నా భర్త వదిలేశాడు.. సుష్మాజీ సాయం చేయండి

నా భర్త వదిలేశాడు.. సుష్మాజీ సాయం చేయండి - Sakshi


ఎన్నారై భర్త తనను వదిలేసి వెళ్లిపోయాడని, తనకు సాయం చేయాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఓ మహిళ కోరారు. తన భర్తను న్యూజిలాండ్‌ నుంచి డిపోర్ట్‌ చేయించి భారతదేశానికి రప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన భర్త రమణ్‌దీప్‌ సింగ్‌ తరచు నేరాలు చేస్తుంటాడని పంజాబ్‌ పోలీసులు ఇప్పటికే ప్రకటించారని, తాను చేసే పోరాటంతో ఇక ఏ ఎన్నారై భర్తా తన భార్యను మోసం చేయకుండా ఉండాలని.. అందుకోసం తనకు సాయం చేయాలని సుష్మా స్వరాజ్‌ను చాంద్‌ దీప్‌ కౌర్‌ (29) కోరారు. ఆమె పంజాబ్‌లోని కపూర్తలా ప్రాంతంలో ఉంటారు. తన భర్త పాస్‌పోర్టు రద్దు చేయాలని, ఇలాంటి మగాళ్లకు బుద్ధి వచ్చేలా కఠినమైన చట్టాలు చేయాలని కూడా ఆమె కోరారు. తన కేసుకు సంబంధించిన పత్రాలు అన్నింటినీ పంపాల్సిందిగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి తనకు ఫోన​ వచ్చిందని చెప్పారు. అతడు తిరిగొచ్చి తనకు విడాకులు ఇస్తే తాను మళ్లీ కొత్తగా జీవితం ప్రారంభిస్తానని అన్నారు.



న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అకౌంటెంటుగా పనిచేస్తున్న రమణ్‌దీప్‌ సింగ్‌ను చాంద్‌ దీప్‌ కౌర్‌ 2015 జూలైలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాగానే అతడు ఆగస్టు నెలలో న్యూజిలాండ్‌ వెళ్లిపోయాడని, తాను అత్తవారింట్లో జలంధర్‌లో ఉన్నానని ఆమె చెప్పారు. 2015 డిసెంబర్‌లో ఒకసారి భారతదేశానికి వచ్చి, మళ్లీ 2016 జనవరిలో వెళ్లిపోయాడని అన్నారు. తాను ఇప్పటివరకు తన భర్తతో కలిసున్నది కేవలం 40-45 రోజులు మాత్రమేనని తెలిపారు. పెళ్లి అయిన తర్వాత తన అత్తమామల ప్రవర్తన బాగా మారిందని, వాళ్లు తమ కొడుకును వదిలేశామని చెప్పి, తనను పుట్టింటికి వెళ్లిపొమ్మన్నారని వివరించారు.



తన భర్తకు ఎన్నిసార్లు ఫోన్‌ చేయడానికి ప్రయత్నించినా అతడు ఆన్సర్‌ చేయలేదదని, తన అత్తమామలు కూడా అలాగే చేశారని కౌర్‌ తెలిపారు. వాళ్లు తన నంబర్‌ను బ్లాక్‌ చేసేశారన్నారు. 2016 ఆగస్టు నెలలో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అతడు మాత్రం ఇంతవరకు ఇంకా తిరిగి రాలేదు. దాంతో తన భర్తను భారతదేశానికి రప్పించాలని సుష్మాస్వరాజ్‌ను కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top