ఏచూరి వర్సెస్‌ కారత్‌

ఏచూరి వర్సెస్‌ కారత్‌ - Sakshi


రాజ్యసభ అభ్యర్థిత్వంపై సీపీఎంలో ముదురుతున్న వివాదం

మూడోసారి ఏచూరికే అవకాశం ఇవ్వాలంటున్న ఓ వర్గం

నిబంధనలు చూపుతూ తిరస్కరిస్తున్న ప్రకాశ్‌ కారత్‌ బృందం




జీకేఎం రావు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి

సీపీఎంలో రాజ్యసభ సభ్యత్వం రెండు గ్రూపుల మధ్య దూరాన్ని పెంచుతోంది. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మూడోసారీ పెద్దలసభలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ప్రణాళికలు వేశారు.పార్టీలో మరో సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారత్‌ వర్గం  దీనిపై విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సీపీఎం పొలిట్‌ బ్యూరో, సెంట్రల్‌ కమిటీ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు (జూలై 28) సమీపిస్తుండటంతో ఈ సమావేశాల్లోనే ఎవరు పోటీ చేస్తారనే దానిపై కేంద్ర కమిటీ స్పష్టతనివ్వనుంది.



ఇద్దరి మధ్య ఉప్పు–నిప్పు

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ల మధ్య రాజ్యసభ విషయంలో తీవ్రమైన విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యమే. గత నెలలో జరిగిన పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలోనే సీతారాం ఏచూరికి మూడోసారి రాజ్యసభ ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నేతలెవరైనా గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కేంద్ర కమిటీలో చర్చ జరిగింది. అయితే, పశ్చిమబెంగాల్, త్రిపుర సీపీఎం యూనిట్లు ఏచూరీని మరోసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెటులో వామపక్ష వాణిని బలంగా వినిపిస్తున్నారని ఏచూరికి మద్దతుగా నిలిచాయి.



మిగిలిన రాష్ట్రాల యూనిట్లలో ఏచూరిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆదివారం పొలిట్‌ బ్యూరో సమావేశం, తర్వాతి మూడ్రోజుల పాటు కేంద్ర కమిటీ భేటీ జరగనుంది. ప్రకాశ్‌ కారత్‌పై ఒత్తిడి పెంచే క్రమంలో గత మే నెలలోనే పశ్చిమబెంగాల్‌ పార్టీ నాయకత్వం.. తమ రాష్ట్రం నుంచి ఏచూరికి మూడోసారి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. దీన్ని కారత్‌ వర్గం (బీవీ రాఘవులు కూడా ఇదే వర్గం) తిరస్కరించింది. ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఎంపీ కాకూడదని.. వ్యవస్థాగత అంశాలు, పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలనేది కారత్‌ వర్గం వాదన. ఏచూరి వర్గం మాత్రం.. పార్లమెంటులో వివిధ పార్టీల ముఖ్యనాయకులతో కలిసి రాజకీయ మేథమథనం జరుగుతున్న సమయంలో తమ పార్టీ సిద్ధాంతాన్ని ఏచూరీయే బలంగా వెల్లడిస్తారంటోంది.



‘రెండుసార్లే’ నిబంధనపై..

పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులకు రెండుసార్లే అవకాశం ఇవ్వాలన్న నిబంధనను కారత్‌ వర్గం గుర్తుచేస్తోంది. అయితే గతంలోనే ఈ నిబంధనకు మినహాయింపు నిచ్చారని.. ఏచూరిని ఏకగ్రీవంగా ఎన్నుకోని పక్షంలో వామపక్ష కూటమిలోని ఫార్వర్డ్‌ బ్లాక్‌ వంటి పలు పార్టీలు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకునే అవకాశం ఉందని ఏచూరి వర్గమంటోంది. పశ్చిమబెంగాల్‌ నుంచి ఏచూరిని గెలిపించుకునేందుకు వామపక్షాలకు 37 మంది కాంగ్రెస్‌ సభ్యుల మద్దతు తప్పనిసరి. అయితే పార్లమెంటులో బీజేపీ, ఇతర మతతత్వ గ్రూపులపై పోరాడే వాక్చాతుర్యమున్న ఏచూరికి తమ మద్దతుంటుందని కాంగ్రెస్‌ అధిష్టానం ఇదివరకే ప్రకటించింది.



కాంగ్రెస్‌ సాయంతో పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభకు ఎన్నికైతే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాలనుకున్న పార్టీ సిద్ధాంతాన్ని విస్మరించినట్లే అనేది కారత్‌ బృందం వాదన. పొలిట్‌ బ్యూరోలోని మెజారిటీ సభ్యులు సైతం కేరళలో లెఫ్ట్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ప్రధాన శత్రువనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.  రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏచూరికి అడ్డుకట్ట వేసేందుకు పొలిట్‌ బ్యూరోలో ఓటింగ్‌ నిర్వహించేలా కారత్‌ వర్గం ప్రయత్నిస్తోందని సమాచారం. దాదాపు 80 మంది సభ్యులున్న పార్టీ కేంద్ర కమిటీలో 8 మంది తెలుగురాష్ట్రాలకు చెందిన వారే (బీవీ రాఘవులు, పి. మధు, ఎంఏ గఫూర్, పాతూరి రామయ్య, ఎస్‌ పుణ్యవతి, తమ్మినేని వీరభద్రం, ఎస్‌ వీరయ్య, సీహెచ్‌ సీతారాములు, శాశ్వత ఆహ్వానితురాలు మల్లు స్వరాజ్యం) ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top