మతహింసపై ఉక్కుపాదం

ప్రధాని నరేంద్ర మోదీ - Sakshi


 ప్రధాని మోదీ స్పష్టీకరణ

 ఏ మతమైనా విద్వేషాలు

రెచ్చగొట్టడాన్ని అనుమతించం

మతహింసకు పాల్పడితే కఠిన చర్యలు

అన్ని మతాలను సమానంగా

 గౌరవించే ప్రభుత్వం మాది


మత సామరస్యం భారతీయులందరి డీఎన్‌ఏలో ఉండాలన్న ప్రధాని

 ఏ మత సంస్థ అయినా.. మైనారిటీ కానీ, మెజారిటీ కానీ.. రహస్యంగా కానీ, బహిరంగంగా కానీ..ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని

 నా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదు. అన్ని మతాలను సమానంగా గౌరవించే ప్రభుత్వం నాది. నా ప్రభుత్వంలో ప్రజలందరికీ పూర్తి మత విశ్వాస స్వేచ్ఛ ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే, ఆరాధించే తిరుగులేని హక్కు అందరికీ ఉంటుంది.

 - ప్రధాని నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ: సహచరుల హిందూత్వ వ్యాఖ్యలపై, ఢిల్లీలో చర్చిలపై జరిగిన దాడులపై ఇన్నాళ్లుగా పెదవి విప్పని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు మంగళవారం మౌనం వీడారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏ మత సంస్థనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏ మతం వారైనా మతహింసకు పాల్పడితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందన్నారు. కురియకోస్ అలియాస్ చవర, మదర్ యూఫ్రేసియాలకు సెయింట్ హోదా లభించిన సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏ మత సంస్థ అయినా.. మైనారిటీ కానీ, మెజారిటీ కానీ.. రహస్యంగా కానీ, బహిరంగంగా కానీ.. ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని నా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదు. అన్ని మతాలను సమానంగా గౌరవించే ప్రభుత్వం నాది. నా ప్రభుత్వంలో ప్రజలందరికీ పూర్తి మత విశ్వాస స్వేచ్ఛ ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే, ఆరాధించే తిరుగులేని హక్కు అందరికీ ఉంటుంది’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. 


‘ఏ కారణంతో అయినా సరే.. ఏ మతానికి వ్యతిరేకంగా అయినా సరే హింసకు పాల్పడటాన్ని నేను సహించబోను. అలా హింసకు పాల్పడేవారిపై ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది’ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మతం ప్రాతిపదికన విద్వేషాలు చెలరేగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రాచీన కాలం నుంచీ భారత్ అవలంబించిన మత సహనాన్ని, పరమత గౌరవాన్ని అంతర్జాతీయ సమాజం అనుసరించాల్సిన పరిస్థితి నెలకొందని మోదీ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచం ఇప్పుడు నాలుగురోడ్ల కూడలిలో ఉంది. దీన్ని సరిగ్గా దాటలేకపోతే.. మత దురభిమానం, మత మౌఢ్యం, రక్తపాతం రాజ్యమేలిన చీకటి రోజుల్లోకి మళ్లీ వెళ్లిపోతాం’ అని హెచ్చరించారు. మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడి బోధనలను గుర్తు చేస్తూ.. అన్ని మతాలను సమానంగా గౌరవించే లక్షణం ప్రతీ భారతీయుడి డీఎన్‌ఏలో ఉండాలన్నారు. ప్రాచీన భారత మత విధానం స్ఫూర్తిగా పరమత సహనం అలవర్చుకోవాలని, అన్ని మతాలను గౌరవించి, సామరస్యత పెంపొందేందుకు కృషి చేయాలని అన్ని మతాల సంస్థలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం, చరిత్రాత్మక హేగ్ ప్రకటనల్లో పేర్కొన్న అంశాలను తన ప్రభుత్వం తు.చ. తప్పకుండా పాటిస్తుందని హామీ ఇచ్చారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్( అందరితో కలసి.. జనులందరి అభివృద్ధి)’ అనే తన ప్రగతి మంత్రాన్ని గురించి ఈ సందర్భంగా మోదీ వివరించారు.


‘ప్రతీ పళ్లెంలో ఆహారం, పాఠశాలలో ప్రతీ చిన్నారి, ప్రతీ ఒక్కరికి ఉద్యోగం, టాయిలెట్, విద్యుత్ సౌకర్యాలతో ప్రతీ కుటుంబానికి ఇల్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ లక్ష్యం’ అని విశదీకరించారు. అయితే మనమంతా ఐకమత్యంగా కృషి చేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. ‘ఐక్యంగా ఉంటే బలంగా ఉంటామని, విడిపోతే బలహీనులమవుతామని పేర్కొన్నారు. ఆరెస్సెస్ నేతలు, బీజేపీ ఎంపీలు, హిందూ సంస్థల ప్రతినిధులు ఇటీవల చేస్తున్న హిందూత్వ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించకపోవడం, ఢిల్లీలో ఈ మధ్య చోటుచేసుకున్న చర్చిలపై, క్రిస్టియన్ పాఠశాలపై దాడులను ఖండించకపోవడం.. మొదలైనవి మోదీపై విమర్శలకు తావిచ్చాయి. అలాగే, భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం భారత్‌లో మత అసహనం పెరుగుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో చర్చిలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ.. బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామని, అలాంటివారికి భారత్‌లో స్థానం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, ఆర్చ్ బిషప్‌లు అండ్య్రూ తాఝా, అనిల్ కౌటొ తదితరులు కూడా పాల్గొన్నారు. క్రిస్టియన్ స్కూళ్లపై దాడులను ఖండించిన అండ్రూ.. మిషనరీ పాఠశాలలు విద్యకే ప్రాధాన్యమిస్తాయి కానీ మత మార్పిడులకు కాదని స్పష్టం చేశారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మిషనరీ స్కూళ్లలో చదువుకున్న వారేనని గుర్తు చేశారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందిస్తూ.. ఇప్పటికైనా ప్రధాని మౌనం వీడడం సంతోషకరమని వ్యాఖ్యానించింది.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top