ప్రజాస్వామ్యం మా డీఎన్‌ఏలోనే!

ప్రజాస్వామ్యం మా డీఎన్‌ఏలోనే! - Sakshi


* మళ్లీ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం: ప్రధాని మోదీ

* భారతీయుల శక్తిసామర్థ్యాలు అపరిమితం


 

న్యూఢిల్లీ: మరోసారి ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశం భారత్‌కు ఉందని, చైనాకు దీటుగా నిలబడగలదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని 125 కోట్ల మంది శక్తిసామర్థ్యాలను సరైన గాడిలో పెట్టేలా తనవద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. ఆయా అంశాలపై మోదీ స్పందన..

 

ప్రజాస్వామ్యం..

ప్రజాస్వామ్యం భారతీయుల డీఎన్‌ఏలోనే ఉంది. ప్రజాస్వామ్య దేశాలు అభివృద్ధి చెందవనడం సరికాదు. పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వ్యక్తి ప్రధాని కాగలిగాడంటే అది ప్రజాస్వామ్యం ప్రసాదించిన శక్తే. (చైనాలో వలె నియంతృత్వం తరహా అధికారాన్ని కోరుకుంటున్నారా?  అన్న ప్రశ్నకు సమాధానంగా)



భారత్, చైనా సంబంధాలు

భారత్ చైనాలానో.. మరోదేశంలానో మారాల్సిన అవసరం లేదు. భారత్.. భారత్‌లానే ఉంటుంది. పూర్వం భారత్‌ను బంగారు బాతుగా అభివర్ణించేవారు. ఆ స్థాయి అభివృద్ధి సాధించే అవకాశం మళ్లీ వచ్చింది. ఇప్పుడు ‘ఆసియాశకం’ ఆరంభమైంది. భారత్, చైనాలు కలసి అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి. చైనాపై నాకు విశ్వాసం ఉంది. అది అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుందని భావిస్తున్నాను. అయినా, సమస్యల విషయంలో భారత్ కళ్లు మూసుకుని లేదు.

 

‘ఉక్రెయిన్-రష్యా’ సమస్యపై..

ఇరువర్గాలు కూర్చుని, చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నది భారత్ వైఖరి. సమస్యలు వచ్చినప్పుడు సలహాలు చెప్పడానికి చాలామందే ఉంటారు. కానీ గమనిస్తే.. వారే అనేక తప్పులు చేసి ఉంటారు. ఏ తప్పూ చేయని వారే ముందుగా రాయి విసరాలని భారత్‌లో ఒక సామెత ఉంది.

 

అమెరికాతో సంబంధాలు..

భారత్, అమెరికా సంబంధాలను కేవలం ఢిల్లీ, వాషింగ్టన్‌ల మధ్య సంబంధాలుగా చూడకూడదు. అవి మరింత విస్తృతమైనవి. అదృష్టవశాత్తూ ఇరుదేశాలు ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాయి. భారత,అమెరికా దేశాల మధ్య ఎన్నో విషయాల్లో దగ్గరి పోలికలున్నాయి.

 

మహిళలు..

మహిళల గౌరవం విషయంలో రాజీ లేదు. అది మనందరి బాధ్యత. మహిళలకు సమాన స్థాయి, గౌరవం లభించే సంస్కృతి మళ్లీ రావాలి. బాలికా విద్య ముఖ్యమైన విషయం. దానిద్వారా మహిళాసాధికారత సాధ్యమవుతుంది. మహిళలపై హింస విషయంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యల వల్ల మరింత నష్టం జరుగుతోంది.

 

యోగా.. మన మనసొకటి ఆలోచిస్తుంటే.. శరీరం మరో పనిలో ఉండటం మనం గమనిస్తుంటాం. యోగాతో ఆ వైరుద్ధ్యాన్ని జయించవచ్చు. శరీరం, మనసు, మైండ్‌లను యోగా అనుసంధానపరిచి ఏకతాటిపైకి తెస్తుంది.


 

రెండేళ్ల తరువాత..

ప్రజలు మాపై ఉంచిన విశ్వాసం సడలకూడదు. మేమెన్నుకున్న ప్రభుత్వం మా సంక్షేమం కోసం నిజాయితీగా, నిబద్ధదతో పనిచేస్తోందని వారు విశ్వసించాలి. నా మాటలతో కాకుండా, నా చర్యలతో ప్రజల విశ్వాసాన్ని నేను గెలుచుకోగలిగితే.. 125 కోట్ల భారతీయుల శక్తిసామర్ధ్యాలు ఒక్కటై.. భారత్‌ను వృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్తాయి.

 

పనిలోనే ఆనందం..

‘పని చేయని’ తరహా వ్యక్తిని కాదు. పనిలోనే నేను ఆనందం పొందుతాను. పనిలోనే విశ్రాంతి పొందుతాను. ప్రతీక్షణం ఒక కొత్త విషయం లేదా కొత్త ప్రణాళికలపై ఆలోచన చేస్తుంటాను. ఒక శాస్త్రవేత్త గంటలతరబడి పనిచేస్తూ ఎలా ఆనందాన్ని పొందుతాడో.. పరిపాలనలో నాకు ఆ విధంగా సంతోషం లభిస్తుంది... భారతీయులకు అమిత శక్తిసామర్ధ్యాలున్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకునే ‘రోడ్ మ్యాప్’ నా వద్ద ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top