సీఎం సీటు ఎక్కడో?

సీఎం సీటు ఎక్కడో?


వివరణ లు ఇచ్చేనా?

ఓపీపై స్టాలిన్ వ్యంగ్యాస్త్రం

కార్యకర్తలకు మోటారు సైకిళ్లు, మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ


 

అసెంబ్లీలో సీఎం సీటు ఎక్కడోనని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూర్చున్న సీట్లో కూర్చునేనా లేదా సీఎం హోదాతో హుందాగా వ్యవహరించేనా?, అమ్మగారి ప్రత్యేక ప్రకటనల గురించి వివరణలు ఇచ్చేనా? అని ప్రశ్నించారు.

 

 సాక్షి, చెన్నై:తమ అధినేత్రి, అమ్మ జయలలితకు జైలు శిక్ష పడడంతో ఆమె ప్రతినిధిగా సీఎం సీటులో ఓ పన్నీరు సెల్వం కూర్చున్న విషయం తెలిసిందే. పోయెస్ గార్డెన్‌లో అమ్మతో చర్చించనిదే ఏ నిర్ణయాన్ని ఆయన తీసుకోరు. ఇంకా చెప్పాలంటే, మీడియాల్లో సైతం తన ఫొటోలు కన్పించకూడదన్నంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు  ఉపయోగించిన  ఛాంబర్‌ను సైతం ఆయన వాడుకోవడం లేదు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఏ మేరకు సౌకర్యాలు, సేవలు ఉన్నాయో వాటితోనే ముందుకు సాగుతున్నారు.

 

 ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు ఆరంభమవుతుండడంతో, సభా మందిరంలో సీఎం పన్నీరు సెల్వం సీటు ఎక్కడో అన్న చర్చమొదలైంది. మంత్రిగా ఉన్నప్పుడు కూర్చున్న సీటుకే పరిమితమయ్యేనా లేదా, జయలలిత సీఎంగా ఉన్న సమయంలో కూర్చున్న ముందు వరుస సీటులో కూర్చుని ఆ పదవికి హుందాతనాన్ని చేకూర్చేనా అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మంగళవారం వ్యంగ్యాస్త్రాల్ని సంధించే పనిలో పడ్డారు.

 

 మంగళవారం ఉదయం ఎగ్మూర్‌లోని ఓ హోటల్లో ఉత్తర చెన్నై డీఎంకే కార్యదర్శి పీకే శేఖర్ బాబు నేతృత్వంలో పేద కార్యకర్తలకు సహాయకాల పంపిణీ జరిగింది. ఇందులో పాల్గొన్న స్టాలిన్ అనేక మంది కార్యకర్తలకు మోటారు సైకిళ్లు, మరెందరికో కుట్టు మిషన్లు తదితర సంక్షేమ పథకాలను అందజేశారు. మొత్తం 1339 మందికి సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు.

 

  ఎంకే స్టాలిన్ తన ప్రసంగంలో సీఎం పన్నీరు సెల్వంను టార్గెట్ చేసి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలను సంధించారు. పీకే శేఖర్ బాబు చేస్తున్న సేవల్ని ప్రశంసిస్తూ, ఉత్తర చెన్నై ప్రజలు, కార్యకర్తలకు ఆయన అందిస్తున్న సహకారాన్ని వివరించారు. రాష్ట్రంలో సాగుతున్న పాలనను బొమ్మల పాలన అని పిలవాలని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వాన్ని మైనారిటీ ...మైనారిటీ అని పదే పదే జయలలిత సంబోధించే వారని గుర్తు చేశారు. మైనారిటీ, అయినా, ఐదేళ్లు తాము పాలన అందించామని, అయితే ఇక్కడ మెజారిటీ ఉన్నా, మూడేళ్లకే జయలలిత ప్రభుత్వం పని ముగిసిందని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలో ఉన్న పన్నీరు సెల్వం స్వతహాగా నిర్ణయాలు తీసుకోక పోవడం శోచనీయమని విమర్శించారు. ఇన్నాళ్లు పోయెస్ గార్డెన్‌కు వెళ్లి వచ్చాకే ఆయన నిర్ణయాలు తీసుకునే వారని గుర్తు చేశారు.

 

 ఇక, అసెంబ్లీలో ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు అప్పుటికప్పుడే సమాధానాలు, వివరణలు ఇచ్చేనా లేదా, పోయెస్ గార్డెన్‌కు వెళ్లొచ్చి సమాధానాలు ఇచ్చేనా? అని ఎద్దేవా చేశారు. అమ్మగారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి రోజు అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు ఏదో ఒక ప్రకటన చేస్తూ ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ప్రకటనల పరిస్థితి, ఆ పథకాలు అమల్లోకి వచ్చాయా, ఏ మేరకు ప్రజలకు సేవలు అందించారో... ఇలా... ఆ ప్రకటనలన్నింటికి అసెంబ్లీ వేదికగా వివరణలు ఇస్తారా...? అని పన్నీరు సెల్వంను ప్రశ్నించారు.

 

 నిలదీస్తాం: అసెంబ్లీ సమావేశాలకు పిలుపునివ్వాలని పదే పదే డిమాండ్ చేసినా పట్టించుకోని పన్నీరు సెల్వం, ఎట్టకేలకు ముందుకు రావడం ఆహ్వానించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీస్తామని, తమ గళం నొక్కేందుకు యత్నిస్తే పోరాడుతామని హెచ్చరించారు. జయలలిత విడుదల చేసిన 125 ప్రత్యేక ప్రకటనలకు వివరణలు ఇచ్చే వరకు వదిలి పెట్టబోమన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతున్నామని, ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజల పక్షాన పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల పెన్నిధి డీఎంకే అని, ఆ ప్రజల కోసం ప్రభుత్వంతో ఢీ కొట్టి, వారి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.  తాను ఒకటే చెప్పదలచుకున్నానని, హుందాతనంతో సీఎం పదవికి న్యాయం చేసే విధంగా పన్నీరు సెల్వం వ్యవహరించాలని హితవు పలికారు. అసెంబ్లీలో ఆయన సీటు ఎక్కడో అన్న చర్చ బయలు దేరిందని, హుందాగా వ్యవహరించి సీఎం సీటులో కూర్చునేనా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలబోతోందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top