రాజ్నాథ్ వద్దకు ముష్కిల్ సినిమా పంచాయితీ!

రాజ్నాథ్ వద్దకు సినిమా పంచాయితీ!


న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీకి  బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ మొహం చాటేసినట్లు కనిపిస్తోంది. ఆయన  గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలుస్తారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ భేటీకి కరణ్ జోహార్ హాజరు కావడం లేదని, ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు హోంమంత్రిని కలవనున్నట్లు నిర్మాత ముఖేష్ భట్ తెలిపారు. కాగా పాకిస్థానీ హీరో నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు చిక్కులు ఎదురు కావడంతో ఈ విషయాన్ని రాజ్నాథ్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆ సినిమా యూనిట్ యత్నిస్తోంది. కాగా ఏ దిల్ హై ముష్కిల్ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన  విషయం తెలిసిందే.



అయితే ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు పవాద్‌ ఖాన్‌ నటించడం వివాదాస్పదంగా మారింది. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ కళాకారులు నటించిన ఈ సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) హెచ్చరిస్తుండగా, మరోవైపు బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కూడా ఈ సినిమాను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 28న విడుదల కావల్సిన ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ సినిమాను విడుదల చేసేందుకు పోలీసు బందోబస్తు ఇస్తుందా.. లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌తో  ఆ చిత్ర యూనిట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.



జమ్ము–కాశ్మీర్‌లోని ఉడీ ప్రాంతంలో సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిచేసిన తర్వాత భారత చలన చిత్రాల్లో పాకిస్తాన్‌ కళాకారులకు నటించే అవకాశమివ్వ కూడదని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే బాలీవుడ్‌ నిర్మాతలను హెచ్చరించారు. కాని ఈ నెల 28న విడుదల కానున్న పాకిస్తాన్‌ నటుడు పవాద్‌ ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఉడీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే.


ఈ ఘటనతో దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్‌ కళాకారులు నటించిన సినిమాలను విడుదల కానివ్వమంటూ, పాక్‌ కళాకారుల షూటింగులు కూడా కొనసాగనివ్వమని ఎంఎన్‌ఎస్‌ చలనచిత్ర సేన ప్రకటించింది. ఇది జరిగిన అనంతరం పాకిస్తాన్‌ కళాకారులపై నిషేదం విధించారు. ముంబైలోని సింగిల్‌ స్క్రిన్‌ థియేటర్ల యూనియన్‌ కూడా పాకిస్తాన్‌ కళాకారులు నటించిన సినిమాలను తమ థియేటర్లలో ఆడించవద్దని నిర్ణయం తీసుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top