‘అణు’మార్గం సుగమం


  • అమెరికా అధ్యక్షుడికి అపూర్వ స్వాగతం

  •  అణు ఒప్పందంపై ప్రతిష్టంభనకు తెరదించిన మోదీ, ఒబామా

  •  భారత్-అమెరికా అణు ఒప్పందంపై ఆరేళ్ల ప్రతిష్టంభనకు తెర  

  •  ఒబామా, మోదీ చర్చల్లో పరిష్కారం

  •  అణు వాణిజ్య సహకారం అమలుకు నిర్ణయం

  •  సరికొత్త శిఖరాలకు రక్షణ సహకారం..  

  •  రక్షణ రంగంలో 4 ప్రాజెక్టుల్లో సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తికి ఒప్పందాలు

  •  ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా సామర్థ్యాల బలోపేతానికి ద్వైపాక్షిక సహకారం

  •  హైదరాబాద్ హౌస్‌లో ఇరువురి సుదీర్ఘ చర్చల్లో నిర్మాణాత్మక ఫలితాలు, నిర్ణయాలు

  • భారత్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ‘అణు’ ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది.. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరిపిన చర్చలు తెరదించాయి. ఈ అంశంలో అమెరికా అభ్యంతరాలపై భారత్ భరోసా కల్పించింది. ఈ చర్చల్లో అణు ఒప్పందంతో పాటు రక్షణ సహకారం మరింత పెంపు, అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం, ఉగ్రవాదంపై పోరు, వివిధ రంగాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇక భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఒబామా దంపతులకు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలకగా.. రాష్ట్రపతి భవన్‌లో దేశంలోనే అత్యుత్తమమైన ‘21 గన్ శాల్యూట్’, సైనిక వందనం’తోనూ గౌరవించారు. హైదరాబాద్ హౌస్‌లోని లాన్‌లో కూర్చున్నప్పుడు ఒబామాకు మోదీ స్వయంగా ‘చాయ్’ కలిపి ఇచ్చారు. తనకు అపూర్వ ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. భారతీయ సంప్రదాయంలో రెండు చేతులనూ జోడించి ‘నమస్తే’ చెప్పారు.

    న్యూఢిల్లీ: భారత్-అమెరికాల మధ్య పౌర అణు సహకారంపై ఒప్పందం కుదిరిన ఆరేళ్ల తర్వాత.. ఆ ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది. అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఆదివారం ఢిల్లీలో జరిపిన చర్చలు తెరదించాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య హైదరాబాద్ హౌస్‌లో మూడు గంటల పాటు కొనసాగిన చర్చల్లో.. అణు ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు.. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంపైనా ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. అణు ఒప్పందం అమలుపై గణనీయ ఫలితం సాధించామని ఒబామా అభివర్ణించినప్పటికీ, దీని విధివిధానాలు ఏంటనేది వెంటనే తెలియరాలేదు. హైదరాబాద్‌హౌస్‌లో ఒబామా, మోదీలు ముఖాముఖిగా, ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో కలసి, ఇరువురూ తోటలో విహరిస్తూ చర్చలు జరిపారు. తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు  కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు.

     

    అణు వాణిజ్య సహకారం దిశగా ముందడుగు.. ‘‘భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న తొలి అమెరికా అధ్యక్షుడు, భారత్‌లో రెండోసారి పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే అన్న వాస్తవం. రెండు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు సూచికలు. కొద్ది నెలలుగా ఈ సంబంధంలో కొత్త ఉద్విగ్నత, విశ్వాసాలు నాకు కనిపించాయి. మా సంబంధాల్లో నూతనోత్తేజం కనిపించింది. గత సెప్టెంబర్‌లో ఇందుకు నేపథ్యాన్ని నెలకొల్పినందుకు మీ నాయకత్వానికికృతజ్ఞతలు చెప్తున్నా. కొత్త రూపం తీసుకున్న మన సంబంధాల్లో పౌర అణు ఒప్పందం కేంద్ర బిందువు. ఇది కొత్త విశ్వాసాన్ని రుజువుచేసింది. ఇది కొత్త ఆర్థిక అవకాశాలనూ సృష్టించింది. స్వచ్ఛ ఇంధనశక్తి కోసం మన అవకాశాలను విస్తరించింది. 4 నెలలుగా దీనిని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేం కృషి చేశాం. ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసిన ఆరేళ్ల తర్వాత మా చట్టానికి, మా అంతర్జాతీయ న్యాయ బాధ్యతలకు, సాంకేతికంగా, వాణిజ్యపరంగా ఆచరణ సాధ్యతలకు అనుగుణంగా వాణిజ్య సహకారం దిశగా ముందడుగు వేస్తుండటం నాకు సంతోషాన్నిస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు.

     

    అవరోధాలకు నేడు పరిష్కారం సాధించాం.. ఒబామా మాట్లాడుతూ.. ‘మా పౌర అణు సహకారంపై ముందుకెళ్లకుండా నిరోధిస్తున్న రెండు అంశాలకు ఈ రోజు మేం పరిష్కారం సాధించాం. దానిని పూర్తిస్థాయిలో అమలు చేయటానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు. ‘ఇది చాలా ముఖ్యమైన ముందడుగు. మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేం ఉమ్మడిగా ఎలా కృషి చేయగలమనేది ఇది చాటుతోంది’ అని అన్నారు. నాలుగు అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో భారత్‌కు త్వరగా పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించేలా మద్దతిచ్చేందుకు అమెరికా కృషి చేస్తుందని కూడా ఒబామా హామీ ఇచ్చినట్లు మోదీ తెలిపారు.   ‘రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలనీ నిర్ణయించాం.ఆధునిక రక్షణ ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని, ఉత్పత్తి చేయాలని అంగీకారానికి వచ్చాం.  దేశీయ రక్షణ పరిశ్రమ స్థాయి పెరగటానికి, భారత్‌లో తయారీ రంగ విస్తరణకు ఇవి దోహదపడతాయి’ అని మోదీ అన్నారు.  

     

    ఉగ్రవాద సంస్థల మధ్య తేడా చూపరాదు..



    ప్రస్తుత సవాళ్లు అలాగే ఉన్నప్పటికీ ఉగ్రవాదమనేది ముఖ్యమైన ప్రపంచ ముప్పుగానే ఉందని, అది సరికొత్త రూపం తీసుకుంటోందని మోదీ పేర్కొన్నారు. ‘ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి సమగ్ర అంతర్జాతీయ వ్యూహం, విధానం అవసరమని అగీకారానికి వచ్చాం. ఉగ్రవాద సంస్థల మధ్య ఎలాంటి భేదమూ చూపరాదు. ఉగ్రవాదులకు భద్రమైన ఆవాసాలుగా ఉన్న ప్రాంతాలను నిర్మూలించేందుకు, వారిని చట్టం ముందు నిలిపేందుకు ప్రతి దేశమూ తన బాధ్యతను నిర్వర్తించాలి’ అని  చెప్పారు. ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను, సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకోవడానికి రెండు దేశాలూ ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేస్తాయన్నారు. ముంబైపై 26/11 ఉగ్రవాద దాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్తాన్‌కు అమెరికా, భారత్‌లు స్పష్టం చేశాయి.



    ప్రాంతీయ సహకారం గురించి  ప్రస్తావిస్తూ.. రెండు దేశాల భవిష్యత్తుకు, ప్రపంచ భవిష్యత్తుకు కీలకమైన ఆసియా పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సుసంపన్నతలను పెంపొందించేందుకు సహకారాన్ని బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను ఇరు దేశాలూ పునరుత్తేజితం చేశాయన్నారు. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా బలగాలను పూర్తిగా ఉపసంహరించిన తర్వాత అఫ్ఘాన్ పరిణామక్రమంలో దోహదపడేందుకు కృషి చేయటంపై కూడా ఒబామా, తాను చర్చించామని మోదీ చెప్పారు. అఫ్ఘాన్ ప్రజలకు తమ రెండు దేశాలూ  విశ్వసనీయమైన భాగస్వాములుగా ఉంటాయని ఒబామా పేర్కొన్నారు. ‘ఇరు దేశాల పురోభివృద్ధికి, ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సుస్థిరత, సుసంపన్నత ముందుకెళ్లడానికి భారత్ - అమెరికాల భాగస్వామ్యం విజయవంతం కావడం ముఖ్యం. విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, నవీన ఆవిష్కరణ, వ్యవసాయం తదితరాల్లో  భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తాం’ అని మోదీ చెప్పారు.

    ఇరు దేశాల మధ్య హాట్ లైన్‌లు నెలకొల్పుతాం




    ‘మన విస్తృత ప్రాంతంలో అభివృద్ధి, అనుసంధానాన్ని పెంపొందించేందుకు కలిసి కృషిచేయాల్సిన బాధ్యతను చేపట్టినపుడే వ్యూహాత్మక భాగస్వామ్యం పరిపూర్ణమవుతుంది. దీనిని ప్రాధాన్యంగా గుర్తించి ఈ లక్ష్య సాధనకు కృషిచేయాలని ఒబామా నేనూ అంగీకరించాం. మా సంబంధం ఈ రోజు కొత్త స్థాయికి చేరింది. ఈ శతాబ్దపు అవకాశాలను, సవాళ్లను ప్రతిఫలించేలా మా స్నేహానికి, సహకారానికి విస్తృత ప్రణాళికను రచించాం. భారత్ - అమెరికాలు చాలా తరచుగా శిఖరాగ్ర సదస్సులు నిర్వహించాలని  అంగీకారినికి వచ్చాం. అమెరికా, భారత్‌ల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య హాట్‌లైన్‌లను కడా నెలకొల్పుతాం. ఈ ఏడాది ఆరంభంలో మేం సరికొత్త ప్రయాణం మొదలు పెడతాం’ అని చెప్పారు.

     

     ‘అణు’మానాలు తొలగినట్లే..

     అణు బాధ్యతకు ‘సమీకరణ నిధి’ పరిష్కారం

     

    భారతదేశపు ‘అణు బాధ్యత చట్టం’లోని.. అణు విద్యుత్ ప్లాంట్లలో అణు ప్రమాదాలేవైనా జరిగినట్లయితే సంబంధిత అణు సరఫరాదారులే నేరుగా బాధ్యత వహించాలన్న నిబంధనపై అమెరికాకు చెందిన అణు రియాక్టర్ల తయారీ సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తుండడం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం.. ఏదైనా అణు ప్రమాదం సంభవిస్తే ప్రభావితులకు పరిహారం చెల్లించేందుకు రియాక్టర్ నిర్వహణ సంస్థ రూ. 1,500 కోట్లు పక్కన పెట్టాలి. అయితే.. సరఫరాదారుల నుంచి నిధుల హక్కును నిర్వహణదారు కోరవచ్చు. ఈ నిబంధన వల్ల భారత అణు రంగంలో పెట్టుబడులు పెట్టడం కష్టమవుతోందని విదేశీ అణు సరఫరాదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అణు రియాక్టర్లకు బీమా కల్పించే అంశమూ పీటముడిగా మారింది. అలాగే.. భారత్‌కు సరఫరా చేసే అణు ఇంధనాలను వాటికి సంబంధించిన అణు రియాక్టర్లకు చేరుతున్నాయో లేదో తాను స్వయంగా పర్యవేక్షించి, పరిశీలిస్తానని అమెరికా పట్టుపడుతోందని, ఇందుకు భారత్ వ్యతిరేకిస్తోందని, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) భద్రతా ప్రమాణాల మేరకే పనిచేస్తామని చెప్తోందని సమాచారం. పౌర అణు ఒప్పందం అరేళ్లుగా అమలుకాకపోవటానికి ఈ రెండు కీలక అంశాలే కారణం కాగా.. వీటిపై తాజాగా ఎలాంటి పరిష్కారాలు కనుగొన్నారన్నది తెలియరాలేదు. అయితే.. అణు ప్రమాదం జరిగిన పక్షంలో అందుకు సంబంధిత సరఫరాదారులే బాధ్యత వహించాలన్న నిబంధన విషయంలో అమెరికాకు భరోసా ఇచ్చేందుకు భారత్ ఒక ప్రతిపాదన చేస్తోంది. అణు ప్రమాదం జరిగినా అమెరికా అణు రియాక్టర్ల సంస్థలపై భారం పడకుండా భద్రత కల్పించేందుకు తాము ఒక సమీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్తోంది. రియాక్టర్లకు బీమా కల్పించేందుకు విదేశీ సంస్థలను అనుమతించటానికి సుముఖంగా లేని భారత్.. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కోరింది. అయితే.. ఆ సంస్థ వద్ద ఇందుకు అవసరమైనంత ఆర్థిక సామర్థ్యం లేదు. దీంతో.. పలు కంపెనీలు తమ నిధులను ఒక చోటకు సమీకరించి రియాక్టర్లకు బీమా కల్పించేలా.. అణు బీమా సమీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు నాలుగు ప్రభుత్వ బీమా సంస్థలు రూ. 750 కోట్లను సమీకరించాయి. ఇది అవసరమైన మొత్తంలో కేవలం సగం మాత్రమే కావటంతో..ఏదైనా ప్రమాదం జరిగిన పక్షంలో మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే కేటాయిస్తుంది.  కాగా, అణు ప్రమాదాలకు బాధ్యత, అణు పదార్థాల జాడ తెలుసుకోవడానికి సంబంధించి అమెరికాకు ఉన్న అభ్యంతరాలు.. ఒబామా - మోదీ సమావేశంలో కుదిరిన అవగాహనతో పరిష్కారమయ్యాయని ఆ దేశ ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ వాషింగ్టన్‌లో అన్నారు. మరోవైపు. ప్రతిష్టంభనను  బద్దలుకొట్టామని,   అణు బాధ్యత నిబంధన, అణు ఇంధనం జాడ తెలుసుకోవటంపై అమెరికాకు భరోసాలు ఇచ్చామని భారత ప్రభుత్వం తెలిపింది.

     

    ‘మీతో ఎక్కువ వ్యాపారం చేయాలనుకుంటున్నాం’



    ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బిట్)పై చర్చలను పునఃప్రారంభించాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. రెండు దేశాల్లోనూ పరస్పర పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై 2008 నుంచి చర్చలు జరుగుతున్నాయి. భారత్, అమెరికాల వాణిజ్యం గత కొన్నేళ్లలో 60 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఒబామా చెప్పారు. ‘మరింత ఎక్కువగా వ్యాపారం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వ్యాపారం చేయడం మరింత సులభం చేస్తూ ప్రధాని అమలు చేస్తున్న సంస్కరణలను స్వాగతిస్తున్నాం. మరింత ఎక్కువ మంది భారతీయులను బ్యాంకు ఖాతాలతో సాధికారం చేయాలని, భారతీయులకు పరిశుభ్రమైన నీరు, గాలి అందించాలని  మోదీ చేస్తున్న కృషిని నాకు వివరించారు. ఈ కృషిలో భాగస్వాములం కావాలని కోరుకుంటున్నాం’  అని పేర్కొన్నారు. కాగా,  అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులకు ముఖ్యమైన సామాజిక భద్రత ఒప్పందంపై చర్చలను కూడా పునఃప్రారంభిస్తామని మోదీ చెప్పారు.

     

    రక్షణ ఒప్పందం పొడిగింపు



    భారత్-అమెరికాల మధ్య ఈ ఏడాదితో ముగియనున్న 2005 నాటి రక్షణ చట్ర ఒప్పందం (డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్)ను మరో పదేళ్లు కొనసాగించేలా తాజాగా ఒప్పందం ఖరారైంది. ఉన్నతస్థాయి రక్షణ సామగ్రిని సంయుక్తంగా  ఉత్పత్తి చేయటానికి ఇది తోడ్పాటునిస్తుంది. ఇందులో భాగంగా ఖరారుచేసిన డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనీషియేటివ్ కింద.. కొత్త తరం రావెన్ మిని యూఏవీలు, సి-130 సైనిక రవాణా విమానానికి ప్రత్యేక కిట్లు, మొబైల్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ పవర్ సోర్స్, యూనిఫాం ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్షన్  ఇంక్రిమెంట్ 2 అనే ప్రాజెక్టులను  అభివృద్ధి చేయటం, ఉత్పత్తి చేయటం చేపట్టాలని నిర్ణయించినట్లు భారత్ తెలిపింది.  

     

    ‘క్లీన్ ఎనర్జీ’కి మద్దతు

     

    స్వచ్ఛ ఇంధనశక్తి (క్లీన్ ఎనర్జీ) కోసం, వాతావరణ మార్పు అంశాలపై పోరాటంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందిస్తామని భారత్, అమెరికాలు ప్రకటించాయి. వచ్చే వేసవి కాలంలో భారత్‌లో క్షేత్రస్థాయి పెట్టుబడి అధికారిని నియమించటం ద్వారా స్వచ్ఛ ఇంధనశక్తికి నిధులను వేగవంతం చేయడానికి అమెరికా అంగీకరించింది. ఈ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడులను రప్పించేలా మద్దతివ్వడానికి ఒక బృందాన్నీ నియమిస్తామని పేర్కొంది. వాతావరణ మార్పు అంశంపై చర్చల్లో భారత్ వాణి చాలా ముఖ్యమైనదని ఒబామా పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో అమెరికా - చైనాల మధ్య కుదిరిన ఒప్పందం తరహా ఒప్పందం కుదుర్చుకునేలా భారత్‌పై ఒత్తిడి ఉందా?  అని విలేకర్లు మోదీని ప్రశ్నించగా.. ‘ ఏ ఒత్తిడి అనేది భారత్‌పై ప్రభావం చూపదు. అయితే.. భవిష్యత్ తరానికి మనం ఎలాంటి వాతావరణం అందిస్తామనేదానిపై ఒత్తిడి ఉంది. వాతావరణ మార్పు అనేదే ఒత్తిడి. భూతాపోన్నతి అనేదే ఒత్తిడి’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top