Alexa
YSR
‘సంక్షేమ పథకాలతో ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో ఉండిపోతాం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జాతీయంకథ

రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయాలు

Others | Updated: June 19, 2017 16:13 (IST)
రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయాలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవి అభ్యర్థి ఎంపిక విషయమై ప్రతిపక్షాల మద్దతు సమీకరణకు చర్చలు జరుపుతున్న పాలకపక్ష భారతీయ జనతా పార్టీ అధిష్టానం సోమవారం అనూహ్యంగా ఈ పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరూ ఊహించని విధంగా యోగి ఆదిత్యనాథ్‌ని ఎలాగైతే ఎంపిక చేశారో, అదే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోవింద్‌ను కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ యూనివర్శిటీలో బీకాం ఎల్‌ఎల్‌బీ చదివి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసిన కోవింద్‌ దళితుడవడం ఇక్కడ విశేషం​.

ఆది నుంచి దళితులు లేదా వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తామంటూ  పాలకపక్ష బీజేపీ ఫీలర్లు వదులుతుండటంతో జార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న ద్రౌపది ముర్మీ లాంటి వారి పేర్లు వినిపించాయి. ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో విపక్ష పార్టీలతో సంప్రతింపులు జరపాలని నిర్ణయించిన పాలకపక్షం ముగ్గురు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్‌ సింగ్, అరుణ్‌ జైట్లీతో కమిటీ వేసింది. ఆ కమిటీ ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను వెల్లడించకుండా విపక్షాలతో చర్చలు జరపడంతో అవి ముందుకు సాగలేదు. అభ్యర్థి లేదా అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తేనే తాము మద్దతు ఇచ్చేది, లేనిది తేల్చి చెపుతామని విపక్షాలు షరతు పెట్టాయి. లౌకిక భావాలు కలిగిన వ్యక్తిని మాత్రమే తాము సమర్థిస్తామని కూడా అవి స్పష్టం చేశాయి.

ఈ నేపథ్యంలో  బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై రామ్‌నాథ్‌ కోవింద్‌ అనే దళితుడి పేరును ఎంపిక చేసింది. బీజేపీ తరఫున యూపీ నుంచి  రెండు పర్యాయాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిచిన కోవింద్‌ లౌకిక భావాల గురించి పెద్దగా ఎవరికీ తెలియవు. దళితుడవడం, వివాదాస్పదుడు కాకపోవడంతో కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేందుకు విపక్షాలకు కారణాలేమీ లేవు. ఆ ఉద్దేశంతోనే బీజేపీ కోవింద్‌ పేరును ఖరారు చేసినట్లు అర్థం అవుతోంది. ఇప్పుడు కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్, ఇతర విపక్షాలు సమర్థిస్తే పరువు నిలబడుతుంది. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఒకే వేదికపైకి వచ్చి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి పునాదులు వేసుకోవాలన్న విపక్షాల ఆశ అడియాశ అవుతుంది. మైనారిటీలు మినహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలను దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ అధిష్టానం 20.5 శాతం దళితులున్న యూపీ రాష్ట్రం నుంచే అభ్యర్థిని ఎన్నుకొంది. ఇది విపక్షాలను దెబ్బతీయాలనే రాజకీయ ఎత్తుగడ మాత్రమేనా, దళితుల పట్ల సానుభూతి ఏమైనా ఉందా ? అన్న అంశాన్ని మరింత లోతుగా చూడాలి.

గత నెలలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌  కుషీనగర్‌ జిల్లా పర్యటన సందర్భంగా ముందు రోజు అధికారులు దళితుల ఇళ్లకు వెళ్లి సబ్బులు, షాంపూలను పంచారు. పిల్లాపాపలతో సహా శుభ్రంగా తలంటూ స్నానం చేసి యోగి ప్రారంభించనున్న వాక్సినేషన్‌ కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. ఒక్కరోజు షాంపూ ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమకు ఎవరు షాంపూ, సబ్బులు కొనిస్తారని ఈ సందర్భంగా అధికారులను దళితులు నిలదీశారు. అందరిని సమానంగా చూడాల్సిన ముఖ్యమంత్రే తమ పట్ల భేద భావం చూపిస్తే ఇక సమాజం తమను ఎలా కలుపుకుపోతుందని కూడా ప్రశ్నించారు.

దళితులు తమకు అంటరానివారు కాదని చెప్పడానికి గౌతమ బుద్ధుడు కుషీనగర్‌ జిల్లాలోనే ఓ పాకీ పనివాడిని (హ్యూమన్‌ స్కావెంజర్‌) బౌద్ధ మతంలోకి చేర్చుకున్నారు. బుద్ధుడు చివరకు మరణించిందీ కూడా ఈ జిల్లాలోనే. అందుకనే ఇక్కడి బౌద్ధారామానికి యాత్రికులు విశేషంగా తరలివస్తారు.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

జల్దీ జాబ్స్‌కు దారేది?

Sakshi Post

Second Edition Of RFYS Football Competition Begins 

RFYS chairperson Nita Ambani, a member of the International Olympic Committee (IOC), cheered on by h ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC