ఉంచుతారా.. ఊడకొడతారా..

ఉంచుతారా.. ఊడకొడతారా..


న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభం మరింత ముదరనుందా.. శనివారం జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ అంశంపై వివాదానికి తెరపడుతుందా.. లేక ఆ నేతలను జాతీయ కార్యవర్గ సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటిస్తారా.. ఇలా పలు ప్రశ్నలు చుట్టుముడుతుండగా.. వారిని పక్కకు పెడతారనే విషయమే తెలుస్తోంది.


అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌లతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వర్గం జరిపిన రాజీ చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఆ సమావేశంలో తమ అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని భూషణ్, యోగేంద్ర కేజ్రీవాల్కు లేఖ కూడా రాశారు. మరి ఆ లేఖపై కేజ్రీవాల్ స్పందిస్తారా.. లేఖ శనివారం నాటి సమావేశానికే వదిలేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే, గురువారంనాటి సమావేశంలోని ప్రధాన అంశాలను ఒకసారి గమనిస్తే...




1.యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ఇప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ మద్ధతుదారులు మరోసారి ఈ సమావేశంలో ఆరోపించారు. కానీ, అవన్నీ అవాస్తవాలని వారు కొట్టిపారేశారు.




2. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని తానెప్పుడూ కోరలేదని, సీనియర్ సభ్యులు తమపై ఈ ఆరోపణలు చేయడం చాలా బాధ కలిగించిందని, దిగ్భ్రాంతికి గురిచేసిందని ఈ సమావేశం అనంతరం మీడియాకు ప్రశాంత్ భూషణ్ తెలియజేశారు.




3. కానీ, అందుకు విరుద్ధంగా కేజ్రీవాల్ మద్దతుదారుడు సంజయ్ సింగ్ అదే మీడియాతో మాట్లాడుతూ చర్చలు ముగిసాయని, ఈ చర్చల్లో పార్టీ పరిస్థితుకన్నా భూషణ్, యోగేంద్ర వారి అహానికే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.




4. 'యాదవ్, భూషణ్కు జాతీయ కన్వీనర్ పదవి ఇచ్చేందుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. కానీ వారు మాత్రం మా అందరిపై ప్రజా వ్యతిరేకులమని ఆరోపణలు చేశారు. కానీ మేం వారిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు' అని అశుతోష్ అనే కేజ్రీవాల్ మద్ధతుదారుడు తెలిపాడు.




5. 'చర్చలు ముగిశాయి. కేజ్రీవాల్ను జాతీయ కన్వీనర్ పదవినుంచి తొలగించాలని వారు నొక్కి చెప్పారు. దానిపై జూలై 28న నిర్ణయం తీసుకుంటాం' అని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ట్విట్టర్లో పేర్కొన్నారు.




6.'ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నుంచి భూషణ్ ను, యోగేంద్రను తొలగించామని, శనివారం వారి విషయంలో ఓటింగ్ నిర్వహిస్తాం' అని సిసోడియానే చెప్పారు.




7.తమ డిమాండ్లు నెరవేరిస్తే అన్ని పదవులు వదులుకుంటామని మార్చి 17న లేఖలు రాశారని, వాటి వెనుక ఉన్న ఉద్దేశం కేజ్రీవాల్ రాజీనామానేని ఆప్ మరోసారి ఈ సమావేశం అనంతరం ప్రస్తావించింది.




8.కానీ, ఆ వెంటనే స్పందించిన అసమ్మతిదారులు 'మేం రాజీనామా చేయం. మా డిమాండ్లు ఎప్పటికీ నెరవేరవు. ఎందుకంటే మమ్మల్ని జాతీయ కార్యవర్గం నుంచి పూర్తిగా తప్పించాలని చాలామంది చూస్తున్నారు' అని అన్నారు.




9.శనివారం ఆప్ మరోసారి ఇదే విషయంపై సమావేశం కానుంది. 24 గంటలు గడిచినంతలోనే ఆప్ నిర్వహించే రెండో సమావేశం ఇది కానుంది.




10. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆప్ రాష్ట్రాల్లోనూ విస్తరించాలనుకుంటుండటంతో ఎలాంటి వివాదాలు లేకుండా త్వరగా పార్టీలో సమస్యలకు ముగింపు పలకాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యోగేంద్ర, భూషణ్ భవితవ్యం శనివారం తేలనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top