సీలింక్ వంతెనకు మరింత భద్రత


సాక్షి, ముంబై: బాంద్రా-వర్లీ సీ లింకు వంతెన భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్టున్నట్లు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ), మహారాష్ట్ర ఎంట్రీ పాయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ (ఎంఈపీఐడీ) తెలిపాయి. వంతెనపై భద్రత పెంపునకు అవసరమైన 80 సీసీ కెమరాలు అమర్చనున్నట్లు వారు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఈ వంతెన ఇప్పటికే వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంది. దీనికి తోడు ఈ వంతెనపై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయింది.



 వీటిని అరికట్టేందుకు ఈ వంతెనపై గస్తీ పెంచాలని, నిఘా వేసేందుకు సీసీ కెమరాలు అమర్చేందుకు ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తిచేస్తూ సామాజిక కార్యకర్త కేతన్ తిరోడ్కర్ ముంబై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్  మంగళవారం మధ్యాహ్నం బెంచి ముందుకు విచారణకు వచ్చింది. సీ లింకు వంతెనపై ఉగ్రవాదుల కన్ను పడింది. దీంతో ఈ వంతెనపై వాహనాల్లో రాకపోకలు సాగించే ప్రజల్లో కొంత అభద్రతాభావం నెలకొంది.



 దాదాపు ఐదు కి.మీ. పొడవున్న ఈ వంతెన భద్రతా బాధ్యతలు ఎమ్మెస్సార్డీసీ, ఎంఈపీఐడీ సంస్థలపై ఉన్నాయి. కాని ఈ రెండు సంస్థలు అసలుకే పట్టించుకోవడం లేదని ఆయన తన పిల్‌లో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఇరు సంస్థలు కొట్టిపారేశాయి. ఎంఈపీఐడీ సంస్థకు వంతెనపై టోల్ వసూలు చేసే కాంట్రాక్టు ఇచ్చారు. ఆ సంస్థ అధికారి శాస్వత్‌సింగ్ గద్రే మాట్లాడుతూ ప్రస్తుతం ఈ వంతెనపై 10 సీసీ కెమరాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే రెండు నెలల్లో అదనంగా 80 సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చామని చెప్పారు. అదేవిధంగా ఈ సీ లింకు వంతెన భద్రతకు ఇదివరకే 30 మంది భద్రత సిబ్బందిని నియమించామన్నారు.



 ఈ సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరికి తోడు ప్రతీ షిప్టులో ఇద్దరు చొప్పున రైడర్స్ ఉంటారు. వీరంతా రేయింబవళ్లు వాహనాల రాకపోకలపై దృష్టి సారిస్తారని ఎంఈపీఐడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు సీ లింకు వంతెన పిట్ట గోడ ఎత్తు పెంచడం తమ పరిధిలోకి రాదని, అలాంటి పనులు చేపట్టే అధికారం కూడా తమకు లేదని స్పష్టం చేసింది. వంతెన మధ్య భాగంలో జాలీలు లేదా బారికేడ్ వైర్లతో కంచె ఏర్పాటు చేయడం కూడా వీలుకాదని ఎంఈపీఐడీ పేర్కొంది.

 సీసీ కెమరాల సంఖ్య పెంచితే వాహనాల రాకపోకలపై అతి సమీపం నుంచి దృష్టి సారించవచ్చని, ఎవరైనా వంతెన మధ్యలో వాహనం ఆపి దూకేందుకు ప్రయత్నిస్తే వెంటనే సమీపంలో ఉన్న భద్రత సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చని ఆ సంస్థలు అభిప్రాయపడ్డాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top