అవినీతిని అంతం చేశాం!


అదే మా ఘన విజయం

విధాన నిర్ణయాల్లో వేగం, కచ్చితత్వం, పారదర్శకత

ఎన్డీఏ ఏడాది పాలన విజయాలను వివరించిన జైట్లీ




న్యూఢిల్లీ: ఏడాది పాటు దేశానికి అవినీతి రహిత పాలనను అందించడమే తాము సాధించిన గొప్ప విజయమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ రంగంలో, ప్రభుత్వ రంగంలో అవినీతి అంతమైందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది పాలనలో మోదీ సర్కారు  సాధించిన విజయాలను జైట్లీ శుక్రవారం మీడియాకు వివరించారు.



ఆర్థికరంగాన్ని మళ్లీ గాడిన పెట్టడం, విధాన నిర్ణయ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడం, పెట్టుబడుల్లో సాధించిన పురోగతి.. ఈ ఏడాదిలో సాధించిన విజయాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ సేకరణ బిల్లు, జీఎస్టీ బిల్లు వచ్చే సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం పొందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.   తమతో కలసిరాకుండా, అభివృద్ధిని అడ్డుకునే విధానాలను కాంగ్రెస్ అవలంబిస్తోందని ఆరోపించారు. గొడ్డుమాంసం తినకుండా ఉండలేని వారంతా పాకిస్తాన్ వెళ్లిపోండంటూ మంత్రివర్గ సహచరుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేసిన వ్యాఖ్యను జైట్లీ ఖండించారు.



ఎన్డీఏ ఏడాది పాలన విజయాలను ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రులంతా దేశవ్యాప్తంగా పాతిక ప్రెస్ మీట్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మీడియాతో జైట్లీ భేటీ జరిగింది. జైట్లీ తెలిపిన వివరాలు..


  • యూపీఏ హయాంలో నెలకొన్న నిస్తేజ, నిరాశావాద వాతావరణాన్ని విజయవంతంగా తొలగించి.. ఉత్సాహపూరిత, ఆశావాద వాతావరణాన్ని నెలకొల్పగలిగాం.

  • దేశంలోకి పెట్టుబడులు వస్తున్నాయి. వృద్ధి రేటు రెండంకెలకు చేరాలంటే.. ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలి.

  • {పధాని మోదీ విదేశీ పర్యటనల వల్ల అంతర్జాతీయంగా భారత్ ప్రత్యేక స్థానం సంపాదించగలిగింది. (55 రోజుల పాటు సెలవు తీసుకుని విదేశాల్లో గడిపి రావడం వేరు, దేశ ప్రతినిధిగా మరో దేశంలో పర్యటించడం వేరు అంటూ.. రాహుల్ ఇటీవలి సుదీర్ఘ సెలవుపై చురకలేశారు)

  • అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. వేగంగా, కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకోవడమే మా ప్రభుత్వ ప్రత్యేకత.

  • గతంలో లాగా, దర్యాప్తు సంస్థలు ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవహరించే పరిస్థితి ఇప్పుడు లేదు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top