించాయని, కానీ తన ప్రభుత్వంలోనే దాన్ని అమలుచేశానని తెలిపారు. రిబ్బన్లు కట్ చేయడానికి, క్యాండిళ్లు వెలిగించడానికి తాను ప్రధాని కాలేదని చెప్పారు. నల్లధనం మీద తాను యుద్ధం ప్రకటించానని, ఈ యుద్ధంలో మీ అందరి ఆశీస్సులు కావాలని తెలిపారు. అసలు సమస్య నల్లధనం కాదని, కొంతమంది మనసులే నల్లగా ఉన్నాయని అదే అసలు సమస్య అని చెప్పారు. అవినీతి, దోపిడీ అంతమైతేనే భారతదేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. తాము నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం, డ్రగ్ మాఫియా, మానవుల అక్రమరవాణా అన్నింటిపైనా ఒక్క నోట్ల రద్దుతోనే వేటు వేశామని ఆయన చెప్పారు. 

 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top