దుర్మార్గం చేసి వాట్సాప్‌తో బుక్కు

దుర్మార్గం చేసి వాట్సాప్‌తో బుక్కు - Sakshi


నేవీ ముంబయి: వాట్సాప్‌వంటి సోషల్ మీడియాతో చెడే ఎక్కువగా జరుగుతుందనే ప్రచారం జరుగుతున్నా.. మంచి కూడా జరుగుతుందని చెప్పేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఒంటరిగా ఉన్న తనను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గులను బాధితురాలైన బాలిక ఈ వాట్సాప్‌ ఫొటోల ద్వారానే గుర్తించింది. దీంతో ఆ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నీరుల్‌ పరిధిలోని షిరవానే అనే గ్రామంలో ఓ మహిళ బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. ఆమెకు ఓ పన్నేండేళ్ల కూతురు ఉంది. ఈ నెల (నవంబర్) 22న ఆ పాప అమ్మమ్మకు ఒంట్లో బాగా లేక ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.



అలా తీసుకెళ్లే సమయంలో తాను కూడా వస్తానని చెప్పడంతో వద్దని చెప్పి ఆ బాలిక తల్లి తిట్టింది. దీంతో అలిగి ఇంట్లో నుంచి పారిపోయిన బాలిక కోపర్‌ కైరానే వద్దకు వెళ్లి అక్కడే సెక్టార్‌ 19లోని ఓ గార్డెన్‌లో ఉండటం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఇది గమనించిన మిథున్‌ కైలాష్ మహత్రే(26), అమిత్‌ నరేశ్‌ వేతా(27) అనే ఇద్దరు రియల్టర్లు ఓ బ్లాక్‌ డిజైర్‌ కార్లో వచ్చి మాయమాటలు చెప్పి తాము ఆశ్రయం ఇస్తామని వేతా ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇదే నెల 24న వైషి స్టేషన్ వద్ద ఆ బాలికను వదిలేసి వెళ్లిపోయారు.



దీంతో అక్కడి నుంచి ఆ బాలిక నీరుల్‌కు సమీపంలోని సార్సోల్‌ అనే గ్రామానికి బస్సు ద్వారా తన బంధువుల ఇంటికెళ్లింది. అప్పటికే తన కూతురు తప్పిపోయిందని తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాలిక ఆచూకీ దొరికింది. అనంతరం పోలీసులకు జరిగిన విషయం బాధితురాలు చెప్పడంతో ఘటన ప్రదేశానికి వెళ్లి విచారించారు. మొత్తం పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల మొబైల్‌ ఫోన్లు, అందులోని వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోలు తనిఖీ చేయగా అందులో ఆ ఇద్దరినీ బాలిక గుర్తించడంతో పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి గత ఏడాదే చనిపోవడంతో ఆరో తరగతి చదువుతున్న ఆ బాలిక ప్రస్తుతం ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top