భూబిల్లుపై పోరాటం

భూబిల్లుపై పోరాటం - Sakshi

  • ప్రభుత్వం వెనక్కు తీసుకునేదాకా ఉద్యమిస్తాం: రాహుల్‌గాంధీ

  • రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ

  • అన్నదాతల సమస్యలు, పంటనష్టంపై ఆరా

  • నేడు రాంలీలా మైదానంలో రైతుసభ

  • న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని, దీన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరుగని పోరు సాగిస్తామన్నారు. దాదాపు రెండు నెలల సెలవుల తర్వాత తొలిసారిగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. శనివారమిక్కడ తన నివాసంలో రైతు సంఘాల ప్రతినిధులతో రెండు విడతలుగా సమావేశమై భూసేకరణ బిల్లుపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇటీవలి అకాల వర్షాలతో పంటలకు జరిగిన న ష్టంపై ఆరా తీశారు. పంటలను ప్రభుత్వం ఏ ధరకు సేకరిస్తోందని అడిగారు. భూసేకరణ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా అన్నారు. రైతు సమస్యలపై తమ పోరాటం ఒకరోజు, నెల, ఏడాదికో పరిమితం కాదని రైతులతో రాహుల్ అన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

     

     రైతు సమస్యలకు ప్రభుత్వం సహేతుక పరిష్కారం చూపే వరకు పోరు కొనసాగిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయి సమస్యలు, వ్యవసాయం అంటే తెలియని వారు రైతు విధానాలకు రూపకల్పన చేస్తున్నారని కొందరు రైతులు రాహుల్‌తో అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంతోపాటు గత యూపీఏ సర్కారులో కూడా ఇదే జరిగిందని పేర్కొన్నారు. ఆదివారం రాంలీలా మైదానంలో జరిగే రైతు సభలో రాహుల్ ఈ అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం. 2011లో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా తాను పాదయాత్ర చేపట్టిన భట్టా పర్సౌల్‌కు చెందిన రైతు ప్రతినిధులతోపాటు హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌కు చెందిన రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్, రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్, ఉత్తరప్రదేశ్ పీసీసీ అధినేత నిర్మల్ ఖత్రి, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కె.రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం తన నివాసం ముందున్న వందలాది మంది రైతులతో దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మరికొందరు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను చూపించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో.. రైతు సమస్యలను రాహుల్ సభలో లేవనెత్తుతారని పార్టీ తెలిపింది.

     

     ‘జమీన్ వాపసీ’ వెబ్‌సైట్ ప్రారంభం.. భూసేకరణ బిల్లుపై సామాజిక మీడియాలో కూడా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకు శనివారం ప్రత్యేకంగా ‘జమీన్ వాపసీ’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.  సైట్‌ను పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రారంభించారు. రైతులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఈ సైట్ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. ప్రధాని మోదీ అవాస్తవాలతో ప్రజలను మోసపుచ్చుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మరోవైపు భూసేకరణ బిల్లుపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. కేంద్రమంత్రి గడ్కారీ ఎప్పుడంటే అప్పుడు తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆదివారం నాటి రైతు బహిరంగ సభకు దిగ్విజయ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top