‘హైస్పీడ్ రైలు’కు రెక్కలు!


సాక్షి, ముంబై: కొద్ది నెలలుగా అటకెక్కిన ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న హై స్పీడ్ రైలు ప్రతిపాదన మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ రెండు కీలక నగరాల మధ్య రాకపోకలు సాగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల విలువైన సమయాన్ని తగ్గించేందుకు పశ్చిమ రైల్వే ముందుకు వచ్చింది. అందుకు గంటకు 160 కి.మీ. వేగంతో పరుగులు తీసే హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు అవసరమైన రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది.



అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రతిపాదన మంజూరు కోసం త్వరలో రైల్వే బోర్డుకు పంపించనుంది. బోర్డు ద్వారా మంజూరు లభించగానే అధ్యయనం, భూ సేకరణ లాంటి కీలకమైన పనులు ప్రత్యక్షంగా ప్రారంభమవుతాయి.  ఈ పనులు పూర్తిచేయడానికి సంవత్సర కాలం పట్టవచ్చని అధికారులు అంచనావేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ల నియామకం పనులు పూర్తిచేస్తారు. 495 కి.మీ. పొడవైన ఈ మార్గం కార్యరూపం దాలిస్తే ప్రయాణికుల విలువైన సమయం దాదాపు రెండు గంటలకుపైగా ఆదా కానుందని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో శరత్ చంద్రాయన్ తెలిపారు.



 సాధారణంగా ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో వెళితే ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. అదే గంటకు 160 కి.మీ. వేగంతో హైస్పీడ్ రైళ్లను నడిపితే సుమారు ఐదు గంటలలోపు తమ గమ్యాన్ని చేరుకోవచ్చని చంద్రాయన్ అభిప్రాయపడ్డారు. కాగా ఇలాంటి హైస్పీడ్ రైళ్లను నడపాలంటే ఇప్పుడున్న రైల్వే ట్రాక్స్, ఓవర్ హెడ్ వైర్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రమాదకర మలుపులను తగ్గించాలి.  



 ఇదిలాఉండగా, రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు తొమ్మిది ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో ముంబై-గోవా, ముంబై-అహ్మదాబాద్ మార్గాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమ రైల్వేలో గంటకు 130 కి.మీ. వేగం లోపు  నడిచే రైళ్లు కొన్ని ఉన్నాయి. మొదటి దశలో శతాబ్ధి, దురంతో, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను గంటకు 160 కి.మీ. నడిపేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఆ తర్వాత విడతల వారీగా మిగతా రైళ్లను కూడా నడిపే ప్రయత్నం చేస్తామని చంద్రాయన్ అన్నారు.  భారత దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య నడిపేందుకు ఇదివరకే సన్నహాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకు జపాన్ కంపెనీ ఈ మార్గానికి సంబంధించిన తుది నివేదిక 2015లో సమర్పించనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top