చర్చలే ఏకైక మార్గం

చర్చలే ఏకైక మార్గం - Sakshi


కశ్మీర్‌ సమస్య పరిష్కారంపై మెహబూబా ముఫ్తీ

►  లోయలో చర్చలు జరిపేందుకు ప్రధాని సంసిద్ధత



న్యూఢిల్లీ: హింసతో రగులుతున్న కశ్మీరులో పరిస్థితులను చక్కదిద్దడానికి సంబంధిత వర్గాలతో ప్రధాని మోదీ చర్చలకు సుముఖంగా ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెప్పారు. అయితే లోయలో అందుకు అనువైన పరిస్థితులు కల్పించాలన్నారు. కాల్పులు కొనసాగిస్తూ, రాళ్లు రువ్వుకుంటుంటే చర్చలు సాధ్యపడవన్నారు.


మెహబూబా సోమవారం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో 20 నిమిషాల భేటీ అయ్యారు. కశ్మీరులో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి నాటి ప్రధాని వాజ్‌పేయి జరిపిన చర్చలను కొనసాగించాలని ఆమె మోదీకి సూచించారు. ‘కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు మోదీ సంసిద్ధతను వ్యక్తం చేశారు’అని ముఫ్తీ సమావేశమనంతరం మీడియాకు తెలిపారు.



వాజ్‌పేయి అడుగుజాడల్లో నడుస్తాం...

‘నాడు వాజ్‌పేయి ప్రధానిగా, అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు హురియత్‌ కాన్ఫరెన్స్‌తో చర్చలు జరిపారు. వారు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి చర్చలను తిరిగి ప్రారంభించాలి. సమస్య పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గం’అని ముఫ్తీ చెప్పారు.  ‘వాజ్‌పేయి విధానం ఘర్షణలు కాదు... సయోధ్య. కశ్మీర్‌ అంశంలో ఆయన అడుగుజాడల్లో నడు స్తాం’ అని మోదీ చెప్పినట్టు ముఫ్తీ తెలిపారు. ఈ నెల 9 శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నాటి నుంచి లోయలో హింస పెచ్చుమీరి పోయింది.



పీడీపీ నాయకుడి కాల్చివేత

శ్రీనగర్‌: దక్షిణ కశ్మీర్‌ లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) పుల్వామా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ ఘనీని మిలిటెంట్లు రైఫిల్‌తో కాల్చిచంపారు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో అతడి ఛాతీలోకి రెండు బుల్లెట్లు, భుజంలోకి ఒక బుల్లెట్‌ దూసుకుపోయాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు, శ్రీనగర్‌లో వాణిజ్య సముదాయాలు, ధనవంతులుండే ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. పోలీసులపైకి విద్యార్థులు రాళ్లతో దాడికి దిగారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top